క్రీడా సౌకర్యాలా… అవెక్కడా….

క్రీడా  సౌకర్యాలా… అవెక్కడా….
March 12 11:23 2018

గుంటూరు,
ఆటలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి ఎన్టీఆర్‌ క్రీడా వికాస కేంద్రం పేరుతో స్టేడియాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అయితే ప్రజాప్రతినిధులు శ్రద్ధపెట్టిన చోట స్టేడియం నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండగా, చాలాచోట్ల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పనులు మొదలు కాలేదు. జిల్లాలో 17 నియోజకవర్గాలకు గాను 10 చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.జిల్లాలో మెరికలైన క్రీడాకారులు ఎందరో ఉన్నా, తగిన సౌకర్యాల్లేక పోటీల్లో రాణించలేకపోతున్నారు. సాధనకు అవసరమైన మైదానం కూడా అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో ఎన్టీఆర్‌ క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. అందుబాటులో ఉన్న ఐదెకరాల భూమి లేకుంటే ఆపైన ఎంత ఉన్నా సదరు భూమిని శాప్‌కు అప్పగించాలి. ఒక్కొక్క కేంద్రం నిర్మాణానికి రూ.2.10 కోట్లు మంజూరు చేశారు. 40 మీటర్ల ట్రాక్‌తో పాటు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌ తదితర ఆరు రకాల ఆటలకు కోర్టులు నిర్మిస్తారు. వీటితో పాటు ఇండోర్‌ స్టేడియంలో రెండు షటిల్‌ కోర్టులు, గ్యాలరీతో పాటు యోగా ఇతరత్రా వాటికి ప్రత్యేక వసతులు కల్పిస్తారు. పాఠశాల మైదానం లేక ఇతరత్రా ఖాళీ స్థలం ఇస్తామని సమ్మతి పత్రం అందజేసిన తర్వాత శాప్‌ అధికారులు స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌ ఆదేశం మేరకు ఆయా ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగాలు వాటి నిర్మాణ పనులు చేపడతాయి. గుంటూరు-1, నరసరావుపేట,తెనాలి పొన్నూరు నియోజకవర్గాల్లో గతంలోనే స్టేడియాలు నిర్మించారు. మాచర్లలో రూ.2 కోట్లతో నిర్మాణం పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంచేశారు. శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల చొరవతో సత్తెనపల్లిలో సుమారు రూ.6.50 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్నారు. మంగళగిరిలో క్రికెట్‌ స్టేడియం ఉన్నప్పటికీ క్రీడా వికాస కేంద్రం మంజూరు చేశారు. చాలాచోట్ల క్రీడలకు వసతులు లేకపోవడంతో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నా, ఆశించిన స్థాయిలో నిర్మాణాలు సాగడం లేదు. క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికి కనీసం ఐదెకరాల స్థలం అవసరం కానుండటంతో చాలాచోట్ల ప్రభుత్వ భూముల కొరత వెంటాడుతోంది. గుంటూరు-2 నియోజకవర్గంలో ఎస్‌వీఎన్‌ కాలనీలో ఎంపిక చేసిన స్థలం ఇంకా అప్పగించలేదు. బాపట్లలో పాఠశాల ప్రాంగణంలో నిర్మించాలని ప్రతిపాదించగా, చిలకలూరిపేటలో ఇటీవల ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఖరారు చేశారు. పిడుగురాళ్లలో చెరువు స్థలం ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ అధికార అనుమతులు రాలేదు. వినుకొండలో తొలుత పదెకరాలు స్థలం కేటాయించి ఆతర్వాత ఎన్నెస్పీ కాలనీలో నిర్మించాలని ప్రతిపాదన మార్పు చేశారు. దీంతో ఈ రెండు చోట్ల నిర్మాణం జరగలేదు. ప్రత్తిపాడు, పెదకూరపాడు, వేమూరు, తాడికొండ, రేపల్లె నియోజకవర్గాల్లో స్థలాలు సమకూరలేదు. స్థానిక ప్రజాప్రతినిదులు శ్రద్ధపెడితే తప్ప అక్కడ క్రీడా వికాస కేంద్రాలు కార్యరూపం దాల్చే పరిస్థితి కానరావడం లేదు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19706
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author