సేకరణ నిలిపివేత..రైతులకు కలత..

సేకరణ నిలిపివేత..రైతులకు కలత..
February 19 13:05 2018
జగిత్యాల,
బయట మార్కెట్‌లో తగిన ధర లేకున్నా ప్రభుత్వ పరంగా సాగే కొనుగోళ్లు ఆదుకుంటాయని కంది రైతులు ఆశపడ్డారు. ప్రభుత్వం చెల్లించే గిట్టుబాటు ధరతో ఈ దఫా ఆర్ధిక సమస్యలు కొంతైనా తీరతాయని భావించారు. అయితే ఈ ఆశలు ఎంతోకాలం నిలవలేదని కరీంనగర్ జిల్లా కంది రైతులు అంటున్నారు. సర్కార్‌ కంది కొనుగోళ్లు ముగించనుండడమే దీనికి కారణమని చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కేంద్ర పరిమితి ప్రకారం కందుల కొనుగోళ్లను ముగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కానీ జిల్లాకు కేటాయించిన లక్ష్యం పూర్తికాలేదు. లక్ష్యం చేరుకోకుండానే కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌లలోని మార్క్‌ఫెడ్‌ కేంద్రాలను  మూసివేశారు. కేవలం జగిత్యాల కేంద్రాన్ని మరో రెండు మూడు రోజులు కొనసాగించే అవకాశముంది. దీంతో కంది రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. పలువురు రైతులు పంటను ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు తీసుకురాలేదు. ప్రభుత్వం గనుక కొనుగోళ్లు నిలిపివేస్తే వారంతా దళారులు, ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకోవాలి. అదే జరిగితే వారు ఎంత ధర నిర్ణయిస్తే అంతకే విక్రయించాలి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.
వాస్తవానికి తెలంగాణలో 1.70 లక్షల టన్నుల సేకరణను కేంద్రం అనుమతించింది. ఈ మేరకు మిగిలిన జిల్లాల్లో కందులను కొనుగోలు చేశారు. జగిత్యాల జిల్లాలో 23 వేల టన్నుల కందులను కొనుగోలు చేసేందుకు 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ 5,152  క్వింటాళ్లను మాత్రమే సేకరించారు. ఈలోపే రాష్ట్రవ్యాప్త పరిమితి ముగిసిందన్న కారణంతో కేంద్రాలను మూసివేయడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. క్వింటాల్ కందులకు ప్రభుత్వ ధర రూ.5,450 ఉంది. బయటి మార్కెట్‌లో రూ.4వేలకు లోపే ధరలున్నాయి. దీంతో ప్రభుత్వ కేంద్రం ఉంటే రైతులకు కొంత లాభించే అవకాశం ఉంది. అయితే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వారంపది రోజుల్లోనే మూసివేయడంతో రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. కందులన్నీ విక్రయించే వరకు కేంద్రాలను కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం కరుణించకపోతే ఈ ఏడాది కష్టాలనష్టాలకోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేకుండా పోతుందని ఆర్ధిక సమస్యలను గట్టెక్కలేమని వాపోతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17970
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author