కొనుగోలుకు కళ్లెం

కొనుగోలుకు కళ్లెం
March 13 20:18 2018

తిరువూరు,
ఆరుగాలం శ్రమించి పండించిన కందులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించటానికి నిబంధనలే అడ్డంకిగా మారాయి. జిల్లాలో గరిష్ఠంగా 5వేల క్వింటాళ్ల కందులే కొనుగోలు చేయాలని, ఇ-పంటలో నమోదైన దిగుబడినే సేకరించాలన్న నిబంధనలు రైతుల పాలిట గుదిబండగా తయారయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి మరీ కంది సాగు చేస్తుంటే నిబంధనల సంకెళ్లు విధించి అత్తెసరుగా కొనుగోళ్లతో సరిపెడుతున్నారని రైతులు వాపోతున్నారు. దళారుల వ్యవస్థ నుంచి రైతులను ఒడ్డున పడేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇలాంటి నిబంధనలు విధించటం వల్ల నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు సడలించి పూర్తిస్థాయిలో కందులను సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
జిల్లావ్యాప్తంగా కందులను సేకరించటానికి వీలుగా ఐదు కొనుగోలు కేంద్రాలను గత నెలలో విడతల వారీగా ప్రారంభించారు. ఒక్కో కేంద్రంలో వెయ్యి క్వింటాళ్ల చొప్పున మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హెక్టారుకు ఏడు క్వింటాళ్ల చొప్పున ఒక్కో రైతు నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు ఇ-పంటలో నమోదైన పంటను మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సేకరించాలనే నిబంధనలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో భాగంగా 2,277 హెక్టార్లలో కంది సాగు చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది వెయ్యి హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెరిగింది. కొందరు కేవలం కంది మాత్రమే వేయగా, మరికొందరు పత్తి, మినుము, పెసరలో అంతర పంటగా సాగు చేశారు. అయితే అంతర పంటగా సాగు చేసిన కందిని ఇ-పంటలో అధికారులు నమోదు చేయలేదు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం జిల్లాలో కేవలం 500 మెట్రిక్‌ టన్నుల సేకరణకు అనుమతిస్తూ.. ఎ.కొండూరు, గంపలగూడెం, జగ్గయ్యపేట, కంకిపాడు, పెద్దాపురంలో కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించింది.
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 200 మెట్రిక్‌ టన్నుల కందులను కొనుగోలు చేయగా.. వీటిని గోదాముల్లో భద్రపర్చటానికి దిగుమతి చేయాల్సి ఉంది. మరో 300 మెట్రిక్‌ టన్నులను సేకరించాలి. వాస్తవానికి కంది మాత్రమే సాగు చేస్తే హెక్టారుకు 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అంతర పంటగా సాగు చేస్తే 3 నుంచి 4 క్వింటాళ్ల మేరకు దిగుబడి లభిస్తుంది. కంది పంట మాత్రమే సాగు చేసిన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 1600 మెట్రిక్‌ టన్నుల దిగుబడికి అవకాశం ఉంది. అంతర పంటగా సాగు చేసిన కందిని కూడా కలిపితే 2 వేల మెట్రిక్‌ టన్నులకు చేరుకుంటుంది. మరోవైపు ఖరీఫ్‌ సీజన్‌లో వాతావరణం అనుకూలించటంతో దిగుబడులు పెరిగాయి. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం హెక్టారుకు సగటు దిగుబడి అంచనా 491 కిలోలుగా చూపించటంతో రైతులు నష్టపోవడానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిస్థాయిలో కందులను సేకరించాలని విజ్ఞప్తులు వెల్లువెత్తున్నాయి.
ప్రభుత్వం గత ఏడాది తిరువూరు నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాల నుంచి 7,500 క్వింటాళ్ల వరకు కందులు కొనుగోలు చేసింది. ఈ ఏడాది వెయ్యి క్వింటాళ్లకు మాత్రమే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ముందుగా కేంద్రానికి వెళ్లిన రైతులకు మాత్రమే న్యాయం జరుగుతుంది. లక్ష్యం అధిగమించిన అనంతరం వెళ్లిన రైతులకు మాత్రం నిరాశే ఎదురుకానుంది. లక్ష్యం మేరకే కొనుగోలు చేస్తామనే నిబంధన, ఇ-పంటలో నమోదై ఉండటం తప్పనిసరి చేయటం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకముందు బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు క్వింటాకు రూ.4,300 మాత్రమే చెల్లించారు. కేంద్రాలను ఏర్పాటు చేసిన తరువాత రూ.5,300లకు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరణ నిలిపివేసిన మరుక్షణం ధర పడిపోవటానికి అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. నిబంధనలను సడలించి ప్రభుత్వ మద్దతు ధర దక్కేలా సర్కారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19962
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author