బడులు మూతపడాల్సిందేనా?

బడులు మూతపడాల్సిందేనా?
February 12 12:29 2018
ఆదిలాబాద్,
విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను సమీప బడుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతేడాది నుంచే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ కొలిక్కి రాలేకపోయింది. తాజాగా మళ్లీ అంశాన్ని ప్రభుత్వం తెరమీదకు తీసుకురావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది బడుల సంఖ్య తగ్గుతుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే జరిగితే ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకుండా పోతాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి జిల్లాలో సర్కారీ విద్యారంగంలో ఆశించిన ప్రగతి లేదు. తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వపాఠశాలల్లో కంటే ప్రైవేట్ స్కూళ్లలోనే చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సర్కారీ బడుల్లో వసతుల లేమి, కాన్వెంట్ చదువుపై ఉన్న మోజుతోనే ఇలా జరుగుతోందన్నది విశ్లేషకులు మాట. ఏదైతేనేం ప్రభుత్వ బడుల్లో విద్యార్ధుల సంఖ్య ఆశించినంతగా లేదు. దీనికితోడు పిల్లలున్న చోట్ల ఉపాధ్యాయులు లేకపోవడం.. ఉపాధ్యాయులు ఉన్న చోట పిల్లలు సరిపడా లేకపోవడం లాంటివి ఉన్నాయి. దీంతో చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం హేతుబద్ధీకరణను తెరమీదకు తీసుకొస్తోంది.
పాఠశాలల హేతుబద్ధీకరణ కోసం 2017లోనే జియోగ్రాఫికల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌) విధానం ద్వారా ఇప్పటికే పాఠశాలల సమస్త సమాచారం సేకరించారు అధికారులు. ఈ విధానం ద్వారా ఎన్ని బడుల్లో పిల్లలు తక్కువగా ఉన్నారు.. ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఎక్కడ ఉందనే విషయంపై ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న చోట్ల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో పదిమందిలోపు పిల్లలు కలిగిన పాఠశాలలను విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉంది. అంతేకాక 20మంది లోపు పిల్లలు ఉన్న వాటిని సైతం పరిగణనలోకి తీసుకొనే అవకాశముంది. హీనపక్షంలో 20 మంది లోపు పిల్లలను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో సుమారు 95 పాఠశాలలు మూతపడే అవకాశం ఉంటుంది. జిల్లాలో 90కి పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయన్న విషయమై విద్యావేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్కారీ బడుల్లో ప్రమాణాలు పెంచి విద్యార్ధుల సంఖ్య పెరిగేలా చేయాలని సూచిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17473
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author