డీప్ ఫ్రిజ్ లో సిట్ రిపోర్ట్

డీప్ ఫ్రిజ్ లో సిట్ రిపోర్ట్
March 10 14:13 2018

వైజాగ్,
వేలాది కోట్ల రూపాయల విలువైన విశాఖ భూకుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ఇక రహస్యమేనా? దీన్ని బహిర్గతం చేయరా? సిట్ నివేదిక కోల్డ్ స్టోరేజీకి చేరిందా? అంటే అవుననే సందేహాలు వ్యక్తవువుతున్నాయి. విశాఖలో వందల ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జాపై విచారణ జరిపిన వినీత్ బ్రిజాల్ నేతృత్వంలోని బృందం నెల రోజుల క్రితం నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్‌కు నివేదికను సమర్పించింది. 20 రోజుల తరువాత ఆయన ఈ నివేదికను సీఎస్‌కు పంపారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే నివేదికను బహిర్గతం చేయాలని వివిధ పార్టీలు డిమాండ్ చేశాయి. సమావేశాల్లో ఈ నివేదిక ఆధారంగా చర్చకు పలువురు సిద్ధమయ్యారు. అయితే, ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. నివేదిక గురించి ప్రస్తావన తీసుకురావడంలేదు. ఈ లోగా మరో రూ.300 కోట్ల ప్రభుత్వ భూములను విశాఖ ఆర్డీవో వెంకటేశ్వర్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పరం చేసేశారు. సిట్ విచారణ కొనసాగినంతకాలం ఈ భూముల వ్యవహారాల్లో తలదూర్చకుండా, ఆర్డీవో కోర్టులో తీర్పులివ్వకుండా కాలక్షేపం చేసిన ఆయన.. సిట్ నివేదిక కోల్ట్ స్టోరేజీకి చేరిందని తెలియగానే విజృంభించారు. 40 ఎకరాలకుపైగా ప్రభుత్వ, ఇనాం భూములను ప్రైవేటు పరం చేస్తూ తన పరిధికి మించి ఆదేశాలు జారీచేశారు. దీంతో, సిట్ విచారణ, నివేదిక పెద్ద బోగస్ అంటూ గతంలో ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు నిజమేనన్న అభిప్రాయాలను నగర వాసులు వ్యక్తం చేస్తున్నారు. సిట్ విచారణ పూర్తి కావడం, నివేదిక బయటకు పొక్కకపోవడం, కనీసం ఆ నివేదిక ఆధారంగా చర్యలేమీ లేకపోవడం ఇప్పుడు కబ్జాదారులు, అక్రమార్కులకు వరంగా మారింది. ఆరు నెలల పాటు వేల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన సిట్.. డిసెంబరు చివరివారంలో నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేసేందుకు పలు పర్యాయాలు ప్రయత్నించినా ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదు. చివరకు సిట్‌కు మార్గదర్శిగా వ్యవహరించిన విశాఖ నగర పోలీసు కమిషనర్ యోగానంద్‌కు అందజేశారు. ఈ నివేదికను బహిరంగ పరుస్తారా లేదా అన్నది మొదటినుంచి పెద్ద ప్రశ్నగా మారింది. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు భూకబ్జాల్లో ఉండటమే ఇందుకు కారణమని వివుర్శలు వస్తున్నాయి. నిరుడు జూన్ 28న రంగంలోకి దిగిన సిట్ బృందాలు రెండు పర్యాయాలు గడువును పెంచిన తరువాత ఆరు నెలల పాటు పనిచేశాయి. విశాఖలో ముదపాక, కొమ్మాది, పరదేశీపాలెం భూములతో పాటు మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన భూములపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఫిర్యాదులు వేల సంఖ్యలో రావడంతో గడువు పెంచింది. వినీత్ బ్రిజాల్ నేతృత్వంలోని సిట్ ప్రాథమిక నివేదికల ఆధారంగా.. రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. విశాఖ రూరల్ మండలంలోనే 600 ఎకరాల భూమి రికార్డులు ట్యాంపరింగ్‌కు గురైనట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపారు. ట్యాంపరింగ్ భూముల్లో ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు ఉన్నట్లు సమాచారం. మొత్తం 2873 ఫిర్యాదులు రాగా వాటిలోని 337 కేసులపై సిట్ దర్యాప్తు జరిపింది. ఈ భూముల కుంభకోణంలో పెద్ద తలకాయలు ఉండడంతో ప్రతికేసును నివేదికలో విడివిడిగా పొందుపర్చినట్లు తెలిసింది. అక్రమాలపై విచారణ, చర్యలపై సమగ్రంగా నివేదిక పొందుపరిచినట్లు తెలిసింది.ఈ నివేదికపై తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వమే తీసుకోవాల్సివుంది. గతంలో వచ్చిన ఫిర్యాదులపై బహిరంగ విచారణ జరుపుతామని ఉప ముఖ్యమంత్రి కూడా అయిన రెవిన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. అయితే, రాజకీయ ఒత్తిడితో అది రద్దయ్యింది. దాని స్థానంలో వచ్చిన సిట్ విచారణ పక్కాగానే చేసినా ప్రభుత్వం దీని ఆధారంగా చర్యలు తీసుకుంటుందా లేక మిగిలిన నివేదికల మాదిరిగానే అటకెక్కిస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. నివేదిక బహిర్గతం కాకపోవడంతో విశాఖ నగరంలో కబ్జాదారులు మళ్లీ విజృంభిస్తున్నారు. భూకుంభకోణం కేసుల్లో విశాఖ ఆర్డీవోను ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి వచ్చింది. రావికమతం తహశీల్డార్ సిద్ధయ్యకు గురువారం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మరికొంత మందిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19554
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author