ఎన్నికల కోసం కేసీఆర్ మెగా ప్లాన్ 

ఎన్నికల కోసం కేసీఆర్ మెగా ప్లాన్ 
March 02 13:07 2018
హైద్రాబాద్,
పని మంచిగా కనిపించాలి. పక్కాగా ఫలితమివ్వాలి. ప్రచారం భారీగా లభించాలి. ప్రధానికి సైతం వెన్నులో వణుకు పుట్టించాలి. పార్టీ పునాదులు పటిష్ఠం కావాలి. కేసీఆర్ అమలు చేస్తున్న ఈ వ్యూహం మరో పదేళ్లపాటు టీఆర్ఎస్ కు ఢోకాలేదన్న భావన రేకెత్తించేలా కనిపిస్తోంది.గ్రామప్రాంతాలపై పట్టు బిగించేందుకు అదే సమయంలో తెలంగాణ రాష్ట్రసమితిని బలపరుచుకునేందుకు వ్యూహాత్మకంగా పథక రచన చేశారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఇందుకు పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నామనుకుంటున్న కాంగ్రెసు గుండెల్లో రైళ్లు పరిగెత్తించడమే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా డిమాండ్లకు నాంది పలికే ప్లాన్ ను ఏప్రిల్,మేనెల నుంచి ఆచరించబోతున్నారు కేసీఆర్. ఈ సారి బడ్జెట్ లో దానికే పెద్ద పీట. దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల మొత్తంతో వ్యవసాయ పెట్టుబడి సాయం అమల్లోకి రాబోతోంది. వ్యవసాయ కూలీలు, కౌలుదారులు, ఇతర వృత్తుల వారిని మినహాయిస్తే గ్రామప్రాంతాల్లోని భూమి పట్టాదారులందర్నీ కవర్ చేసేలా రూపుదిద్దుకున్న ఈ పథకం కచ్చితంగా ఓట్ల వర్షం కురిపిస్తుందనే అంచనా లో ఉంది టీఆర్ఎస్ అధినాయకత్వం. తాము ఎంతగా నెగటివ్ ప్రచారం చేసినా చేతిలో క్యాష్ పడుతుంటే టీఆర్ఎస్ ను కాదనే వారెవరుంటారనే అనుమానంలో కొట్టుమిట్టాడుతోంది కాంగ్రెసు.జనాభాలో ఎక్కువగా ఉన్న రైతాంగాన్ని ఆకట్టుకొని అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నించని ప్రభుత్వమంటూ ఉండదు. కానీ ఆప్రయత్నంలో చిత్తశుద్ధి లేకపోవడంతో రైతాంగంలో దుస్థితి కొనసాగుతూ ఉంటుంది. పంటకు గిట్టుబాటు ధర దొరకదు. బ్యాంకుల్లో అప్పు పుట్టదు. కౌలు రైతు కడగండ్లు తీరవు. గతంలో తెలుగుదేశం , కాంగ్రెసు ప్రభుత్వాలు రైతులకు మేలు చేస్తున్నామన్న ముద్ర వేయించుకోవడం ద్వారా వారిని సంతృప్తి పరిచి గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించిన దాఖలాలున్నాయి. రైతుమిత్ర పేరిట తెలుగుదేశం చేసిన ప్రయోగం ఇటువంటిదే. ఆదర్శరైతు పేరిట వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలోనూ మరోసారి రైతులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అవన్నీ పూర్తిగా ఫలించలేదు. రైతులకు ఉపశమనం దొరకలేదు. రైతుమిత్ర, ఆదర్శ రైతులు అధికార పక్ష అనుంగు సహచరులుగా మారడంతో మెజార్టీ రైతులు వీటిపట్ల వైముఖ్యం ప్రదర్శించారు. అనుకొన్నదొకటి, అయినది ఒకటి అన్నట్లుగా ప్రభుత్వానికి నెగటివ్ ఫలితాలే ప్రాప్తించాయి. ఈ దఫా కేసీఆర్ గత ప్రభుత్వాల లోపాలను గుర్తించి పకడ్బందీ వ్యవస్థ దిశలోనే చర్యలు తీసుకుంటున్నారు. 1.25 లక్షల రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో 9 వేల వరకూ మాత్రమే పంచాయతీలు ఉన్నాయి. మరో మూడు వేల పంచాయతీలు పెంచే ప్రయత్నాలు సాగుతున్నాయి. మొత్తమ్మీద ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో సగటున పదివరకూ సమన్వయసమితులుంటాయి. దాదాపు రైతులందరూ ఇందులో సభ్యులుగా ఉండేలా చూస్తున్నారు. ఈ సమితుల నాయకత్వం టీఆర్ఎస్ శ్రేణుల చేతిలో ఉంటుంది. దీంతో మిగిలిన రైతులను ఇన్ఫ్లూయన్స్ చేస్తూ ప్రభుత్వ లబ్ధి వారికి చేరేలా చూడటమే ఈ సమితుల ప్రధాన బాధ్యత.గ్రామాలంటే రైతులే. వ్యవసాయాధార జీవన విధానం కారణంగా అన్ని వృత్తుల వారు రైతాంగంపైనే ఆధారపడి ఉంటారు. పంట బాగుంటే ఆ గ్రామం కళకళలాడుతూ ఉంటుంది. కొత్త బట్టల కొనుగోళ్లు మొదలు ఇతర వ్యాపారాల వరకూ పంట దిగుబడులపైనే పరోక్షంగా ఆధారపడతాయంటే అతిశయోక్తి కాదు. అందుకే రైతులను ఆకట్టుకోగలిగితే సహజంగానే గ్రామ పెత్తనం సాధ్యమవుతుంది. చాలావరకూ మోతుబరి రైతులే గ్రామ సర్పంచులుగా కూడా పనిచేస్తుంటారు. రాజకీయ పార్టీల ప్రభావం పెరిగిన తర్వాత రైతుల ప్రాధాన్యం తగ్గింది. కులమతవర్గ చీలికలు పెరిగాయి. రైతులకు వ్యతిరేకంగా జట్టు కట్టే గ్రూపులు కూడా పెత్తనం చెలాయించడం మొదలు పెట్టాయి. ఇప్పుడు ప్రభుత్వం దీనిని రివర్స్ చేయాలని చూస్తోంది. రైతు సమన్వయ సమితుల ద్వారా ఒక సమష్టి భావన నెలకొంటుంది. వీరంతా నిరంతరం కలుస్తూ, చర్చించుకుంటూ ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందాల్సి ఉంటుంది. అందువల్ల ఎవరిని సర్పంచ్ గా చేస్తే బాగుంటుంది. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలేమిటి? అన్న విషయాలు ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతవరకూ గ్రామాల్లో పాతుకుపోయి ఉన్న కాంగ్రెసు, టీడీపీ సీనియర్ నాయకులే గ్రామ పెత్తనం చెలాయిస్తున్నారు. ఇప్పుడు రైతు సమన్వయ సమితుల కారణంగా వారైనా పార్టీ మారాలి. లేకపోతే పెత్తనమన్నా వారి చేతుల నుంచి టీఆర్ఎస్ నాయకత్వం పరిధిలోకి చేరాలి. ఇదే కాన్సెప్టు తో కేసీఆర్ సమన్వయ సమితులను పెడుతున్నారనేది రాజకీయ వర్గాల భావనరాష్ట్ర ఆర్థిక వనరులను వ్యవసాయరంగానికి సాయంగా మలచడంలో రాజకీయ సమీకరణలు కూడా ముడి పడి ఉన్నాయి. సుమారు అరకోటి మంది రైతులు వ్యవసాయ పెట్టుబడి సాయం పథకం కింద లబ్ధి పొందుతారని అంచనా. ఇది నేరుగా బేరర్ చెక్కుల ద్వారా వారికి చేరేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అంటే ఒకరకంగా చెప్పాలంటే ఎటువంటి దళారుల పాత్ర లేకుండా రైతులకే ముట్టచెప్పనున్నారు. ఆ తర్వాత కాలంలో ప్రీలోడెడ్ కార్డుల్లో ఈ సొమ్మును జమ చేసి ఎరువులు, క్రిమిసంహారకమందులు కొనుగోళ్లు చేసుకునేలా సదుపాయాన్ని విస్తరించాలనేది ప్రభుత్వ యోచన. రైతు రుణమాఫీ పూర్తికావడంతో దాదాపు అంతే సొమ్మును ఈ స్కీమ్ కు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయిదేళ్ల కాలానికి 60 వేల కోట్ల రూపాయల భారం బడ్జెట్ పై పడుతుంది. ఇది ప్రత్యక్షంగా అందించే సాయం కావడం వల్ల ప్రభుత్వం పట్ల సానుకూలతకు దారి తీస్తుంది. అంతేకాకుండా దేశంలో ఇటువంటి పథకాన్ని ఏ రాష్ట్రప్రభుత్వమూ అమలు చేయడం లేదు. మిగిలిన రాష్ట్రాలకు కూడా మార్గదర్శకం అవుతుంది. ఇది కూడా పొలిటికల్ అడ్వాంటేజ్ గా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలించే అవకాశం ఉంటుంది. మొత్తమ్మీద ఈ ఆర్థిక సాయం రాజకీయ రాబడిగా లాభించే విధంగా కేసీఆర్ పక్కాగా పటిష్ఠంగా ఈ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. రానున్న కాలంలో టీఆర్ఎస్ రాజకీయం మొత్తం పెట్టుబడి సాయం చుట్టూ తిరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18933
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author