తెలంగాణలో  సవాళ్లు, ప్రతి సవాళ్లు

తెలంగాణలో  సవాళ్లు, ప్రతి సవాళ్లు
February 12 12:18 2018
హైద్రాబాద్,
తెలంగాణలో రాజకీయంగా ఉక్కపోతలు మొదలయ్యాయి. అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిత్యం సవాళ్లు,ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల
తర్వాత ఎన్నికల కోలాహలం ప్రారంభమవుతుంది. ‘ఎన్నికల బడ్జెట్’ను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్భ్రావృద్ధికి దిశానిర్దేశం
చేయడమే కాకుండా, ఈ ప్రాంత స్వాభిమానాన్ని ప్రతి అంశంలో ప్రస్ఫుటించేలా కేసీఆర్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచిన ఘనత ఆయనకే దక్కుతుంది.
మిగులు రెవెన్యూతో, ధనిక రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ ‘చీకటి నుంచి నిరంతర విద్యుత్ వెలుగుల్లో’కి అడుగుపెట్టింది. విద్యుత్ పుష్కలంగా ఉంటేనే అభివృద్ధి సాకారమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్
కష్టాలు, మావోయిస్టుల సమస్యలు వెంటాడుతాయన్న వాదనలు పటాపంచలయ్యాయి. మావోయిస్టు నేతలకు ఆలవాలమైన తెలంగాణలో ఎక్కడో ఒక చోట కొంతమంది సానుభూతిపరులుండవచ్చు. వారంతా ప్రజల మద్దతు
లేకపోవడంతో నిశ్శబ్దంలోకి జారుకున్నారు. ఒకప్పుడు మావోయిస్టు ప్రాంతాలుగా ముద్రపడిన గ్రామాల్లో నేడు అభివృద్ధి వికసిస్తోంది. అవిభక్త కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు, గోదావరి పరీవాహక
ప్రాంతాలు, అటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దులను పరిశీలిస్తే- విభజనకు ముందు తెలంగాణ ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది? అనే విషయం తెలుస్తుంది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విద్యుత్ కోతలతో అభివృద్ధికి దూరమవుతుందన్న వితండ వాదనలు చేసిన వారు ఇపుడు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. ‘కొరతలు’ లేకుండా చేయడమే కాకుండా, మిగులు
విద్యుత్‌ను సాధించడంలో కేసీఆర్ విజయం సాధించారు. 24 గంటలూ వ్యవసాయ రంగానికి విద్యుత్ ఇవ్వడం ఆషామాషీ కాదు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో అనతి కాలంలోనే దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. త్వరలో
నేత్ర వైద్యపరీక్షలు, ఆరోగ్య తనిఖీ శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. బోదకాలు వ్యాధితో బాధపడే వారికి నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం
స్వాగతించాల్సిన విషయం.
తెలంగాణకు నదీ జలాల కేటాయింపులో జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి రాజీలేకుండా పోరాడుతున్నారు. కృష్ణా జలాల కేటాయింపులో పాత ఫార్ములాను అంగీకరించేది లేదని, నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి
తీసుకుని జలాలను కేటాయించాలని, బచావత్ ఫార్ములాను పునఃసమీక్షించాలని ట్రిబ్యునల్‌కు నివేదించారు. గోదావరి జలాల విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రంపై గట్టిగా వత్తిడి తెస్తున్నారు. ఇక,
అలనాడు నిజాం హయాంలో జరిగిన భూమి సర్వే రికార్డులు తారుమారవుతున్నందున ఆధునిక టెక్నాలజీని వినియోగించి, భూమి సర్వేను నిర్వహించారు. ఫలితంగా భూ వివాదాలు ఇకముందు గణనీయంగా
తగ్గుముఖం పట్టనున్నాయి. రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరానికి రూ.4వేల చొప్పున సాలీనా ఎనిమిది వేల రూపాయలను పెట్టుబడి సాయం అందజేసే స్కీంను కేసీఆర్ ఆవిష్కరించారు. అభివృద్ధి, సంక్షేమ
రంగాలను రెండు కళ్లుగా కొత్త స్కీంలను ఆవిష్కరిస్తూ, వాటి ఫలాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటూ ప్రజలను సమ్మోహితులను చేస్తున్నారు. ఉద్యమంలో తన రాజకీయ చతురత, వాగ్ధాటితో ముందుకు వెళ్లి
తెలంగాణను సాధించగా, అధికార పగ్గాలు చేపట్టాక ఆయన ప్రజోపయోగ పనులు చేస్తున్నారు. ప్రజల్లో 70 ఏళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తిని, నిరాశను తగ్గించేందుకు పాటుపడుతున్నారు.ప్రజలను పూర్తి స్థాయిలో
సంతృప్త పరచడం ఏ రాజకీయ పార్టీకీ సాధ్యం కాని పని.
సంక్షేమం, సాగునీటి రంగాలకు ఎక్కువ నిధులను కేటాయించడం, సక్రమంగా ఖర్చుపెట్టడంలో తెలంగాణ అగ్ర స్థానంలో ఉందని ఢిల్లీకి చెందిన ఆర్థికసంస్థ ఇటీవల స్పష్టం చేసింది. ఒక రాష్ట్రం అవతరించిన నాలుగేళ్లలోపలే
అంచనాలకు మించి అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. హైదరాబాద్ పరిసరాల నుంచి ఐటి రంగం క్రమంగా జిల్లా కేంద్రాలకు విస్తరిస్తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి స్కీంల
ఫలాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అందుతున్నాయి. నిధుల లేమి వల్ల తొలి దశలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగినా ఇటీవల వేగవంతమైంది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీంలు అన్ని వర్గాలను
హత్తుకున్నాయి. పరిపాలన రంగానికి వస్తే కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు.
ఒక రాష్ట్రం అభివృద్ధి సాధించినా, తిరోగమనం చెందినా పాలనా పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయన్న విషయం చూడాలి. 2014లో అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు ఒకేసారి జరిగినపుడు టిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమ, రాజకీయ
స్వభావంతో మిళితమై ఉండేది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తామే అయినందున దారుణ ఓటమి ఎదురవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఊహించలేదు. టిఆర్‌ఎస్‌కు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా సీట్లు రాగా,
కాంగ్రెస్, టిడిపికి 20 ప్లస్, మిగిలిన సీట్లు ఎంఐఎం, వైకాపా, సిపిఐ పంచుకున్నాయి.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. క్యాడర్, సంస్థాగతంగా బలం ఉన్న ఆ పార్టీ ఇపుడు చతికిలపడింది. కాంగ్రెస్
బలహీనపడినట్లు అనిపించినా, దిగువ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ పార్టీకి మంచి నిర్మాణం ఉంది. కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోంది. బీజేపీకి కూడా పటిష్టమైన నిర్మాణం ఉంది. వామపక్ష పార్టీలకు ఎన్నికల్లో సీట్లు
రాకపోయినా, పార్టీ నిర్మాణం ఉంది. టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, 2014లో అధికారంలోకి వచ్చేలా తగిన మెజార్టీని ప్రజలు ఆ పార్టీకి ఇచ్చారు. అప్పుడు ఉద్యమ పార్టీ కావడంతో
అన్నివర్గాల మద్దతు లభించింది. ఉద్యమ పార్టీ నుంచి నూటికి నూరుపాళ్లు రాజకీయ పార్టీగా పదోన్నతి సాధించింది. ఉద్యమ రాజకీయాల నుంచి ‘పవర్ పాలిటిక్స్’ తెలిసిన పార్టీగా రూపాంతరం చెందింది. ఈ పరిణామ
క్రమంలో మిత్రులుగా ఉన్న వారు శత్రువులుగా, శత్రువులుగా ఉన్న వారు మిత్రులవుతారు. మిత్రులుగా మారిన శత్రువులు అధికారంలో వాటా పొందారు. శత్రువులుగా మారిన మిత్రులు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలు
ఏర్పాటు చేయడంలో లేదా కాంగ్రెస్‌లో చేరడంలో బిజీగా ఉన్నారు. అధికారంలో వాటాకు వస్తారనో లేక తమ అధికారాన్ని సవాలు చేస్తారనో ముందు ఆలోచనతో రాజకీయ వేత్తలు కొందరిని దూరం పెడతారు. అధికారమే
పరమావధిగా ప్రత్యర్థుల పట్ల నిర్దయగా, కనికరం లేకుండా వ్యవహరిస్తుంటారు.వచ్చే ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ మధ్య గట్టిపోటీ ఉంటుందనడంలో సందేహం లేదు. తెరాస ఇంతవరకు నిర్వహించిన సర్వేల్లో ఆ పార్టీకి బంపర్
మెజార్టీ వస్తుందని నివేదికలు వచ్చాయి.కాంగ్రెస్ చేయించిన సర్వేలో కూడా ఆ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే నివేదికలు వచ్చాయి. రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమబలాన్ని చూసుకునేందుకు సర్వేలు
చేయించుకోవడం సహజమే. తెరాసకు రెండోసారి పగ్గాలు ఇచ్చే విషయమై ప్రజలు ఇప్పటికి సుముఖంగానే ఉన్నట్టు కనపడుతోంది. నాలుగేళ్లలో కెసిఆర్ సంక్షేమ విధానాలు, పాలనా తీరు వల్ల కొత్త కేడర్ వచ్చింది. దీనికి
తోడు అస్తమిస్తున్న కొన్ని పార్టీలకు చెందిన కేడర్ టిఆర్‌ఎస్‌లో చేరింది. సంక్షేమం, అభివృద్ధికి ప్రజాబలం తోడుకావడం, హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో 25 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం
చేసే ఆంధ్ర ఓటర్ల మనోభావాలు ఎలా ఉన్నాయో గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. కాగా, విపక్ష పార్టీల విమర్శలను తిప్పిగొట్టడంలో టిఆర్‌ఎస్ పార్టీ అంతర్గతంగా సమర్థమైన
నాయకత్వాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి, పార్టీకి ఒకరే సారథిగా ఉండే పార్టీల్లో కేడర్‌కు, మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య అగాధం ఉంటుంది. ఈ సమన్వయ లేమిని సరిచేసుకోవాల్సి ఉంటుంది.
2014లో తెలంగాణ సాధించేంత వరకు టిఆర్‌ఎస్‌కు ఉన్న ‘సిలబస్’ వేరు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కొత్త సిలబస్ తయారు చేసుకున్నా, దాన్ని అమలు చేసేందుకు సమర్థులైన నేతలు, ప్రచార
కర్తలు పార్టీకి కావాల్సి ఉంటుంది. కుటుంబ ఆధిపత్యం ఉన్న ప్రాంతీయ పార్టీల్లో అన్నీ రథసారథి చూసుకుంటారనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి
రావాలంటే, కేవలం అభివృద్ధి, సంక్షేమ మంత్రాలు గట్టెక్కించవు. తటస్థ ఓటర్లను ఆకట్టుకోవడం, కొత్త కేడర్‌ను పార్టీలోకి కలుపుకోవడం, అనుమానం ఉన్న చోట సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చడం, ప్రభుత్వ సంక్షేమ
కార్యక్రమాలను జనంలోకి తీసుకుని వెళ్లే వారికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి అధికారాన్ని నిలబెట్టుకోవాలనే పార్టీలు చేస్తుంటాయి. అవసరమైతే మంత్రి పదవుల్లో ఉన్న వారిని పార్టీకి పంపడం, పార్టీ పనికి మొదటి నుంచి
అంకితమై ఉన్న వారిని ప్రభుత్వంలోకి తీసుకురావడం లాంటివి చేస్తుంటారు. ఈ పనులు చివరి నిమిషంలో చేస్తే ఆశించిన ప్రయోజనాలు ఉండవు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండడం వల్ల పార్టీ కేడర్‌కు,
ప్రభుత్వానికి మధ్య లోటుపాట్లు ఉంటే సరిదిద్దేందుకు ఇదే సరైన సమయం
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17469
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author