స్థలం దొరికింది

స్థలం దొరికింది
February 12 12:23 2018
మెదక్,
మెదక్‌ జిల్లాలో కలెక్టరేట్‌, పోలీస్‌ కార్యాలయం(డీపీఓ) భవన నిర్మాణాలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. స్థలం ఎంపిక విషయం కొలిక్కివచ్చిందని అధికార వర్గాలే అంటున్నాయి. కొన్ని నెలలుగా సరైన స్థలం లభించక ఇబ్బందిపడ్డ అధికారులు 15 రోజుల్లోనే అనువైన భూమి గుర్తించి, రైతులను ఒప్పించి, పరిహారం కూడా చెల్లించేశారట. దీంతో త్వరలోనే భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారని అంతా అంటున్నారు. మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరయ్యాయి. దీనికి టెండర్‌ ప్రక్రియ పూర్తయినా స్థలం మాత్రం లభించలేదు. హవేలిఘనపూర్‌ మండల పరిధి ఔరంగాబాద్‌ శివార్లలోని సర్వే నెంబరు 78లో ఇదివరకు గుర్తించిన 52 ఎకరాలతోపాటు అదనంగా మరో 34 ఎకరాలు కలిపి మొత్తం 86 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని స్థానిక అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి వారం రోజుల్లో సంబంధిత స్థలసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత విభాగం అధికారులను ఆదేశించారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ నగేష్‌, మెదక్‌ ఆర్డీఓ నగేష్‌ అదేరోజు సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న స్థలం తదితర వివరాలు సేకరించారు. సంబంధిత రైతులు తమకు న్యాయమైన రీతిలో పరిహారం ఇస్తేనే భూములిస్తామని స్పష్టం చేశారు.
స్థల సేకరణ అనివార్యం కావడంతో భూములు కోల్పోయే రైతులు ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి తమ డిమాండ్ వినిపించారు. ఆయన సానుకూలంగా స్పందించి ఎకరాకు రూ.8 లక్షల చొప్పున పరిహారం ఇప్పించేలా హామీ ఇవ్వడంతో రైతులు భములు ఇచ్చేందుకు అంగీకరించారు. మెదక్ కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ భవనాలకు స్థలం సమస్య తీరిపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కొన్నిరోజుల క్రితమే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి చేతుల మీదుగా భూములిచ్చిన రైతులకు చెక్కుల రూపంలో పరిహారం అందజేశారు. రైతుల నుంచి సేకరించిన 71.31 ఎకరాలతోపాటు, 12 ఎకరాల హౌసింగ్‌బోర్డు, ప్రభుత్వ భూమి కలిపి 84 ఎకరాల విస్తీర్ణంలో ఆయా భవనాలు నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి ఆమోదించిన నమూనా ప్రకారమే ఆయా భవనాలను నిర్మిస్తామని అధికారులు అంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17471
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author