విస్తరణతోనే.. మెరుగైన వైద్యం..

విస్తరణతోనే.. మెరుగైన వైద్యం..
March 03 18:31 2018
నల్గొండ,
నల్గొండ జిల్లా నకిరేకల్ లోని ప్రభుత్వ వైద్యశాలకు రోగుల తాకిడి అధికంగా ఉంటోంది. వైద్యం కోసం వస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ఈ హాస్పిటల్ ను విస్తరించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి నిత్యం 250 నుంచి 300 మంది వస్తుంటారు. వీరికి మందుకు అందించే పంపిణీ కేంద్రం ఒక్కడే ఉంది. ఇక వైద్య సిబ్బంది కొరతా తీవ్రంగా ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు దక్కేలా చర్యలు తీసుకోవాలని చాలాకాలంగా స్థానికులు వైద్యాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆసుపత్రిని విస్తరిస్తే పలు సమస్యలకు చెక్ పడే అవకాశం ఉందని అంటున్నారు. వైద్యశాలలో సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా గదుల కొరత తీవ్రంగా ఉంది. నలుగురు వైద్యులు ఒకే గదిలో కూర్చొని రోగులకు వైద్యపరీక్షలు చేయాల్సిన దుస్థితి. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రగాయాలైన బాధితులకు ఇక్కడ ప్రథమ చికిత్సలే అందుతుండడం మరో సమస్య.
దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ ఉన్న ప్రమాదాల్లో దేశంలో ఐదో స్థానంలో ఉన్న 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న నకిరేకల్‌ వైద్యశాలలో ట్రామా కేర్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉన్నా స్పందన మాత్రం లేదు. ట్రామా కేంద్రంతో రోడ్డుప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందుతుంది. ఫలితంగా 30 శాతం మందిని ప్రాణాపాయం నుంచి కాపాడే వీలుంటుందని అంతా అంటున్నారు. వాస్తవానికి ఈ ఆసుపత్రిలో 30 పడకల సామర్ధ్యం మాత్రమే ఉంది. ఏడేళ్ల కిత్రం దీనిని 50 పడకల స్థాయికి పెంచుతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ఆ ప్రకటన అమలుకాలేదు. తర్వాత వంద పడకలకు విస్తరిస్తామని నేతలు హామీఇచ్చారు. కానీ ఆ తరహా చర్యలే లేవు. ఇటీవలే వైద్యశాలలోని వార్డులను, ప్రసూతి గదిని కొంత ఆధునికీకరించారు. ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రారంభించారు. దీంతో రోగులకు కొంత ఊరటగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, వైద్య విభాగం స్పందించి నకిరేకల్ ప్రభుత్వాసుపత్రిని విస్తరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అంతా కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19045
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author