కమలానికి దూరమవుతున్న చంద్రుడు

కమలానికి దూరమవుతున్న చంద్రుడు
February 16 10:46 2018
విజయవాడ,
ఏపీ మెడ‌కు ఉచ్చు బిగుస్తున్న‌ట్లుంది. చంద్ర‌బాబుపై ప్ర‌తీకార‌మా.. బీజేపీపై మ‌మ‌కార‌మా! కార‌ణాలేమైనా మోదీ ప‌ట్టువీడేలా లేరు. త‌న పంతం నెగ్గించుకునేందుకు ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లుగా సంకేతాలు వ‌స్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో వున్న రాజ‌కీయ ప‌రిస్థితులు.. పార్టీల మ‌ధ్య ఏర్ప‌డిన అగాధం.. క‌ల‌సిక‌ట్టుగా లేర‌నే వాస్త‌వం.. ఇవ‌న్నీ కేంద్రం చేతిలో ఏపీను కీలుబొమ్మ‌గా మార్చాయి.  కేంద్రంతో వున్న పొత్తు ఒక్క‌టే కాదు.. ఇప్ప‌టి వ‌ర‌కూ చాప‌కింద‌నీరులా.. నేత‌లు పొందిన ప్ర‌యోజ‌నాలు కూడా కేంద్రంపై స్వ‌రం పెంచేందుకు అడ్డుప‌డుతున్నాయి. వాస్త‌వానికి రాష్ట్రం నుంచి ఇద్ద‌రు మంత్రులు కేంద్రంలో కీల‌కంగా వున్నారు. వీరిలో అశోక్‌గ‌జ‌పతిరాజు సారీ.. సైలెన్స్ అంటూ మౌనం వ‌హించారు. సుజ‌నాచౌద‌రి మాత్రం.. ఏపీకు చాలా చేశారు. ఇంత‌కు మించి ఏం చేస్తారంటారు. లేదు.. కాదు.. ఇంకా చేయాలంటూ నాలుక క‌ర‌చుకుంటారు. మారిష‌స్ కేసుల భ‌యంతోనే వెనుకంజ వేస్తున్నార‌ని.. మోదీకు వ్య‌తిరేకంగా గొంతు విప్పితే.. పాత కేసులు తన మెడ‌కు చుట్టుకుంటాయ‌నే భ‌యం అంటూ విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ఏం కాదు.. కేసుల్లేవంటూ.. నేనే కోట్లాదిరూపాయ‌ల‌తో ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లిచ్చా చూసుకోమంటూ సుజ‌నా కొట్టిపారేస్తారు. గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఒక రోజు గ‌ట్టిగా మాట్లాడినా.. స‌న్మానాలు త‌ప్ప ఒరిగిందేమీ లేద‌నే చెప్పాలి. ఇక జేసీ దివాక‌ర్‌రెడ్డి.. స‌భ‌లో సైలెంట్‌గా వున్నా మీడియా ఎదుట మాత్రం.. ఇదంతా మోదీకు బాబుపై వున్న ప‌గ‌తోనే  చేస్తున్నారంటారు. పోన్లే పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ఏక‌తాటిపైకి చేర‌తారా! అంటే.. వైసీపీ అధినేత త‌మ ఎంపీల‌తో రాజీనామా చేయిస్తానంటూ అల్టిమేటం జారీచేశారు. కేంద్రంతో ప్ర‌త్య‌క్షంగా త‌ల‌ప‌డితే వ‌చ్చే ప్ర‌యోజ‌నాల సంగ‌తి ఎలా వున్నా.. ప్ర‌తికూల ఫ‌లితాలే ఎక్కువ‌నేది చంద్ర‌బాబు అంత‌ర్గ‌త ఆలోచ‌న‌. అందుకే.. పోట్లాడ‌టం కంటే.. మాట్లాడ‌ట‌మే మేలంటూ చెబుతూ వ‌స్తున్నారు. కానీ.. కేంద్రం తాను చేయ‌ద‌ల‌చుకున్న‌వి చేస్తాను.. త‌ప్ప ఎవ‌రి మాట వినాల్సిన అవ‌స‌రం లేద‌నే అభిప్రాయంలో ఉంది. ఇటువంటి భిన్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఏం చేయ‌బోతున్నార‌నేది ప్ర‌శ్న‌గా మారింది. ఏది చేసినా.. భ‌విష్య‌త్తు రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని మాత్ర‌మే స్పందిస్తారంటూ.. పార్టీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17738
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author