సర్వ ‘శిక్ష’ అభియాన్ 

సర్వ ‘శిక్ష’ అభియాన్ 
February 28 13:27 2018
విజయనగరం,
సర్వశిక్షాభియాన్‌ ద్వారా గిరిజన ప్రాంతంలో పాఠశాలలకు భవనాలు నిర్మించేందుకు 2014లో ప్రారంభమైన క్రతువు నేటికీ ముగియలేదు. మంజూరైన మొత్తం అయితే ఏదోఒకలా ఖర్చు చేసి, ఖజానా ఖాళీ చేశారు కానీ భవన నిర్మాణాలు మాత్రం పూర్తిచేయలేదు. ఏ భవనానికి ఎంత ఖర్చుచేశారు? ఎంత మిగిలింది అనే లెక్కాపత్రం కూడా లేదు. గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన ఎస్‌ఎస్‌ఏ ఇంజినీరింగు అధికారులు కుమ్మక్కైన ఫలితంగా నిధులు ఖర్చయినా ఫలితం దక్కలేదనేది ప్రధాన ఆరోపణ.
పార్వతీపురం  ఐటీడీఏ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో దాదాపుగా 50 వరకు పాఠశాలల భవనాలు అస్థిపంజరాల్లా దర్శనమిస్తున్నాయి. ఒక్క గుమ్మలక్ష్మీపురం మండలం చింతలపాడు, చాపరాయిబిన్నిడి, కానసింగి, టంకుడు, బయ్యాడ పాఠశాలలతో పాటుగా 20 వరకు పాఠశాలలు ఇలా అసంపూర్తిగా ఉన్నాయి. గతంలో నెల్లికెక్కువ పాఠశాల ఇలాగే అసంపూర్తిగా వదిలేస్తే అప్పట్లో పోలీసులు జోక్యం చేసుకొని ఆ పాఠశాల భవనం పూర్తయ్యేందుకు సహకరించారని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. తర్వాత పాఠశాలల గురించి పట్టించుకున్న వారు ఎవరూ లేకుండా పోయారు.
పాఠశాల కమిటీ అధ్యక్షులకు భవన నిర్మాణాలు, ఖర్చులు తదితర అంశాలపై గిరిజన ప్రాంతంలో అవగాహన లేకపోవడం వల్ల ఇంజినీరింగు అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. నిర్మాణ సామగ్రి కొన్ని చోట్ల ఇంజినీరింగు ఉద్యోగులే కొనుగోలు చేసి అందించారు. దీనికి ఖర్చయ్యిందెంత? వారు డ్రా చేసినది ఎంత అనే విషయంలో గ్రామస్థులకు కానీ కమిటీ సభ్యులకు కానీ స్పష్టత లేదు. ఏజెన్సీలోని మండలాల్లో అసంపూర్తిగా ఉన్న పాఠశాలను పూర్తిచేయడానికి ఒక్కో పాఠశాలకు గరిష్టంగా రూ.లక్ష ఖర్చవుతుంది. జిల్లా అభివృద్ధికి అందుబాటులో ఉన్న నిధులను వీటిని పూర్తిచేయడానికి వెచ్చిస్తే పాఠశాలలు పూర్తికావడంతో పాటుగా, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడే వీలుంటుంది. ఆదిశగా చర్యలు తీసుకుంటే అధికారులకు ఇచ్చిన అర్జీలకు కూడా ఒక అర్థం కల్పించినట్లవుతుంది. లేకుంటే కలెక్టరుకు చెప్పినా, పీవోకు చెప్పినా బడి పని పూర్తికాదనేలా ప్రజలు నీరుకారిపోతారు. ఈదిశగా అధికారులు ఆలోచించి అందుబాటులో ఉన్న నిధులు కేటాయిస్తే మేలు కలుగుతుంది. నిధుల కైంకర్యంలో పాత్రధారులను గుర్తించి వారిపై చర్య తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి.
కురుపాం మండలంలో ఎగువపులిపుట్టి, గుండాం, తులసి, దబ్బమానుగూడ, పొక్కిలి, లిక్కిడి గూడ, తియ్యాలి  15 పాఠశాల భవనాలు అసంపూర్తిగా వదిలేశారు. నిధులు ఎంత ఖర్చయ్యింది కూడా విద్యాకమిటీలకు, ఉపాధ్యాయులకు తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కొమరాడ మండలం కోనవలస, సరాపాడు, కుంభికోట, రాయకర్రవలస, పిల్లిగుడ్డివలస, కెమిశిలలో పాఠశాల భవనాలు మధ్యలో ఆపేశారు. కెమిశిల గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాల కాగా, దీన్ని కాంట్రాక్టర్లు చేపట్టారు. నిధులు సరిపోవనే కారణంగా నిలిపివేశారు. గుత్తేదారుకు చెల్లింపు చేయకపోవడం వల్ల భవనాన్ని అప్పగించ లేదు. జియ్యమ్మవలస మండలంలో నిడగల్లుగూడ, తోలుమండ గ్రామాల్లో పాఠశాలకు భవనాలు పూర్తి చేయాల్సి ఉంది. పార్వతీపురం, సీతానగరం వంటి మైదాన ప్రాంతాల్లో ఎక్కడపనులు నిలిచిపోకుండా పూర్తిచేశారు.
జియ్యమ్మవలస మండలం నిడగల్లుగూడలో పాఠశాల దాదాపుగా చివరదశలో ఉంది. దీనిని పూర్తిచేయడానికి నిర్మాణకర్త సిద్ధంగా ఉన్నా చెల్లింపులు చేయడానికి నిధులు లేక చేతులు ఎత్తేశారు. భవనం పూర్తిచేస్తే తమ చెల్లింపులు విషయం మరిచిపోతారనేఏ కారణంగా వీటిని మధ్యలో నిలిపివేశారు. పిల్లలు మాత్రం శిథిల భవనంలో చదువులు సాగించాల్సిన దుస్థితి. ఒక్కో భవనానికి రూ.5.60 లక్షలు కేటాయించి ఖర్చు చేసినా ఫలితాలు లేకుండా పోయాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18804
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author