మళ్లీ జగన్ పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు

మళ్లీ జగన్ పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు
February 26 13:34 2018
గుంటూరు,
వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత వివిధ కారణాలతో పచ్చకండువా కప్పుకొన్న 23 మంది ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఉన్న పార్టీలో వాళ్లంతా సంతోషంగానే ఉన్నారా? అక్కడే ఉండిపోతామన్న నమ్మకం వాళ్లలో ఎంతమందికి ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు నకారాత్మక సమాధానమే వినిపిస్తోంది. పార్టీ నుంచి వెళ్లినవారు మళ్లీ తిరిగి వస్తామంటే తీసుకోడానికి అభ్యంతరం లేదన్న పార్టీ కీలక నేత విజయుసాయి రెడ్డి ప్రకటన వాళ్లలో మరింతగా ఆశలు రేపుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన 23 మందిలో చాలామంది ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఏపీలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బలహీనపరిచి, క్షేత్రస్థాయిలో సైతం ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వాన్ని చెల్లాచెదురు చేసి సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించాలనే వ్యూహంతో టీడీపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’కు తెరతీసింది. పలు నియోజకవర్గాల్లో బహునాయకత్వ సమస్య, సమాంతర నాయకత్వాలతో పాటు కండువా మార్చుకునేటప్పుడు టీడీపీ అధినాయకత్వం పలువురు శాసనసభ్యులకు ఇచ్చిన ‘హామీ’లను నెరవేర్చలేదనే ఆగ్రహంతో టీడీపీలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, అమర్‌నాథ్ రెడ్డిలకు మాత్రం మంత్రిపదవులు దక్కగా.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు నియోజకవర్గంపై పూర్తి ఆధిపత్యం లభించేలా పార్టీ నాయకత్వం ఎమ్మెల్సీ కరణం బలరాంను నియంత్రించగలిగింది. మిగిలిన ఎమ్మెల్యేలకు అందాల్సిన తాయిలాలు పూర్తిగా అందలేదని, ఇచ్చిన హామీలు నీటిమూటలా మారిపోయాయని పలువురు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు పార్టీకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు కూడా. కర్నూలు జిల్లాకే చెందిన ఓ శాసనసభ్యుడైతే తనకీసారి టికెట్ వస్తుందా.. లేదా అనే అనుమానంతో సతమతవవుతున్నారు.
అనంతపురంలోని ఓ నియోజకవర్గంలో టీడీపీ పరాజిత అభ్యర్థికి టికెట్ లేనట్టేనని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీలో చేరిన ఓ ఎమ్మెల్యే అయితే టికెట్ గల్లంతు.. లేదా స్థానం మార్పునకు అవకాశం ఉందంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ మాజీమంత్రి కోసం ప్రస్తుతం గెలిచిన శాసనసభ్యున్ని పక్కన పెడతారనే ప్రచారం ఉంది. పశ్చిమ ప్రకాశానికి చెందిన రెండు నియోజకవర్గాల్లో టీడీపీలో పరిస్థితి అయోమయంగా ఉండగా.. మరో నియోజకవర్గంలో విభేదాలు నిత్యం రచ్చకెక్కుతున్నాయి. గుంటూరు జిల్లాలో పరిస్థితి సాధారణంగానే ఉంది. ఇక కృష్ణాజిల్లాలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టికెట్ ఖరారుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. వారిలో ఒకరికి దాదాపుగా టికెట్ లేనట్టే. ఇక ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ మారినవారి పరిస్థితి ఎందుకు మారామా అన్నట్లు ఉందంటున్నారు. ఒకవైపు ఈ హడావుడి ఇలా ఉండగా.. ముంచుకొస్తున్న రాజ్యసభ ఎన్నికలు అధికార పార్టీని కలవరానికి గురిచేస్తున్నాయి. ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలను అవలీలగా కైవసం చేసుకోవచ్చుననే ధీమాతో నిన్న మొన్నటివరకు ఉన్న పార్టీ అధిష్ఠానం.. ఇప్పుడు అసంతృప్త ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడతారనే ఉప్పందటంతో ఉలిక్కిపడింది. దిద్దుబాటు చర్యల కోసం వ్యూహకర్తలు ఇప్పటికే రంగంలోకి దిగారు. మూడు స్థానాల్లో టీడీపీకి రెండు ఖాయంగా దక్కుతాయి. కానీ మూడో స్థానాన్ని కూడా ద్వితీయ ప్రాధాన్య ఓటుతో ఎగరేసుకుపోవాలని టీడీపీ భావించింది. కానీ.. వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా నెల్లూరుకు చెందిన బడా కాంట్రాక్టరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించారు. రంగంలోకి దిగన వేమిరెడ్డి ఇప్పటికే వైసీపీలో మిగిలిన 44మంది ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా కలిసి లేదా మాట్లాడి.. తనకు ఓటు వేయాలని కోరారు. దాంతోపాటు.. టీడీపీలోకి జంప్ అయిన 23 మందిలో చాలామందికి ఫోన్ టచ్‌లోకి వెళ్లారని చెబుతున్నారు. వేమిరెడ్డికి చెందిన ప్రత్యేక దూతలు సైతం ఈ జంపింగ్ ఎమ్మెల్యేలను కలిసి పలు హామీలు గుప్పిస్తున్నట్లు సమాచారం. వేమిరెడ్డి జోరుకు బ్రేకులు చంద్రబాబు వేయగలారా? అనేది చర్చనీయాంశంగా ఉంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18659
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author