చార్మినార్ ప్రాజెక్ట్ ప‌నులను ప‌రిశీలించిన అర‌వింద్‌కుమార్‌

చార్మినార్ ప్రాజెక్ట్ ప‌నులను ప‌రిశీలించిన అర‌వింద్‌కుమార్‌
February 23 17:31 2018
హైదరాబాద్
సుప్ర‌సిద్ద ప‌ర్యాట‌క, చారిత్ర‌క స్థ‌ల‌మైన చార్మినార్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల‌ను ప‌ర్యాట‌కుల‌కు మ‌రింత ఆక‌ర్ష‌నీయంగా ఉండేవిధంగా చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై అద్య‌య‌నం చేయ‌డానికి ఉన్న‌త‌స్థాయి అధికారుల బృందాన్నిట‌ర్కి రాజ‌ధాని ఇస్తాంబుల్ న‌గ‌రానికి పంపించ‌నున్న‌ట్టు రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్‌కుమార్ పేర్కొన్నారు. దాదాపు 35కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో చేప‌డుతున్న చార్మినార్ పాదాచారుల ప్రాజెక్ట్ ప‌నుల పురోగ‌తిని నేడు ఉద‌యం అర‌వింద్‌కుమార్ ప‌రిశీలించారు. గ‌త ద‌శాబ్ద కాలంగా కొన‌సాగుతున్న ఈ ప‌నుల‌ను యుద్ద ప్రాతిప‌దిక‌పై పూర్తిచేయాల‌ని రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించ‌డంతో నేడు ఈ ప‌నుల‌ను జీహెచ్ఎంసీ అధికారులు, ఇంజ‌నీర్ల‌తో క‌లిసి ప‌రిశీలించారు. అమృత్‌స‌ర్ గోల్డెన్ టెంపుల్‌ను పున‌రుద్ద‌రించిన విధానంలో చేప‌ట్టిన విధంగానే చార్మినార్ ప్రాజెక్ట్ ప‌నుల‌ను పూర్తిచేయాల‌ని ఆదేశించారు. చార్మినార్ బ‌ఫ‌ర్‌జోన్ చుట్టూ చేప‌ట్టిన గ్రానైట్ పేమెంట్ ప‌నులు, లాడ్ బ‌జార్ నుండి స‌ర్దార్ మ‌హ‌ల్ వ‌ర‌కు పూర్తి అయిన గ్రానైట్ పేమెంట్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. లాడ్ బజార్‌లో ఉన్న దుకాణాల‌న్నింటిని ఒకే మాదిరిగా ఉండే విధంగా రూపుదిద్దాల‌ని మున్సిప‌ల్ శాఖ కార్య‌ద‌ర్శి సూచించారు. దీంతో ఇప్ప‌టికే లాడ్ బ‌జార్ మార్గంలోని ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు భాగాన్ని స్థానిక సంస్కృతిని తెలియ‌జేసేలా ఒకే మాదిరిగా ఎలివేష‌న్ నిర్మాణాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్టు జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. ఇందుకుగాను 39కోట్ల రూపాయ‌లు వ్య‌యంతో అంచ‌నాల‌ను రూపొందించి డిజైన్ల‌ను కన్స‌ల్టెన్సీ సంస్థ అందించింద‌ని ఆ ప్ర‌తిపాద‌న‌లు ప‌రిశీల‌న ద‌శ‌లో ఉన్నాయ‌ని వివ‌రించారు. చార్మినార్ ప‌రిస‌ర ప్రాంతాల్లో వివిధ పార్టీలు, వ్యాపార సంస్థ‌ల‌కు చెందిన ఫ్లెక్సీ బ్యాన‌ర్లు, హోర్డింగ్‌లు ఉన్నాయ‌ని, వాటిని వెంట‌నే తొలగించాల్సిందిగా కార్య‌ద‌ర్శి ఆదేశించారు. అదేమాదిరిగా చార్మినార్ చుట్టూ అలంకార‌యుతంగా ఉండే వీధిదీపాల‌ను అమ‌ర్చాల‌ని అన్నారు. స్వ‌చ్ఛ‌ ఐకానిక్ ప్రాజెక్ట్ కింద ఎన్‌.టి.పి.సి 9కోట్ల రూపాయ‌ల‌ను స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాలను చేప‌ట్ట‌డానికి మంజూరు చేసింద‌ని వివ‌రించ‌గా స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌కు కాకుండా లాడ్ బ‌జార్ అభివృద్దికి కావాల్సిన నిధుల‌ను అందించాల్సిందిగా ఎన్‌.టి.పి.సిని కోర‌నున్న‌ట్లు అర‌వింద్‌కుమార్ అన్నారు. ప‌త్త‌ర్‌గ‌ట్టి ప్రాంతంలోని రాతి క‌ట్ట‌డాల‌తో ఉన్న హెరిటేజ్ భ‌వ‌నాల్లో ఉన్న దుకాణాల‌కు ఒకేవిధ‌మైన నేమ్ ప్లేట్ల‌ను అమ‌ర్చిన‌విధంగానే చార్మినార్‌కు దారితీసే ఇత‌ర మార్గాల్లోని దుకాణాల‌కు కూడా ఏర్పాటు చేయాల‌ని సూచించారు. స‌ర్దార్ మ‌హ‌ల్‌తో పాటు ప‌రిస‌ర ర‌హ‌దారుల‌పై ఉన్న మ్యాన్‌హోల్ పైక‌ప్పుల‌ను వెంట‌నే మార్చి ఆక‌ర్ష‌ణీయంగా ఉండే పైక‌ప్పుల‌ను ఏర్పాటు చేయాల‌ని జ‌ల‌మండ‌లి ఎండి దాన‌కిషోర్‌కు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సౌత్ జోన్ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి, స్టేట్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చీఫ్ ఇంజ‌నీర్ మోహ‌న్‌నాయ‌క్‌, చార్మినార్ పెడెస్టేరియ‌న్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రావు, సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్ ద‌త్తుపంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18466
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author