కియా భూములకు పట్టాల్లేవా..?  

కియా భూములకు పట్టాల్లేవా..?  
March 09 10:49 2018
అనంతపురం,
దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల పరిశ్రమ రాకతో పెనుకొండ ప్రాంతంలో భూములకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. కియాతోపాటు వాటికి అనుబంధంగా వచ్చే పరిశ్రమలకు భూములు సిద్ధం చేస్తున్నారు. అయితే ఆ భూములకు సంబంధించి డీకేటీ పట్టాలున్నాయని కొందరు ముందుకొస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలోని రికార్డులు పరిశీలిస్తే.. ఆ వివరాలేవీ కనిపించడం లేదు. దీంతో ఆ పట్టాల్లో నిజమెంత? అనేది సందేహంగా మారుతోంది.
పనుకొండ మండల పరిధిలోని హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి-44కు ఆనుకుని ఎర్రమంచి వద్ద కియా కార్ల పరిశ్రమ సిద్ధమవుతోంది. ఇక్కడ ఏపీఐఐసీ 600 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో 535 ఎకరాలు కియా పరిశ్రమ ప్రధాన ప్లాంట్‌కు కేటాయించగా, మిగిలిన భూములు ఆ ప్లాంట్‌ చుట్టూ రహదారి, మళ్లింపు కాలువ, ఇతర రహదారులకు వినియోగిస్తున్నారు. ఈ భూములే కాకుండా ఎదురుగా కియా టౌన్‌షిప్‌ కోసం 36 ఎకరాలు, శిక్షణ కేంద్రం కోసం 11.2 ఎకరాలు కేటాయించారు. అలాగే జాతీయ రహదారికి, రైల్వేలైన్‌కు మధ్య ట్రక్‌ టెర్మినల్‌కు 30 ఎకరాలు, రైల్వే స్లైడింగ్‌కు 50 ఎకరాలు సిద్ధం చేశారు. అయితే ట్రక్‌ టెర్మినల్‌, రైల్వే స్లైడింగ్‌కు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇంకొంత అదనంగా భూమి కావాలని కియా యాజమాన్యం కోరుతోంది. ట్రక్‌ టెర్మినల్‌కు ప్రస్తుతం కేటాయించిన 30 ఎకరాలతోపాటు, మరో 18.47 ఎకరాలు, అలాగే రైల్వేస్లైడింగ్‌కు 50 ఎకరాలతోపాటు, మరో 50 ఎకరాలు కావాలని కోరుతున్నారు.
ఈ మేరకు ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే కియాకు అనుబంధంగా దక్షిణ కొరియాకు చెందిన 18 పరిశ్రమలు రానున్నాయి. వీటికోసం 500 ఎకరాలను సిద్ధం చేశారు. ఇప్పటికే ఓ అనుబంధ పరిశ్రమకు 66.45 ఎకరాలు, మరో పరిశ్రమకు 71.79 ఎకరాలు కేటాయించారు. మరికొన్ని పరిశ్రమలు రానుండటంతో మరో 2 వేల ఎకరాలను గుర్తించారు. ఇవన్నీ కియాకు ఇరువైపులా, దుద్దేబండ క్రాస్‌ నుంచి గొల్లపల్లి జలాశయానికి వెళ్లే మార్గంలో ఉన్నాయి. ఆయా భూముల క్రయవిక్రయాలు జరగకుండా సర్వే నంబర్ల వారీగా వివరాలను పెనుకొండ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి అందజేశారు. వీటిలో ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.
పరిశ్రమల కోసం సేకరించనున్న భూముల్లో ప్రభుత్వ, డీకేటీ, పట్టా భూమి ఉంది. పట్టా భూములతోపాటు, డీకేటీలకు కూడా ఎకరాకు రూ.10.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నారు. ఇప్పటికే కియాకు సేకరించిన 600 ఎకరాల్లో డీకేటీ, పట్టాదారులకు చాలా వరకు పరిహారం ఇచ్చారు. దాదాపు 40 ఎకరాలకు సంబంధించి పరిహారం చెల్లింపులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్నదమ్ముల సమస్యలు, భూ యజమానుల కుటుంబంలో ఎవరెవరి పేరిట పరిహారం ఇవ్వాలనే ఇబ్బందుల కారణంగా పరిహారం ఆగిపోయింది. మరో 41 ఎకరాలపై వివాదం ఉంది. వీరికి వంక పోరంబోకులో డీకేటీ పట్టాలిచ్చినట్లు చూపుతున్నారు. సాధారణంగా చెరువులు, వంక పోరంబోకు స్థలాల్లో పట్టాలివ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా అవి చెల్లవు. అలాంటి వారికి పరిహారం ఎలా ఇవ్వాలనేది ప్రశ్నార్థకంగా మారింది. వారంతా ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. దాదాపు 140 ఎకరాలకు సంబంధించి పట్టాల వివరాలు పూర్తిగా లేవు. స్థానికులు తమ వద్ద పట్టాలున్నాయని చెబుతున్నప్పటికీ తహసీల్దార్‌ కార్యాలయంలో ఆ వివరాలు లేవు. ఎవరికైనా డీకేటీగా సాగుభూమి ఇస్తే.. దరఖాస్తు డీకేటీ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. ఈ మేరకు దస్త్రం కూడా ఉంటుంది. ఆ 140 ఎకరాలకు చెందిన డీకేటీ పట్టాల వివరాలు, దస్త్రాలు లేవు. వీటిలో అసలు పట్టాలు ఎన్ని, పుట్టించినవి ఏమైనా ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19410
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author