మతతత్వ ప్రచారానికి సిగ్గెగ్గులు ఉండవు – వాహెద్

మతతత్వ ప్రచారానికి సిగ్గెగ్గులు ఉండవు – వాహెద్
February 26 17:56 2018
కేరళలో జరిగింది అమానుషం. కేవలం కిలో బియ్యం దొంగిలించాడన్న ఆరోపణతో మధు అనే ముప్పయ్యేళ్ళ ఆదివాసి యువకుడిని,మానసిక స్థిమితం సరిగా లేని వాడిని జనం కొట్టి కొట్టి చంపేశారు. భారతదేశంలో గుంపుస్వామ్యం (mobocracy) కి ఇది తాజా ఉదాహరణ. గుంపులు దాడి చేసి చంపేస్తున్న సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ నేరంలో పోలీసులు 16మందిని అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. పాళక్కడ్ అడవుల్లో ఈ సంఘటన జరిగింది. అతడిని పట్టుకుని దాదాపు నాలుగ్గంటల పాటు నిర్దయగా కొట్టినట్లు తెలుస్తోంది. త్రిస్సుర్ మెడికల్ కాలేజీలో పోస్టుమార్టమ్ జరిగింది. దెబ్బలవల్లనే మరణించినట్లు పోస్టుమార్టమ్ నివేదిక తేల్చింది. పోస్టుమార్టమ్ నివేదిక తర్వాత నిందితులను అరెస్టు చేయడం జరిగింది. మధు సోదరి చంద్రిక ఈ విషయమై మాట్లాడుతూ మధుపై దాడి జరిగింది అడవిలో, అక్కడికి వెళ్ళాలంటే ఫారెస్టు అధికారుల అనుమతి అవసరం. అలాంటప్పుడు గుంపు అక్కడికి ఎలా వెళ్ళగలిగిందని ప్రశ్నిస్తోంది. ఒక చిన్న దొంగతనానికి పట్టుకుని అత్యంత అమానుషంగా కొట్టి చంపడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో దేశవ్యాప్తంగా గగ్గోలు చెలరేగింది. అలా ఫోటోలు తీసిన వారిలో ఒక వ్యక్తి ఉబైద్. అతనికి వెనక మరో వ్యక్తి మధు వద్ద నిలబడి ఉన్నాడు. మధు చేతులు కట్టేసి ఉన్నాయి. ఈ అమానుష సంఘటన పట్ల విమర్శలు పెల్లుబుకడంతో రాష్ట్ర ప్రభుత్వం మేజిస్ట్రేటు విచారణకు ఆదేశించింది.
అత్తపది ప్రాంతంలో ఆదివాసి గ్రామం కడుక్ మన్నా కు చెందిన వాడు మధు. మానసిక స్థిమితం లేనివాడు. అడవిలో ఒక గుహలో ఉండేవాడు. అతను ఊళ్ళో దొంగతనాలు చేస్తున్నాడన్న అనుమానంతో దాడి జరిగింది.
ప్రారంభంలో అరెస్టయిన ముగ్గురి గురించి వార్తలు వచ్చాయి. కే . హుస్సేన్ అనే వ్యాపారి, పి.పి.అబ్దుల్ కరీం, ఉబైద్ ల పేర్లు బయటకు వచ్చాయి. అరెస్టయిన వారిలో ఉబైద్ అనే యువకుడు స్థానిక ఎమ్మెల్యే షంషుద్దీన్ రాజకీయ సభల్లో కనిపించాడని, ఆయనకు బంధువని మరో వార్త చక్కర్లు కొట్టింది. షంషుద్దీన్ ఈ వార్తను ఖండించాడు.
ప్రారంభంలో మీడియాలో కనిపించిన మూడు పేర్లు ఉబైద్, హుస్సేన్, పి.పి.అబ్దుల్ కరీం. ఈ పేర్లు మీడియాలో రావడానికి ముఖ్యమైన కారణం, మాజీ క్రికెటరు వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీటు. ఆ ట్వీటులో ఆయన ముగ్గురి పేర్లు రాస్తు ఒక నిరుపేద, నిస్సహాయ ఆదివాసిని గుంపు దాడి చేసి కొట్టి చంపేసిందని రాశాడు. మూడు పేర్లు ముస్లిములవిగా కనబడడంతో ముస్లిం గుంపు దాడి చేసిందన్న అభిప్రాయం కలిగించేలా ఆ ట్వీటు ఉంది. ఆ వెంటనే మతతత్వమే ఊపిరిగా బతుకుతున్న వాళ్ళు రెచ్చిపోయి సోషల్ మీడియాలో ప్రతాపం చూపించారు. ఫేస్ బుక్కులో పోస్టులు వచ్చాయి. ’’ఆకలి బాధకు తట్టుకోలేక కేవలం 200 రూపాయల విలువైన ఆహార వస్తువులు దొంగతనం చేసాడనే కారణంతో మధు (27సం,,) అనే అమాయక ఆదివాసీ హిందూ యువకుణ్ణి చేతులు కట్టేసి మరీ కొట్టిన 15 మంది వ్యక్తులు.. ఆదివాసీ మధును కొట్టిన చంపిన వ్యక్తులలో మైనారిటీ వర్గానికి చెందిన పాక్కలంసుదైసి హుస్సేన్ బుక్కైసుదాసి అబ్దుల్_జలీల్ లను అరెస్ట్ చేసిన కేరళ, అట్టపడి పోలీస్ లు‘‘ అంటూ తెలుగులోను ఈ వీర మతతత్వ సైనికులు పోస్టులు పెట్టడం ప్రారంభించారు.
ఈ అమానుష హత్యను దేశంలో అందరూ ఖండించారు, ముస్లిం, హిందూ తేడా లేకుండా అందరూ ఖండించినప్పటికీ ఈ మతతత్వవాదులకు ఇందులో మతం కనిపించింది. దొరికిన అవకాశాన్న పోగొట్టుకోరాదన్నట్లు శంఖనాద్ పేరుతో ట్విట్టరులో మతోన్మాద వ్యాఖ్యలు చేసే హ్యాండిల్ నుంచి మతతత్వ ప్రచారం మొదలైంది.
రాజస్థాన్ రాజసమంద్ లో ఒక ముస్లిం కూలివాడిని కేవలం లవ్ జిహాద్ అనే అనుమానంతో, కేవలం మతోన్మాదంతో చంపి వీడియో సోషల్ సైటుల్లో పెట్టిన శంభూలాల్ రీగర్ ఎక్కౌంటుకు లక్షల్లో డబ్బులు పంపినవాళ్ళు, శంభూలాల్ కోసం ర్యాలీలు తీసినవాళ్ళు, రైల్లో కేవలం మతోన్మాదంతో జునైద్ అనే కుర్రాడిని చంపినవాళ్ళు, ఇంకా ఇలాంటి అసంఖ్యాక సంఘటనల్లో వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వాళ్ళు ట్వీటు చేసినట్లు ఎక్కడా కనబడలేదు. కాని ఇప్పుడు మాత్రం. ’’మధు కిలో బియ్యం దొంగిలించాడు. ఉబైద్, హుస్సేన్, అబ్దుల్ కరీంల గుంపు ఆ పేదవాడిని కొట్టి చంపింది. ఇది నాగరిక సమాజానికి మచ్చ. ఇంత జరిగినా ఏమీ తేడా లేదు (కుచ్ ఫరక్ నహీ పడ్తా), నేను సిగ్గుపడుతున్నాను‘‘ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీటు చేశాడు. కుచ్ ఫరక్ నహీ పడ్తా.. అని జునైద్ విషయంలో ట్వీటు చేశాడా. గోగుండాల దాడుల్లో చనిపోయిన అమాయకుల సంఘటనల్లో ట్వీటు చేశాడా? శంభూలాల్ రీగర్ చేసిన క్రూరమైన హత్య సందర్భంలో ట్వీటు చేశాడా? ఎక్కడా అలాంటి వార్త ఎప్పుడు రాలేదే. మూడు పేర్లు పట్టుకుని వెంటనే సిగ్గుపడుతున్నాను, నాగరిక సమాజానికి మచ్చ అంటూ ఈ దారుణానికి పాల్పడింది ముస్లిములు అన్న అభిప్రాయం కలిగించేలా ఎందుకీ ట్వీట్లు చేశాడు?
ప్రారంభంలో వచ్చిన వార్తల ప్రకారం పోలీసులు పదిమందిని మధు హత్య కేసులో అరెస్టు చేశారు. అందులో బయటకు వచ్చిన పేర్లు ఉబైద్ వగైరా. తర్వాత వార్తాపత్రికల్లో ఏడుగురి పేర్లు వచ్చాయి. హుస్సేన్, మను దామోదరన్, అబ్దుల్ రహ్మాన్, అబ్దుల్ లతీఫ్, అబ్దుల్ కరీం, ఉమర్, మతాచెన్ జోసెఫ్. ఇందులో మూడు మతాల పేర్లు కనిపిస్తాయి. ఎన్డీటీవికి చెందిన స్నేహ కోషి సెహ్వాగ్ ట్వీటుకు జవాబిస్తూ ఇలా రాశారు.
’’ఒకే మతానికి చెందిన నిందితుల పేర్లు మాత్రమే ప్రస్తావించడం నేరం. అరెస్టయిన అందరి పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. అనీష్, హుస్సేన్, షంషుద్దీన్, రాధాకృష్ణన్, అబూబకర్, జజిమోన్, ఉబైద్, నజీబ్, కరీం, హరీష్, బిజు, మునీర్, సతీష్. వీరేంద్రసెహ్వాగ్ ఈ పేర్లన్నీ రాయడానికి నీకు దమ్ముందా‘‘ అంటూ రాసిందామె.
మధుపై దాడి చేసి చంపిన ఆ గుంపులో అన్ని మతాలవాళ్ళు ఉన్నారు. అది ఒక క్రూరమైన జంతువుల గుంపు. అందులో కేవలం ఒకే మతానికి చెందిన పేర్లను మాత్రం సెహ్వాగ్ ప్రస్తావిస్తూ ట్వీటు చేయడాన్ని చాలా మంది తీవ్రంగా విమర్శించారు. శనివారం సాయంత్రం వరకు 16 మంది అరెస్టయ్యారని శేఖర్ గుప్తా తెలియజేస్తూ, ఇందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారని అన్నాడు. ఇది దారుణమైన నేరం, నేరస్తులకు కఠినశిక్ష పడాలి. కాని దీన్ని సెహ్వాగ్ లాంటి వాళ్ళు మతం రంగు పులమడం ఖండించదగిన విషయమన్నాడు.
సోషల్ మీడియాలో తాను చేసిన పనిన అందరూ ఛీత్కరించుకోవడంతో తన ప్రతిష్ఠ అడుగంటుతుందని భయపడిన సెహ్వాగ్ వెంటనే తన ట్వీటులో అసంపూర్ణ సమాచారానికి చింతిస్తున్నానని మరో ట్వీటు చేశాడు.
’’తప్పు ఒప్పుకోకపోవడం మరో తప్పవుతుంది. ఈ నేరంలో చాలా పేర్లను నేను రాయలేదు. నా వద్ద సమాచారం లేకపోవడం వల్ల జరిగింది. ఈ విషయమై క్షమించాలి. నా ట్వీటు మతతత్వంతో కూడుకున్నది కాదు…‘‘ అంటూ ట్వీటు చేశాడు
కాని అప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఈ గుంపు దాడిలో ముస్లిముల పేర్లు మాత్రమే బయటకు రావడంతో మతతత్వ శక్తులు సోషల్ మీడియాలో చెలరేగిపోయాయి. ఇంత జరిగినా ఎక్కడా ఎలాంటి ఖండనలు లేవంటూ రాసేశాయి. నిజానికి ప్రతి ఒక్కరు ఖండించారు. అంతేకాదు, సిపియం పాలిస్తున్న రాష్ట్రం కాబట్టే ఎవరూ దీనిపై మాట్లాడడం లేదన్నట్లు అబద్దాలు ప్రచారం చేయడం ప్రారంభించాయి. ఇంతకు ముందు గుర్గాంవ్ లో స్కూలు బస్సుపై దాడి సంఘటనలోను ప్రారంభంలో కొన్ని ముస్లిమ్ పేర్లను ప్రచారంలో పెట్టారు. ఈ సిగ్గెగ్గులు లేని మతోన్మాదాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది.
ఈ కేసు విషయానికి వస్తే మధు మానసిక స్థిమితం లేనివాడు. ఇల్లు వదిలేసి అడవిలో ఒక గుహలో ఉండేవాడు. బియ్యం ఆహారపదార్థాలు దొంగిలిస్తున్నాడని ఒక గుంపు ఆ గుహవద్దకు వెళ్ళి అతనిపై దాడి చేసింది. ఫారెస్టు అధికారులు గుంపును అడవిలోకి ఎలా అనుమతించారన్నది ఒక ప్రశ్న. మధును చావగొట్టి, హింసించి పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు మధును జీపెక్కించి, దాడికి పాల్పడిన వారిని వదిలేశారు. దారిలోనే మధు రక్తం కక్కుకుని మరణించాడు.
దేశంలో వెర్రితలలేస్తున్న గుంపు హింసాకాండకు ఇదొక ఉదాహరణ. కేరళ లాంటి రాష్ట్రంలోను ఇవి ఇప్పుడు వ్యాపిస్తున్నాయి. పిల్లలను ఎత్తుకెళ్ళేవారు తిరుగుతున్నారన్న వాట్సప్ మెస్సేజి కూడా ఒకటి ఇలాంటిదే ప్రచారంలో ఉంది. ఈ మెస్సేజిల వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిపై దాడులు జరుగుతున్నాయి. చివరకు రోడ్డుపక్కన నిద్రించే బిచ్చగాళ్ళపై కూడా దాడులు జరుగుతున్నాయి. పిల్లలను ఎత్తుకెళ్ళేవాళ్ళు, పిల్లలున్న ఇండ్ల కిటికీలకు నల్లని స్టిక్కర్లు అతికించి గుర్తులు పెడుతున్నారన్న మరో పుకారు నడిచింది. కిటికీ అద్దాలు తయారు చేసే కంపెనీ ఆ నల్ల స్టిక్కర్లు తామే అతికిస్తామని, అద్దాలు స్టోరు చేస్తున్నప్పుడు పగలకుండా అలా చేస్తామని వివరణ ఇచ్చింది. కాని ఈ పుకారును ప్రచారంలో పెట్టడంలో విద్యావంతులు కూడా చాలా ఉత్సాహం చూపించారు. కేరళలో పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సామ్ తదితర ప్రాంతాల నుంచి పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం వచ్చిన వారిని అనుమానంతో చూడడం జరుగుతోంది. నిజానికి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోవడం అన్నది కేరళ వారిలోను ఎక్కువే. అయినా వలస వచ్చిన వారిని అనుమానంతో చూడడం జరుగుతోంది. అత్తపది ప్రాంతంలో ఆదివాసి జనాభా ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు లేకుండా తీవ్రమైన పేదరికంలో జీవిస్తోంది. అలాగే ట్రాన్స్ జెండర్ల పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది.
అత్తపదిలో ఆదివాసిల జీవనస్థితి చూస్తే, కేరళలో పసిపాపల మరణాల రేటు 10 కాని అత్తపది ఆదివాసుల్లో 66. ఇక్కడ 192 ఆదివాసి ఆవాసాలున్నాయి. ఆదివాసి సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోను విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి.
ఆదివాసి యువకుడు ఆకలి తీర్చుకోడానికి దొంగతనం చేశాడంటే ఆ తప్పు ప్రభుత్వానిదే. అలాగే తమ ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న వారి పట్ల అత్యంత నిర్దయగా వ్యవహరించే సమాజం క్రూరమృగాల సమాజం వంటిదే. బియ్యం దొంగిలించాడన్న నేరానికి కొట్టి చంపేసిన వ్యక్తులు ఏ మతం వారయినా వారిని తీవ్రంగా శిక్షించాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకోగలం. ఈ సంఘటనలోనే కాదు గుంపులు దాడులు చేసిన ప్రతి సంఘటనలోను దోషులకు కఠిన శిక్ష పడాలి. లేకపోతే దేశం గుండా గుంపుల రాజ్యంగా మారిపోవచ్చు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18688
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author