108కు సుస్తీ

108కు సుస్తీ
March 13 20:23 2018

నల్గొండ,
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంచార వైద్య సేవల వాహనాల పరిస్థితి దుర్భరంగా మారింది. ఐదేళ్ల కిందట కేటాయించిన 104 వాహనాలు మొరాయిస్తున్నాయి. సిబ్బందికి ఐదు నెలలుగా వేతనాలందడం లేదు. ధర్నాచేస్తే ఒక నెల జీతం ఇచ్చారు. 108 వాహనాల పరిస్థితీ అలాగే ఉంది. నిర్వహణ లేక ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున కేటాయించిన 1962 సంచార పశువైద్య వాహనంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ సేవలు పొందాలంటే రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేని గ్రామాలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన 104 సేవలు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. వాహనాలు తరచూ మరమ్మతులకు గురి కావడం, పొరుగు సేవల ద్వారా నియమించుకున్న సిబ్బందికి వేతనాలు అందించకపోవడంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. నెల రోజులుగా సూర్యాపేట, తుంగతుర్తికి చెందిన రెండు 104 వాహనాలు మూలన పడ్డాయి. మిగిలిన ఆరు వాహనాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. నిర్వహణకు వైద్యాధికారి రూ.5 లక్షల కోసం ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఐదు నెలలుగా సిబ్బందికి వేతనాలందించడం లేదు. బకాయిలు చెల్లించక పోవడంతో వాహనాల్లో డీజిల్‌ నింపడానికి పెట్రోల్‌ బంక్‌ల యజమానులు నిరాకరిస్తున్నారు. రెండు నెలల క్రితం జిల్లాలో వాహనాలు నిలిచిపోయి సేవలకు అంతరాయం కలిగింది.
సూర్యాపేట జిల్లాలో 108 పరిస్థితి అధ్వానంగా తయారైంది. సగానికిపైగా మరమ్మతులకు గురై ముక్కుతూమూల్గుతూ నడుస్తున్నాయి. జిల్లాలో మొత్తం 11 వాహనాలు సేవలు అందిస్తున్నాయి. పెన్‌పహాడ్‌, మఠంపల్లి, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, మోతె మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల పెన్‌పహాడ్‌ మండలానికి చెందిన 108 రోగులను సూర్యాపేటకు తరలిస్తుండగా పాత బస్టాండు వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. సకాలంలో బ్రేకులు పడకపోవడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్‌ వివరణ ఇచ్చారు. నెల రోజుల్లో వీటి స్థానంలో కొత్తవి రానున్నాయని 108 వాహనాల జిల్లా కోఆర్డినేటర్‌ అబ్దుల్‌ రహీం తెలిపారు. యాదాద్రి జిల్లాలో భువనగిరి, ఆలేరు, బీబీనగర్‌, యాదగిరిగుట్ట, మోత్కూర్‌, చౌటుప్పల్‌, రామన్నపేట, వలిగొండలో మాత్రమే 108 సేవలు అందుతున్నాయి. యాదగిరిగుట్ట వాహనం టైర్లు పూర్తిగా పాడయ్యాయి. వలిగొండ, రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్‌ పాతవాటితో నెట్టుకొస్తుండగా రామన్నపేట, వలిగొండ పరిస్థితి అధ్వానంగా మారింది. బీబీనగర్‌, భువనగిరి, మోత్కూర్‌కు కొత్తవాటిని సమకూర్చారు. పాత వాటికి మరమ్మతులు చేయకపోవడంతో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారు. నల్గొండ జిల్లాలో మరమ్మతులకు గురైన 108 వాహనాలకు మరమ్మతులు చేసేందుకు మెకానిక్‌లు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వచ్చిన బీఎస్‌ 4 వాహనాల్లో కొత్తరకమైన టెక్నాలజీ ఉండడంతో చిన్నపాటి సమస్యలు వచ్చినా హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది.
పశుసంవర్ధక శాఖ తరఫున తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1962 సంచార వాహన సేవలు 2017 సెప్టెంబర్‌ 5 నుంచి అందుబాటులోకి వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార వాహనాన్ని జీవీకే సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చారు. కోదాడలో ఉన్న వాహనంలో వైద్యులు లేరు. నియోజకవర్గానికి ఒకే వాహనం అందుబాటులో ఉండటంతో సేవలు సకాలంలో అందడం లేదు. పశువులకు వైద్యం కోసం రైతులు వారం రోజులపాటు వేచి చూడాల్సి వస్తుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19965
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author