గొర్రెలు మాయం 

గొర్రెలు మాయం 
March 06 22:22 2018
నిజామబాద్,
ప్రభుత్వం రాయితీపై ఇచ్చిన జీవాలు గల్లంతయ్యాయి.. లబ్ధిదారులు విక్రయించుకొంటున్నారే  ఆరోపణల నేపథ్యంలో జిల్లా పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు విచారణకు ఆదేశించారు… పదుల సంఖ్యలో మాత్రమే జీవాలు విక్రయానికి గురికాగా పాతిక వేలకు పైగా ఇతర ప్రాంతాలకు మేత కోసం వెళ్లాయని  పశు సంవర్ధకశాఖాధికారులు నివేదించారు. జిల్లాలోని 326 గ్రామాల్లో గొల్ల, కురమల ఉపాధి కోసం ప్రభుత్వం 75 శాతం రాయితీ కింద 19,453 మందికి గొర్రెల యూనిట్లను మంజూరు చేశారు. ఇందులో మొదటివిడత కింద 9,631 యూనిట్లకు 8 వేల యూనిట్ల వరకు అందించింది. ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుంది. ఇందులో ఇప్పటివరకు 4 వేల వరకు గొర్రెలు చనిపోయాయి.
పాతిక వేల గొర్రెలు మేత కోసం మహారాష్ట్ర, నిర్మల్‌ ప్రాంతాలకు వలసపోయాయి. ఒక్క మోపాల్‌, వర్ని మండలాల నుంచే సుమారు 10 వేల జీవాలు ఇతర ప్రాంతాలకు పయనమైనట్లు అధికారులు గుర్తించారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు మంగళవారం ఊరూరా సర్వే చేసినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది. అడవుల్లోనే మేతకు వెళ్లాయని, కొందరు చనిపోయాయని, ఇంకొందరు ఇతర ప్రాంతాలకు పంపించామని చెప్పినట్లు తెలిసింది. దాదాపు సగం వరకు రాయితీ జీవాల అచూకీ రెవెన్యూ సిబ్బందికి అందలేదని సమాచారం.
అనంతపురం జిల్లా నుంచి తీసుకొచ్చిన అనేక జీవాలు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా రవాణాలో ఇబ్బందిపడి కొన్ని, వచ్చిన తర్వాత రోగాలబారినపడి ఇంకొన్ని, మేత అందక మరికొన్ని, పోషణ తెలియక.. ఇలా వేలాది జీవాలు మృత్యువాతపడ్డాయి. సుమారు 4 వేల జీవాలు చనిపోయినట్లు భావిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 3 వేల వరకు మృత్యువాతపడినట్లు గుర్తించారు. ఇందులో ఇప్పటి వరకు 1400 గొర్రెలకు బీమా మంజూరైంది. అయితే మంజూరైనా ఇప్పటికీ డబ్బులు రాలేదని బాధితులు వాపోతున్నారు. మూడునెలల క్రితం తనవి, తన సోదరుడికి ఇచ్చిన 42 జీవాల్లో 14 చనిపోయాయని, ఇప్పటికీ పరిహారం రాలేదని మాక్లూర్‌ మండలం ఒడ్యాట్‌పల్లి గ్రామానికి చెందిన నవీన్‌ అనే రైతు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. బీమా పరిహారం ఇవ్వడం లేదని, రాదని అనుకుని అనేక మంది జీవాలు మృతి చెందిన సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం లేదని తెలిసింది.
లక్షలాది జీవాలను జిల్లాకు తెస్తున్న యంత్రాంగం వాటికి అవసరమైన మేతను సమకూర్చడంలో విఫలమైంది. ఫలితంగా గొర్రె కాపరులు వాటిని సాకలేక అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా జిల్లాలో నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ జలాశయాల ఆయకట్టు కింద మొత్తం వరిపొలాలు సాగవుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటి పంటలు లేక భూములు బీళ్లుగా మారాయి. శిఖం భూముల్లో కూడా మేత తగినంత లేదు. ప్రభుత్వం ద్వారా రాయితీ విత్తనాలు కూడా అంతంతమాత్రంగానే రైతులకు అందాయి. ఉద్యాన, అటవీశాఖ ద్వారా కూడా గ్రాసం పెంచుతున్నా పెద్దగా జీవాలకు ఉపయోగంలోకి రావడంలేదు. గ్రాసం దొరకడం లేదని గత నెలరోజుల ముందు నుంచే జీవాలు వలసబాట పట్టాయి. అనేక మంది అదిలాబాద్‌, నిర్మల్‌, మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ ప్రాంతాల్లోని తమ బంధువుల ఇళ్లకు జీవాలను పంపించేశారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19215
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author