చెరువులా? మురికి కూపాలా?

చెరువులా? మురికి కూపాలా?
March 03 18:23 2018
నిర్మల్,
రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణకు కేసీఆర్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ప్రాజెక్టులు నిర్మాణంతో పాటూ రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ, కొత్త చెరువుల  తవ్వకానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోంది. ప్రభుత్వం చెరువుల విషయమై ఇంత శ్రద్ధ చూపుతుంటే పలు ప్రాంతాల్లో అంతకుమించిన నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో పలు చెరువులు రూపుకోల్పోతున్నాయి. చెత్తాచెదారానికి ఆలవాలమవుతున్నాయి. మొత్తంగా మురికి కూపాలుగా మారుతున్నాయి. రాజుల పాలనలో నిర్మల్ కేంద్రంలో దాదాపు 11 గొలుసుకట్టు చెరువలను నిర్మించారు. వీటి ద్వారా సాగు-తాగు నీటికి కొదువ ఉండేదికాదు. కానీ కాలక్రమంలో ఇవి ధ్వంసమైన పరిస్థితి. కొన్ని చెరువులు మురికి కూపాలుగా మారితే మరికొన్ని ఆక్రమణలు ఆక్రమణలకు గురయ్యాయి. మొత్తంగా పట్టణంలోని చెరువులు అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితికి దరిదాపుల్లో ఉన్నాయి. వార్డుల నుంచి వచ్చే మురుగునీరంతా చెరువుల్లోకే చేరుతోంది. ప్రధానంగా ధర్మసాగర్‌, కురాన్నపేట్‌, కంచరోని, బంగల్‌పేట్‌, నటరాజ్‌మిల్‌ ముందున్న చెరువుల్లోని నీరు కలుషితమవుతోంది. అలాగే చెత్తా, చెదారంతో పాటు వ్యర్థపదార్థాలను అందులోనే పారేస్తున్నారు.
చెరువులు డంపింగ్ యార్డులుగా మారిపోవడంతో అక్కడి నుంచి వచ్చే దుర్వాసనతో సమీపంలోని కాలనీల వాసులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాదులు వృద్ధి చెందుతుండడంతో రోగాలు సైతం ప్రబలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక రహదారుల పక్కగా ఉన్న చెరువులు దుర్గంధం వెదజల్లుతుండడంతో రాకపోకలు సాగించే వారికి ఆ కాస్త సమయం నరకాన్నే తలపిస్తోంది. మరోవైపు చెరువులపై ఆధారపడ్డవారి జీవితాలూ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. నీరు కలుషితమవడంతో చేపలు చనిపోయే ప్రమాదం ఏర్పడిందని తమ జీవనోపాధి దెబ్బతింటోందని జాలర్లు వాపోతున్నారు. దీనికితోడు చేపలు పట్టే సమయంలో అందులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించేందుకు నానా కష్టాలు పడుతున్నామని చెప్తున్నారు. భూగర్భ జలాల పెంపుకు దోహదపడే చెరువుల విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడంపై అంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెరువుల పునరుద్ధరణకు కృషి చేయాలని, మురుగునీరు చెరువుల్లో చేరకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19037
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author