పంచాయితీ ఎన్నికలకు రెడీ అవుతున్న బ్యాలెట్ బాక్సలు

పంచాయితీ ఎన్నికలకు రెడీ అవుతున్న బ్యాలెట్ బాక్సలు
February 26 12:51 2018
ఖమ్మం,
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా.. అందుకు వెంటనే కార్యాచరణలోకి దిగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గడువు ముంచుకొస్తున్నా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నా… ప్రభుత్వం నుంచి మాత్రం స్పష్టత రావటంలేదు. పంచాయతీరాజ్‌చట్టంలో అనేక మార్పులు చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది.  మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చినా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పంచాయతీరాజ్‌చట్టంలో మార్పులకు సంబంధించిన బిల్లుపై చర్చ జరగలేదు. మంత్రివర్గం ఆమోదించలేదు. మంత్రి వర్గం ఆమోదించిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించి బిల్లును చట్టరూపంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని సీఎం చాలా రోజులుగా భావిస్తున్నా కొలిక్కిరావటంలేదు. ఇదే బిల్లులో కొత్త పంచాయతీల ఏర్పాటు సైతం ఉంది. కొత్త పంచాయతీలు ఏర్పడితే పంచాయతీల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక మళ్లీ మొదటికి వస్తుంది. పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. వార్డుల పరిధిని నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన తాజా ఎన్నికల ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో నేటి వరకు సిద్ధం చేయలేదు. తాజా ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత ఆ జాబితా ఆధారంగా పంచాయతీలు, వార్డులకు అనుగుణంగా ఓటర్ల జాబితాను పునర్విభజించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకుగాను ముసాయిదా ప్రణాళిక సిద్ధం చేసి అమలు ఎన్నికల సంఘం అనుమతితో అమలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల పునర్విభజన జరుగుతుందా… గ్రామ పంచాయతీల సంఖ్య పెరుగుతుందా.. పంచాయతీల పెంపుపై ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకొస్తుందా.. తదితర అంశాలను ఒకవైపు గమనిస్తూనే ప్రస్తుత పంచాయతీల పాలకవర్గాల గడువు ముగింపు తేదీ దగ్గర పడుతున్నందున ఆలోగా ఎన్నికలు ఎప్పుడు జరపాల్సి వచ్చినా అందుకు సంసిద్ధం అయ్యేందుకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే జులై 31 తేదీ నాటికి ప్రస్తుత గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియనుంది. ఆగస్టు 1 తేదీ నుంచి గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు కొలువు తీరాల్సిన అవసరముంది. అంటే గడువు ముగిసేందుకు మూడు నెలలు ముందుగానే ఎన్నికలు నిర్వహించే వెసులుబాటును చట్టం కల్పించింది. అంటే వచ్చే ఏప్రిల్‌ నెలాఖరు నుంచి ఎప్పుడైనా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. అయితే ఇప్పుడున్న పంచాయతీలను పునర్విభజించి మరిన్ని పంచాయతీలు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. ఎట్టిపరిస్థితుల్లో కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తామని, అందుకు అవసరమైన చట్టం రూపొందించి, అసెంబ్లీలో ఆమోదించి అమలులోకి తేవాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే కొత్త పంచాయతీల ఏర్పాటుకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. జిల్లాలో ఇప్పుడున్న 427 గ్రామ పంచాయతీలకు అదనంగా 171 పంచాయతీల ఏర్పాటుకు జిల్లా నుంచి ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. కొత్త పంచాయతీల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్‌ బాక్సులను కర్నాటక రాష్ట్రం నుంచి ఖమ్మం తెప్పిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి, షిమోగా (శివమొగ్గ) జిల్లాల నుంచి 3600 బ్యాలెట్‌ బాక్సులు జిల్లాకు తెప్పించాల్సి ఉండగా ఒక లారీలో 985 బ్యాలెట్‌ బాక్సులు ఖమ్మం చేరుకున్నాయి. మిగతావి ఆదివారం ఖమ్మం రానున్నాయి. శనివారం లారీలో ఖమ్మం వచ్చిన బ్యాలెట్‌ బాక్సులను టేకులపల్లిలోని మహిళా ప్రాంగణం భవనంలోని గదుల్లో నిల్వ చేసి గదులకు సీల్‌ వేశారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులను మహిళా ప్రాంగణం గదుల్లో భద్రపరిచారు. ఇవి కాకుండా జిల్లాలో 800 బ్యాలెట్‌ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్‌ పత్రం పద్ధతిలోనే నిర్వహిస్తారు. ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు) వాడరు. బ్యాలెట్‌ విధానంలో జరిగే ఎన్నికలకు బ్యాలెట్‌ బాక్సులు కావాల్సి ఉంటుంది. జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని బ్యాలెట్‌ బాక్సులున్నాయి.. వాటి తాజా పరిస్థితి ఏమిటి.. ఎన్ని ఉపయోగపడతాయి.. మరెన్నింటికి మరమ్మతులు చేయాల్సి ఉంటుంది.. అసలు పనికిరానివి ఎన్ని ఉన్నాయనే లెక్కలు తేల్చి.. సమగ్ర నివేదిక రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఎన్నికల సంఘం అనుమతితో ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు పొరగు రాష్ట్రం నుంచి తెప్పిస్తున్నారు.ఇలాంటి అనేక చిక్కుముడులతో కూడుకున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై అధికారులకే అంతుచిక్కటంలేదు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18639
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author