పబ్లిర్ రంగ బ్యాంకులు మారవా… 

పబ్లిర్ రంగ బ్యాంకులు మారవా… 
February 16 10:35 2018
(విశ్లేషణ)
దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం వెలుగులోకి రావడంతో మన పబ్లిక్ రంగ బ్యాంకులు ఎంత దురవస్థలో ఉన్నాయో తెలుస్తున్నది. వేల కోట్ల రూపాయలను మింగిన బడాబాబులు ఎంత సాఫీగా దేశం విడిచి వెళ్ళగలరో మరోసారి వెల్లడైంది. పబ్లిక్ రంగ బ్యాంక్ అయిన పంజా బ్ నేషనల్ బ్యాంకు నుంచి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పదకొండున్నర వేల కోట్ల మేర మోసంచేసి దేశం నుంచి చల్లగా జారుకున్నాడు. గతంలో విజయ మాల్యా అనే మద్యం వ్యాపారి బ్యాంకులను నిండా ముంచి, కోర్టులలో కేసులు నడుస్తుండగానే, సంచీ సరంజామా సర్దుకొని విమానంలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీరవ్ మోదీతో పాటు మరో మూడు వజ్రాల వ్యాపార సంస్థలు కూడా మోసం పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశాయని అంటున్నారు. నీరవ్ మోదీ బ్యాంకులను అత్యంత సులభంగా మోసంచేసిన తీరు ఆశ్చ ర్యం కలిగిస్తున్నది. ఒక బ్యాంకు మరో బ్యాంకు శాఖకు అవగాహనా లేఖ (లెటర్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ లేదా ఎల్‌ఓయూ) ఇవ్వడం సాధారణం. రుణగ్రహీత సొమ్ము చెల్లించకుంటే తాను చెల్లిస్తానని హామీ ఇవ్వడమే ఈ అవగాహనా లేఖ.  మొండి బకాయిలతో అస్తవ్యస్థంగా మారిన భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక పరిస్థితిపై తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు ముంబై బ్రాంచిలో చోటుచేసుకున్న 11,400 కోట్ల కుంభకోణం.. ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’గా కనిపిస్తోంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండోదైన పీఎన్బీ చరిత్రను ఈ కుంభకోణం ఒక్కసారిగా తలకిందులు చేసింది.ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మరో ఆభరణాల కంపెనీ సంయుక్తంగా మోసపూరిత లావాదేవీలకు పాల్పడి  పంజాబ్ నేషనల్ బ్యాంకుకు శఠగోపం పెట్టారు. ఈ అక్రమ లావాదేవీలలో బ్యాంకు ముంబై బ్రాంచి ఉద్యోగుల ప్రమేయం కూడా ఉండడంతో ఈ కుంభకోణానికి బాధ్యులను చేస్తూ బ్యాంక్‌ శాఖ డిప్యూటీ మేనేజర్‌తో సహా 10 మంది ఉద్యోగులపై పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇప్పటికే వేటు పడింది. ఒక ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుండగానే… పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మోసాలపై సీబీఐకి ఫిర్యాదు చేయడం 10 రోజుల్లో ఇది రెండోసారి. ఈ నెల 5న నీరవ్ మోడీ తమ బ్యాంకును 280 కోట్ల మేర మోసగించినట్లు బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతుండగా అదే బ్యాంకు ముంబై బ్రాంచిలో జరిగిన మరో అతిపెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది.నిజానికి నీరవ్ మోడీ మోసపూరిత లావాదేవీలపై పంజాబ్ నేషనల్ బ్యాంకు జనవరి 28నే సీబీఐకి ఫిర్యాదు చేసింది. ముంబై బ్రాడీహౌస్‌లోని తమ మిడ్ కార్పొరేట్ బ్రాంచిలో కొన్ని మోసపూరిత లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్ లభించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. జనవరి 16న డైమండ్ ఆర్‌ యుఎస్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్ అనే మూడు సంస్థలు తమకు బయర్స్ క్రెడిట్ కావాలంటూ ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక శాఖ అధికారులను కోరాయి. విదేశీ సరఫరాదారుల నుంచి సరుకు వస్తోందని తెలిపే కొన్ని పాత్రాలు చూపించి, వారికి చెల్లించేందుకు అవసరమైన రుణం కోసం లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ కావాలని విజ్ఞప్తి చేశాయి. ఈ సంస్థలు నీరవ్ మోడీ, ఆయన సోదరుడు నిశాల్ మోడీ, నీరవ్ భార్య అమీ నీరవ్ మోడీ, మరో వ్యాపార భాగస్వామి మెహుల్ చినూభాయ్ చోక్సీకి సంబంధించినవి.బయ్యర్స్ క్రెడిట్ అనేది ఒక స్వల్పకాలిక రుణ సదుపాయం. విదేశాల నుంచి సరుకు, సేవలు దిగుమతి చేసుకునే వ్యాపారులు, సంస్థలకు ఈ తరహా రుణ సదుపాయాన్ని బ్యాంకులు కల్పిస్తుంటాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రుణాలు సర్వసాధారణమే. ఏ దేశం నుంచి ఏ వ్యాపారి, సంస్థ సరుకు లేదా సేవలు ఎగుమతి చేస్తాయో వారికి దిగుమతి చేసుకునే వారి తరుపున ఇచ్చే గ్యారెంటీ అన్నమాట. 100 శాతం క్యాష్ మార్జిన్ అడిగిన అధికారులు… నీరవ్ మోడీ తదితరులకు చెందిన సంస్థలు ఎప్పుడైతే బయ్యర్స్ క్రెడిట్ కోసం లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్స్ అడిగాయో అప్పుడే బ్యాంకు అధికారులు అందుకు 100 శాతం క్యాష్ మార్జిన్ సమర్పించాలని సూచించారు. దీనికి ఆ మూడు సంస్థలు.. ‘అదేం అవసరం లేదని,  తాము గతంలో , మేం గతంలో క్యాష్ మార్జిన్ ఏమీ లేకుండానే లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్తీసుకున్నామని చెప్పాయి.  అయితే ఆయా సంస్థలకు రుణ పరిమితికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేకపోవడం బ్యాంకు అధికారులకు అనుమానం కలిగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నతాధికారులు నీరవ్ మోడీ తదితరుల సంస్థలకు రుణ మంజూరుకు సంబంధించి మరింత లోతుగా శోధించారు. దీంతో గతంలోనూ ఎలాంటి నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా ఇద్దరు బ్యాంకు ఉద్యుగులు వారి సంస్థలకు లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్స్ ఇచ్చిన విషయం బయటపడింది. ఈ విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు కూడా అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. చేసిన పాడుపని ఎక్కడా బ్యాంకు రికార్డుల్లోకి రాకుండా చూసుకున్నారు. పీఎన్బీ అధికారులతో కుమ్మక్కయి ఇలా తీసుకున్న ఎల్‌ఒయుల ఆధారంగా ఈ డైమండ్‌ వ్యాపార సంస్థలు విదేశాల్లోని ఇతర బ్యాంకుల నుంచీ పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకునేవని తెలుస్తోంది. ‘స్విఫ్ట్’ మెసేజింగ్ సిస్టం ద్వారా… బ్యాంకుల అంతర్గతంగా వినియోగించుకునే ‘స్విఫ్ట్’ అనే మెసేజింగ్ సిస్టంను పీఎన్బీ బ్యాంకు ఉద్యోగులు తమ అక్రమ లావాదేవీలకు ఉపయోగించుకున్నారు. ఈ విధానంలో ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు సమాచారం చేరవేయొచ్చు. ఆ ప్రకారం.. నీరవ్ మోడీ తదితరుల సంస్థలకు బయ్యర్స్ క్రెడిట్ పెంచినట్లుగా విదేశాల్లోని భారతీయ బ్యాంకులకు సమాచారం అందజేశారు. ఆ ప్రకారం అక్కడి బ్యాంకులు ఎగుమతిదారుకు డబ్బులు అందజేశాయి. ఇలా హాంకాంగ్‌లోని అలహాబాద్ బ్యాంకుకు ఐదు మెసేజ్‌లు, యాక్సిస్ బ్యాంకుకు మూడు మెసేజ్‌లు అందాయి. కానీ ఈ మెసేజ్‌లు పంపినట్లు మాత్రం పీఎన్బీ బ్యాంకు రికార్డుల్లో ఎక్కడా లేవు. తాజాగా వెలుగులోకి వచ్చిన కుంభకోణం విలువ ఎంతో తెలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకు కుదేలైపోతోంది. ఎందుకంటే, గత ఆర్థిక సంవత్సరంలో ఆ బ్యాంకు ఆర్జించిన  1,324 కోట్ల నికర లాభానికి ఎనిమిదిరెట్లు ఎక్కువ ఈ స్కాం విలువ. మరోవైపు ఈ భారీ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కూడా రంగంలోకి దిగింది.  ఇలా మోసపూరితంగా సంపాదించిన నిధుల ద్వారా వీరు అక్రమంగా ఏమైనా ఆస్తులు, నల్లధనం పోగు చేశారా? అనే విషయంపై దర్యాప్తు చేయబోతోంది. వివిధ బ్యాంకులతో ఈ సంస్థలకు ఉన్న అవగాహన, చివరకు ఈ డబ్బు ఎక్కడకు చేరిందనే విషయాలపై సీబీఐ, ఈడీ దృష్టి సారించాయి. లిస్టెడ్‌ బ్యాంకులు, జ్యూయలరీ సంస్థలు ఈ కుంభకోణానికి సంబంధించి వెల్లడించాల్సిన విషయాల విషయంలో ఏమైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించాయా? అనే విషయంపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ కూడా దర్యాప్తునకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది.  మరోవైపు ఇచ్చిన రుణాలు వసూలుకాక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకునేందుకు కేంద్రం గత అక్బోబరులోనే  2.11 లక్షల కోట్ల క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ప్రకటించింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ భారీ కుంభకోణం వెలుగుచూడడం ప్రభుత్వ నిర్ణయాన్ని  ప్రభావితం చేయవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17735
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author