రాళ్లపాడు ఆయాకట్టు రైతుల ఎదురు చూపులు

రాళ్లపాడు ఆయాకట్టు రైతుల ఎదురు చూపులు
March 02 12:03 2018
నెల్లూరు,
నెల్లూరు జిల్లాలోని సోమశిల రిజర్వాయర్ నుండి జిల్లా సరిహద్దులో ఉన్న రాళ్లపాడు రిజర్వాయరుకు ఎన్నటికి చేరుతుందోనని రాళ్లపాడు ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. సోమశిల నీటిని ఉత్తరకాలువ ద్వారా కొండాపురం మండలంలోని ఉప్పుటేరుకు తరలిస్తే మెట్టప్రాంత మండలాలైన కలిగిరి, కొండాపురం మండలాలలో వేలాది ఎకరాలలో పంటలు పండి సస్యశ్యామలం అవుతుందని భావించిన కావలి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి కొండపనాయుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రాంత రైతులను కూడా అప్పట్లో బస్సుల్లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వద్దకు తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఎన్టీఆర్ ఏఎస్ పేట మండలం గుడిపాడు నుండి కొండాపురం మండలం వరకు అప్పటి చీఫ్ ఇంజనీర్ రామక్రిష్ణయ్యతో సర్వే చేయించారు. అనంతరం ఆ కాలువను ఉప్పుటేరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు మంజూరు చేయించారు. తరువాత కొన్ని సాంకేతిక కారణాల వలన పనులు ఆగిపోయాయి. తరువాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి కావలి ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ అభ్యర్థన మేరకు కాలువ పనులను పునరుద్ధరించారు. అయితే కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారంపై రైతులు కోర్టుకు వెళ్లటంతో పనులు ఆగిపోయాయి. ఈలోగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ మరణించటం, అనంతరం ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రాష్ట్ర మంత్రికావడంతో ఆయన ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి ఉత్తరకాలువను ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయరుకు తరలించేందుకు అనుమతులు మంజూరు చేయించారు. దీనికోసం కొండాపురం మండలం ఉప్పలూరు వద్ద ఉప్పుటేరుకు అడ్డంగా పికప్ వ్యూయర్ నిర్మాణానికి 25కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయించారు. అయినా కాలువ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. 2014లో జరిగిన ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బొల్లినేని వెంకటరామారావు తనను గెలిపిస్తే సోమశిల నీటిని కొండాపురానికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు కలిగిరి మండలం జిర్రావారిపాలెం వద్ద ఉత్తర కాలువకు ఉన్న అడ్డంకిని తొలగించడంతో మండలంలోని కొమ్మి, సత్యవోలు చెరువులకు నీరు చేరింది. అయితే దీంతోనే కొండాపురం మండలం సస్యశ్యామలం కాదని రైతులు అంటున్నారు. ఈ కాలువకు ఉప్పలూరు వద్ద ఉన్న రాతిని బ్లాస్టింగ్ చేసి అక్కడ కాలువ నిర్మాణంతోపాటు ఒక బ్రిడ్జిని నిర్మించవలసి ఉంది. కాలువ నిర్వాసితులైన చింతలదేవి రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వాలి. అప్పుడే కాలువ నిర్మాణం పూర్తయి, మండలంలోని ఉప్పుటేరుకు, రాళ్లపాడు రిజర్వాయరుకు నీరు చేరుతుంది. అయితే దీనిపై నేతలు దృష్టిపెట్టడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలువ నిర్మాణం పూర్తయితే కొండాపురం మండలంలోని సాయిపేట, భీమవరప్పాడు, కొండాపురం, మర్రిగుంట, రేణమాల తదితర చెరువులకు నీరంది వేలాది ఎకరాలు సాగులోకి వస్తుంది. రాళ్లపాడు రిజర్వాయరుకు నీరు చేరితే ఆ రిజర్వాయర్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన సుమారు 30వేల ఎకరాలకు నీరు అంది సస్యశ్యామలం అవుతుంది. అయితే సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు, రాళ్లపాడు వరకు సోమశిల నీరు ఎప్పుడు వస్తుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేక ఈ ప్రాంతం తీవ్రకరువును ఎదుర్కొంటోంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ఈ సమస్యలపై దృష్టిపెట్టి వీలైనంత త్వరగా సోమశిల నీటిని రాళ్లపాడు రిజర్వాయరుకు తరలించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18912
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author