బాహుబలికి మహామస్తకాభిషేకం!

బాహుబలికి మహామస్తకాభిషేకం!
February 17 17:58 2018
బెంగళూరు,
ప్రముఖ జైన క్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెళగొళ ఒకటి. అక్కడి గోమఠేశ్వరుడికి పన్నెండేళ్లకోసారి మహామస్తకాభిషేకాషాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆ వేడుకను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ లక్షల జనం హాజరవుతారు. ఫిబ్రవరి 17 నుంచి 25 వరకూ జరగనున్న ఈ ఉత్సవాలకు ఏడోతారీఖున నాంది పలకనున్నారు.
శ్రావణబెళగొళ పేరు పరిచయమున్నవారెవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కడ కొలువై ఉండే ఎత్తైన గోమఠేశ్వరుడి విగ్రహమే. పొడవాటి చేతులూ బలిష్ఠమైన దేహం నిర్వికారమైన నవ్వుతో దిగంబరుడిగా కనిపించే ఈయన్నే బాహుబలి అనీ పిలుస్తారు. జ్ఞాన బోధకుడిగా, అహింసా మార్గాన్ని అనుసరిస్తూ శాంతిని పాదుగొల్పిన మహనీయుడిగా ఆయనకు జైన మతంలో పవిత్రస్థానముంది. కర్ణాటకరాష్ట్రం హాసన జిల్లా శ్రావణబెళగొళలో ఉన్న ఈయన విగ్రహానికి ఈ ఏడాది 89వ మహామస్తకాభిషేకాన్ని నిర్వహించనున్నారు.
ఎవరీ బాహుబలి…
జైన, విష్ణు పురాణాల్లో బాహుబలి ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుపురాణం ప్రకారం, జైన తీర్థంకరుల్లో మొదటివాడూ ఇక్ష్వాకు వంశస్థుడైన వృషభనాథుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలన చేసేవాడు. ఆయనకు సునందాదేవి, యశస్వతీదేవి అనే ఇద్దరు భార్యల ద్వారా భరతుడు, బాహుబలి అనే పుత్రులు కలిగారు. కొన్ని కారణాలవల్ల వృషభనాథుడు విరక్తుడై రాజ్యాన్ని విభజించి అయోధ్యకు భరతుడినీ, పోదనపురానికి(ఇప్పటి తెలంగాణలోని బోధన్‌ను) బాహుబలినీ రాజులుగా చేసి సర్వసంగపరిత్యాగుడయ్యాడు. జైత్రయాత్రలో భాగంగా బాహుబలితోనూ భరతుడు యుద్ధం చేయాలనుకున్నాడు. ఇద్దరూ యుద్ధ విద్యాసంపన్నులు కాబట్టి వీరి పోరు వల్ల అపార సైన్య నష్టం వాటిల్లుతుందని భయపడ్డ ఇరు పక్షాల మంత్రులూ సోదరులిద్దరే ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తే బాగుంటుందని చేసిన ప్రతిపాదనను వీరిద్దరూ అంగీకరించారు. మల్లయుద్ధంలో బాహుబలి భరతుణ్ణి పిడికిలితో గుద్ది చంపేయాలని చెయ్యి పైకెత్తాడు. అప్పుడు సోదరుడి కళ్లలో మరణ భయాన్ని చూసి చలించిపోయిన బాహుబలి, వెంటనే విరక్తుడయ్యాడు. రాజ్యం కోసం అన్నతో యుధ్ధమా అని బాధపడి, తన రాజ్యాన్ని సైతం భరతుడికి అప్పగించి, సన్యాసం తీసుకుని తపస్సుచేసి మహత్తర జ్ఞాన సంపన్నుడయ్యాడు.
అదే స్ఫూర్తితో…
అప్పట్లో బాహుబలి పాలించిన బోధన్‌లో అతి ఎత్తైన బాహుబలి విగ్రహం ఉండేదట. దాని స్ఫూర్తితో అప్పటి గంగరాజుల మంత్రి చాముండరాయ కర్ణాటకలోనూ అలాంటిదే నిర్మించాలని తలపెట్టి జైన మతానికి ఆలవాలంగా ఉన్న వింధ్యగిరిపై  క్రీ.శ.981లో దీన్ని ప్రతిష్ఠించి పన్నెండేళ్లకొకసారి మహామస్తకాభిషేకాన్ని జరిపే ఆనవాయితీని ప్రారంభించాడు. విగ్రహాన్ని చెక్కించాడు కాబట్టి తనొక్కడే దానికి అభిషేకం చేయాలని భావించి తొలుత అభిషేకోత్సవాల్లో ఎవర్నీ పాల్గొననివ్వలేదు. తెప్పించిన ద్రవ్యాలన్నీ అయిపోయినా బాహుబలి విగ్రహం కాళ్లదాకా తడవకపోవడం వల్ల అక్కడికి వచ్చిన ఒక వృద్ధురాలు తాను తెచ్చిన పాలు పోస్తానని అడగడంతో తప్పని పరిస్థితుల్లో ఆమెను అనుమతించాడట. అయితే ఆ పాలు విగ్రహాన్ని తడపడమే కాదు నేల మీది దాకా ఒక ధారలా ప్రవహించాయట. ఆ రోజు చాముండరాయ కళ్లు తెరిపించింది జైన దేవతేనని చెప్పుకుంటారు. అప్పటి నుంచీ ఆ వేడుకకి హాజరయిన జనమంతా అభిషేకంలో భాగస్వాములవుతూ ఉంటారు. 17వ తారీఖు నుంచి జరగబోయే ఈ అభిషేకానికి నీళ్లు, పసుపు, చందనం, సర్వౌషధి కషాయం, పువ్వులూ తదితరాలను వినియోగిస్తారు. విగ్రహానికి ఎదురుగా కూర్చుని ఆరువేల మంది దాకా పూజలు తిలకించొచ్చు. ఈ కొండకు ఎదురుగా ఉండే చంద్రగిరిపైనుంచీ రెండు లక్షల మంది వేడుకను వీక్షించగలిగేలా ఏర్పాట్లు చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17903
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author