రైతులకు శాశ్వత ఉపశమనం కావాలి

రైతులకు శాశ్వత ఉపశమనం కావాలి
February 05 14:37 2018
కడుపునిండా జొన్న అంబలి తాగి, పెరట్లో పెరిగిన పొగాకు చుట్ట దమ్ము లాగుతూ నేనెవడికి మోతాదు అన్నట్లు వ్యవసాయం పనుల్లో నిమగ్నమై బతికే రైతు మెడ కు ఉరితాడు, చేతికి పురుగులమందు డబ్బా రావడంలో స్వయంకృతం లేనేలేదు. అధిగ దిగుబడులు, వాణిజ్యపంటలు అంటూ రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలవైపు వారిని మళ్ళించింది ప్రభుత్వ స్వార్థపు ఆలోచనలే. రైతును సుడిగుండంలోకి నెట్టి కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు అన్ని ప్రభుత్వాలు నటిస్తున్నాయి. ఎన్నికలొచ్చినప్పుడల్లా, రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని రైతుల ఓట్లను లాగేసుకోడానికి పథకాల పాశాల్ని విసురుతున్నాయి. సుమారు 40ఏళ్ళ నుండి రైతు రుణాల మాఫీ, వడ్డీ రాయితీ, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ ఇలా ఎన్ని మలాములు పూసినా రైతుకు పట్టిన చీడ వదలడం లేదు. కొన్నేళ్ళు వర్షాలు సరిగా లేక రైతు పడుతున్న కష్టాలను ప్రకృతిపైకి నెట్టిన పాలకులు ఈ సంవత్సరం పండిన పంటకు గిట్టుబాటు ధరను అందించలేకపోయారు. పంటలు పండక పోవడమే తమ నష్టాలకు కారణమనుకున్న రైతుకు పండిన పంటకు లాభదాయకధర రాకపోవడంతో కొత్త గండం ఎదురైంది. ఇంతకాలం ప్రభుత్వాల ముందు దేహీ అని ఎదురు చూసి రైతులు పోయినేడు ఎన్నో ఆందోళనలను చేపట్టారు. రైతు కుటుంబాలకు చెందిన చదువుకున్న యువత ఉద్యోగాలు దొరకక వ్యవసాయం వైపు దృష్టి పెట్టారు. తమ పెద్దల తీరు కాకుండా వారు సంఘటితమై సమస్యల సాధనకోసం రోడ్లెక్కుతున్నారు. పోయినేడు వివిధ రాష్ట్రాల్లో ఎగిసిపడిన రైతుల ఆందోళనల్లో పాల్గొన్న వారిలో అధికులు 40ఏళ్లలోపు వాళ్లే. 2017లో చాలా ప్రభుత్వాలు రైతు ఆందోళనలు ఎదుర్కొన్నాయి. రాష్ట్రప్రభుత్వాల మెడలు వంచి తమ కష్టాలకు కొంతైనా పరిష్కారాలను సాధించుకున్నారనవచ్చు. నామమాత్రంగా ఉన్న రైతు సంఘాలు ఇప్పుడు ఉద్యమాలకు సారథ్యం వహిస్తున్నాయి. మద్దతు ధరల కోసం రైతులు ఉద్యమించడంతో ప్రభుత్వాల వద్ద సమాధానం లేకుండా పోయింది. రైతుకు వినియోగదారునికి మధ్యనున్న దళారీ వ్యవస్థను నియంత్రించే శక్తి వచ్చేదాకా ప్రభుత్వాలకు తిప్పలు తప్పవు. పడిపోయిన ధరలకు నిరసనగా పోయిన సంవత్సరం టమాటాలు, ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు, పాలు రోడ్లపై పారబోసి రైతులు దుఃఖభరిత నిరసనను తెలిపారు. ఈ సమస్యనుండి రైతులు బయటపడే మార్గాల్ని మాత్రం ప్రభుత్వాలు వెతకడం లేదు. రుణమాఫీలు, వడ్డీ రాయితీలు, పంటబీమా లాంటి పథకాలు ఈ రుగ్మతకు మందేయలేవు. పాత పథకాలను పక్కనపెట్టి ప్రకటిత కనీస మద్దతు ధరతో ప్రతిగింజను ప్రభుత్వాలు కొనుగోలు చేయడమే పరిష్కారమనవచ్చు. కేంద్రం, రాష్ట్రం ఈ బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టివేసుకోకుండా రైతులను ఆదుకోవాలి.
ఏప్రిల్ 2017 ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నెలకుపైగా వినూత్న నిరసనలు తెలిపిన తమిళ రైతుల సమస్య మాధ్యమాల్లో చాలా ప్రచారం పొందింది గాని కేంద్రం ఉత్తుత్తి హామీలకే పరిమితమైంది. మద్రాసు హైకోర్టు చొరవ తీసుకుని కో ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనివల్ల రాష్ట్రంలోని 20లక్షల మంది రైతులకు మేలు జరిగింది.ఎన్నికల హామీగా ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రకటించిన రైతురుణ మాఫీ అక్కడి రైతులకు కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. రూ.36,000కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం మోయక తప్పలేదు. ఈ హామీ భారతీయ జనతాపార్టీ ఏలుతున్న రాష్ట్రాల్లో కొంత ముసలాన్ని పుట్టించింది.జనవరి 2017లో పంజాబు రైతులు గిట్టుబాటు ధర దక్కక ఆలుగడ్డలను రోడ్లపై పోశారు. దోబా ప్రాంతంలోని రైతులు కర్తార్‌పూర్ రహదారిపై 15వాహనాల్లో 500 క్వింటాళ్ల బంగాళదుంపలను దొర్లించారు. జలంధర్‌అమృతసర్ మధ్యనున్న జాతీయ రహదారి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు వీరి కష్టాలను కొంత ఒడ్డెక్కించాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి అమరేందర్‌సింగ్ అప్పుల మాఫీని ప్రకటించారు. అయితే ఇక్కడ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాదిరే విడతలవారీ చెల్లింపుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతుల చిట్టా సేకరణ, అప్పుల వివరాలు, అధికారుల పరిశీలన పేరిట తీవ్ర జాప్యం జరిగి ఈ ఏడు జనవరిలో రూ.170కోట్లు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో 5.63లక్షల రైతులుంటే ఈ తొలి విడతలో 683 కో ఆపరేటివ్ సొసైటీల్లోని 46,000 మంది రైతులకు లబ్ది జరిగింది.జూన్ 2017లో మహారాష్ట్ర రైతులు గిట్టుబాటు ధరకోసం, కరువు, నీటి ఎద్దడి నివారణకోసం ఆందోళన చేపట్టారు. ముంబయికి పళ్లు, కూరగాయలు, పాలు అందకుండా నాగపూర్ ప్రాంతంలో రైతులు వాటిని రోడ్లపై పారవేశారు. ఆ దెబ్బకు దిగివచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రైతుల ఆగ్రహంపై పథకాల నీళ్లు చల్లక తప్పలేదు. బ్యాంకులనుండి లక్షన్నర దాకా అప్పు తీసుకున్న 89లక్షలమంది రైతులకు రూ. 34020కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని ఆయన ప్రకటించారు.కర్నాటకలో 30జిల్లాలలోని 20జిల్లాల్లో 2017లో తగిన వర్షపాతం లేక వ్యవసాయం దెబ్బతిన్నది. రాష్ట్ర బిజెపి నాయకుల ఒత్తిడిని తట్టుకోలేని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యాభైవేల వంతున కో ఆపరేటివ్ బ్యాంకు అప్పును మాఫీ చేశారు. దీనిద్వారా రాష్ట్రంలోని 22లక్షలమంది రైతుల రుణం రూ.8165కోట్లు సర్కారుపై పడింది.రాజస్థాన్‌లో పోయిన సెప్టెంబర్‌లో 13రోజులపాటు రైతుల ఆందోళన కొనసాగింది. బికనీర్, శ్రీ గంగానగర్ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించింది. ప్రభుత్వం దిగివచ్చి రూ.20,౦00కోట్ల రైతు అప్పును రద్దు చేసింది. అరవై ఏళ్ళు పైబడిన వ్యవసాయదారులకు నెలకు రూ.2000/ ఫించను ఇచ్చే ఆలోచన కూడా ఉందని ఆ ప్రభుత్వం ప్రకటించింది.గత ఏడాది జూన్‌లో మధ్యప్రదేశ్‌లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మాల్వా, నిమాడ్ ప్రాంతంలోని 15 జిల్లాల్లో రైతులు ఇందులో పాల్గొన్నారు. జూన్ 6న మందసౌర్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో అయిదుగురు రైతులు మరణించారు. సమృద్ధిగా వచ్చిన ఉల్లి పంటకు తగిన ధర రాకపోవడమే ఈ ఆందోళనకు కారణం. కిలోకు రూపాయినుండి రెండు రూపాయల ధర ఇవ్వడానికి వ్యాపారులు సిద్ధపడడంతో ఉల్లి సంచులను రోడ్లపై కుమ్మరించారు. చివరకు ప్రభుత్వం కిలో రూ.8/లకు సేకరించేందుకు ముందుకొచ్చింది. రైతుల మరణాలతో పెచ్చరిల్లిన హింసను కట్టడి చేయడానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌లో జూన్ 11న నిరాహారదీక్ష చేపట్టారు. అల్లర్లు తగ్గుమొగం పట్టడంతో కేంద్రప్రభుత్వం హామీ మేరకు తాను దీక్ష విరమిస్తున్నానని శివరాజ్ ప్రకటించారు.అక్టోబర్ 2017లో మధ్యప్రదేశ్ ప్రకటించిన భవంతర్ భుగ్‌తాన్ యోజనను కొత్త పథకంగా పరిగణించాలి. మద్దతు ధరకు మార్కెట్ ధరకున్న వ్యత్యాసపు సొమ్మును ప్రభుత్వం రైతులకు పరిహారంగా చెల్లించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మార్కెట్ ధరకు దినుసును అమ్మినట్లు రశీదును చూయిస్తే మద్దతు ధరకు సమానంగా మిగిలిన సొమ్ము రైతుకు అందుతుంది. ఈ సదుపాయం కోసం రైతు లు తమ వివరాలతో పేర్లను ప్రభుత్వ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. దీనికి ఆన్‌లైన్ సదుపాయం కూడా ఉంది. మధ్యప్రదేశ్‌లో గత ఖరీఫ్‌లో కందులు, మినుములు విరివిగా పండాయి. అయితే మార్కెట్ ధర 2016 కన్నా సగం పడిపోయింది. ఈ కొత్త పథకం రైతులను ఆదుకుంది అనవచ్చు. అక్టోబర్‌లో మొదలైన ఈ యోజన ద్వారా ఇప్పటి వరకు 16లక్షలమంది రైతులకు రూ.64కోట్ల లబ్ది జరిగింది.తెలంగాణ ప్రభుత్వం మే 2018 నుండి ఎకరానికి పంటకు రూ.4000 ఇవ్వడానికి సిద్ధమౌతున్నది. పంట తీయకున్నా భూమి ఉన్న రైతుకు ఆ ఆర్థిక సహాయం అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు వార్తల్లో వచ్చింది. ఆర్థికంగా స్వయం సమృద్ధి ఉన్న రైతులు ఈ ప్రయోజనాన్ని త్యాగం చేయాలని పిలుపు నియ్యాలనే ఆలోచన కూడా ప్రభుత్వం వద్ద ఉంది. ఈ చెల్లింపులు చెక్కుల ద్వారా సాగాలని మెజారిటీ రైతులు కోరుతున్నారని ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 55 లక్షలమంది రైతులు ఆ పెట్టుబడి సహాయాన్ని పొందుతున్నా కౌలు రైతుల ఊసు ఇంతవరకూ లేదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యత్యాసం చెల్లింపులో పంటతీసిన రైతుయే లబ్ది పొందుతాడు. వ్యాపారి వద్ద పంట దిగుబడిని అమ్మినవాడే వ్యవసాయదారుడుగా గుర్తింపు పొందుతాడు. బ్యాంకు రుణాలు తీసుకొని పంట తీయకున్నా ప్రభుత్వ రైతు రుణమాఫీలో లబ్ది దొరుకుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16972
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author