కాంగ్రెస్ గూటికి రావుల…

కాంగ్రెస్ గూటికి రావుల…
February 27 08:43 2018
హైద్రాబాద్,
తెలంగాణ కాంగ్రెస్ లో చేరబోతున్న నాయకుల పేర్లు ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా పాలమూరు వేదికగా గడచిన వారం రోజులుగా రకరకాల రాజకీయ పరిణామాలు తెరమీదికి వస్తున్నాయి. ఓపక్క నాగం జనార్థన్ రెడ్డి చేరికపై కాంగ్రెస్ లో ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీలోకి వస్తే సహించేదీ సహకరించేదీ లేదంటూ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బహిరంగంగానే చెప్పేశారు. నాగంను పార్టీలోకి తేవడం ద్వారా డీకే అరుణ వర్గానికి చెక్ పెట్టాలన్నది సీనియర్ నేత జైపాల్ రెడ్డి వ్యూహమనీ, ఆయనే తెరవెనక నుంచి నాగం చేరికకు మద్దతు ఇస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇదే క్రమంలో అరుణ వర్గానికి ఇంకోరకంగా చెక్ పెట్టేందుకు తెలుగుదేశం నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించే అంశం ఇప్పుడు తెరమీదికి వచ్చింది. ఇది కూడా ఊహాగానమైతే పుకారు అనుకోవచ్చు. కానీ, కాంగ్రెస్ నేతల చిన్నారెడ్డి స్వయంగా రావులను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రాజకీయంగా చర్చనీయాంశం అయింది. నిజానికి, ఈ ఇద్దరు నేతలూ ఒకప్పుడు మిత్రులు. ప్రస్తుతం ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉన్నా.. ఒకరినొకరు విమర్శించుకున్న సందర్భాలు కూడా లేవు. రావుల టీడీపీలో కీలకనేత అయితే, చిన్నారెడ్డి కూడా కాంగ్రెస్ లో అదే స్థాయి నాయకుడు. ఈ ఇద్దరూ ఒకే నియోజక వర్గం నుంచి పోటీ పడుతూ వచ్చారు. అయితే, తెలంగాణలో టీడీపీ నెమ్మదిగా బలహీనమౌతున్న ఈ తరుణంలో.. ఇప్పటికే కీలక నేతలు తలో దారి చూసేసుకున్నారు. ఎన్నికలు దగ్గరపడుతూ ఉండటంతో ఇప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు సమాచారం. అయితే, రావులను ఆహ్వానించడం ద్వారా పరోక్షంగా డీకే అరుణ వర్గానికి పార్టీలో ప్రాధాన్యత తగ్గించాలనే మాస్టర్ ప్లాన్ ఉందనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. రావులకు చిన్నారెడ్డి ఆహ్వానం పంపడం వెనక కూడా జైపాల్ రెడ్డి వ్యూహమేనట! కాంగ్రెస్ లోకి రావుల వస్తే దేవరకద్ర నియోజక వర్గం నుంచి పోటీకి దించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో డీకే అరుణ వర్గానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి స్థానంలో రావులను నిలబెట్టాలన్నది వ్యూహంగా తెలుస్తోంది..! మొత్తానికి, తెలంగాణ కాంగ్రెస్ లో నేతల చేరిక విషయమై జైపాల్ రెడ్డి తెరవెనక చాలానే నడిపిస్తున్న కథనాలు వినిపిస్తున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18717
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author