పొంచి ఉన్న నీటి ఎద్దడి?

పొంచి ఉన్న నీటి ఎద్దడి?
February 19 13:17 2018
ఆదిలాబాద్,
వేసవి ఎఫెక్ట్ ప్రారంభమైపోయింది. ఎండలు క్రమంగా విజృంభిస్తున్నాయి. దీంతో తాగునీటి కటకటపై ఇప్పుడే తెలంగాణ వాసుల్లో ఆందోళన మొదలైపోయింది. ప్రధానంగా నిర్మల్ ప్రాంతంలో  భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటి పోతున్నాయి. ఎండాకాలం తీవ్రం ముందే జిల్లాలో నీటి ఎద్దడి మొదలైపోతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా వేసవి వచ్చిందంటే జిల్లాలోని గిరిజన గ్రామాల్లో తాగు, సాగు నీటికి కటకట తలెత్తుతుంది.ప్రజల దాహార్తిని తీర్చే బోరుబావులు వట్టి పోతాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చేతి పంపులు అడుగంటి పోయి పనిచేయడం లేదు. వస్తున్న కొద్దిపాటి నీరు సరిపోక జనాలు చెలిమెలు, వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. చేతిపంపు వద్ద గంటపాటు కొడితేగానీ బిందెడు రాని దుస్థితి. గుక్కెడు నీటి కోసం ప్రజల కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎండలు ఎక్కువైతే పరిస్థితులు దారుణంగా మారుతుందని అంతా అంటున్నారు. మరోవైపు ప్రాంతీయంగా చేతిపంపులు, తాగునీటి పథకాలు మరమ్మతులు గురై నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో తాగునీటికి పాట్లు తప్పవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి వేసవి తీవ్రం కాకుండా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. లేకుంటే గుక్కెడు నీటి కోసం అల్లాడిపోవాల్సిన దుస్థితి నెలకొంటుందని అంటున్నారు.
గతేడాది భారీ వర్షాలు కురియడంతో వేసవికి ముందు నీటి ఎద్దడి అంతగా కనిపించలేదు. కానీ ఈ ఏడాది వర్షాలు అనుకున్నంతగా కురవలేదు. కురిసిన కొద్దిపాటి వర్షాల నీటిని భూగర్భంలోకి ఇంకించే చర్యలు ఆశించినంతగా లేకపోవడంతో నీటి సమస్య తలెత్తుతోంది. ఇప్పటికే మారుమూల గిరిజన గ్రామాల్లో నీటికి ఇబ్బంది మొదలైంది. వేసవికి ముందే ప్రత్యమ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిషన్‌ భగీరథపై దృష్టి సారించి చేయాల్సిన పనులను దాటవేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యంతో సంబంధం లేకుండా సౌరశక్తితో ఏర్పాటు చేసిన నీటి పథకాలున్నాయి. అయితే ఇవి చాలా చోట్ల పనికిరావడంలేదు. ఎండాకాలం వచ్చిదంటే బాధిత గ్రామాల ప్రజలు దాహార్తి తీర్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. కచ్చితంగా చెప్పాంటే నరకయాతన అనుభవిస్తున్నారు.  జిల్లాలో గతేడాది జనవరిలో సరాసరి 6.86 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఈ ఏడాది ఏకంగా సరాసరి 8.52 మీటర్లకు పడిపోయాయి. ఈ లెక్క చాలు రానున్న రోజుల్లో స్థానికంగా నీటి సమస్య ఎలా ఉండబోతుందో. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అంతా విజ్ఞప్తిచేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17977
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author