అన్నదాతకు ఆదా..

అన్నదాతకు ఆదా..
March 13 20:26 2018

ఆదిలాబాద్,
బీటీ పత్తి విత్తన ప్యాకెట్‌ ధర రూ.60 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ కమిటీ నిర్ణయించడం పట్ల జిల్లా రైతులకు రూ.9 కోట్ల మేరకు ఆదా అవుతుంది. ప్రస్తుతం బీటీ-2 పత్తి విత్తన (450గ్రాములు) గరిష్ఠ చిల్లర ధర రూ.800 ఉండగా రూ.740కి తగ్గించి అమ్మాలని కమిటీ నిర్ణయించింది. వచ్చే వానాకాలం నుంచి ఈ ధరలు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో ప్రధాన పంట పత్తి. గత కొన్నేళ్లుగా రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. జిల్లా సాగు విస్తీర్ణంలో 80 శాతం వర్షాధారంగా సాగు ఉండటం వల్ల, రైతులు వర్షాధార పంటగా పత్తి సాగును చేస్తున్నారు. బీటీ విత్తనాల రాకతో పురుగు మందుల భారం తగ్గినా, పెట్టుబడికి తగ్గట్టుగా దిగుబడులు రాకపోవడం, ధరలు లేకపోవడంతో రైతులు ప్రతి ఏటా నష్టపోతున్నారు. అయినా పత్తి సాగును రైతులు వీడటం లేదు. పత్తికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో సాగుకు అనువైన పంటలు, విత్తన రకాలను అధికారులు సూచిస్తున్నా.. జిల్లా రైతులకు పత్తి పంట సాగు చేయడం తప్ప వేరే పంట సాగు గురించి అంతగా తెలియదు. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం గత రెండేళ్లుగా సోయా, కంది సాగు పెంచేందుకు పలు పథకాల ద్వారా రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో సాగు తగ్గడం లేదు.
జిల్లాలో పత్తి సాగు చేసే రైతులు ఎకరానికి 1-2 రెండు ప్యాకెట్లు వినియోగిస్తారు.. జిల్లా సాగు విస్తీర్ణం మేరకు ఏటా 12-15 లక్షల పత్తి పొట్లాలు అమ్మకం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్యాకెట్‌పై రూ.60 తగ్గనుంది. ఈ లెక్కన జిల్లా రైతులకు రూ.9 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉంది. అయితే పత్తి విత్తనాల్లో వందల కంపెనీలు అనేక పేర్లతో విత్తనాలను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నాయి. ఒక్కో సారి డిమాండ్‌ లేని విత్తనాలను ఎమ్మార్పీ కంటే తక్కువే ధరకే అమ్మేస్తున్నారు. డిమాండ్‌ ఉంటే వాటిని కొరతగా చూపి ఎక్కువ ధరతో అమ్ముతున్నారు. ఇటు ధరలపై, అటు నకిలీలపై నియంత్రణ లేకపోవడంతో విత్తనాల విషయంలో ఏటా రైతులు నష్టపోతున్నారు. పత్తిని తగ్గించి ఇతర పంటలు సాగు చేసిన రైతులు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవడంతో ఈ ఏడాది తిరిగి రైతులు పత్తి సాగు వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల హెక్టార్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో పత్తి పంటనే కీలకం.. విత్తనం మొదలుకొని సాగు, మార్కెటింగ్‌, బేళ్లు తదితర వాటికి సంబంధించిన వ్యాపారం జిల్లాలో విస్తరించి పోయింది. దీంతో రైతులు పత్తిని తప్పనిసరిగా సాగు చేస్తారు. పత్తి పంటపైనే ఏటా రూ2వేల కోట్ల మేరకు లావాదేవిలు జరిగే వీలుంది. ఏటా 15లక్షల పత్తి విత్తనాల పొట్లాలు జిల్లాలో అమ్ముడుపోతాయి. 50-60 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకం అవుతుంది. 12-15 లక్షల బేళ్ల ఉత్పత్తి జరుగుతుంది. పత్తి విత్తనాల ధర తగ్గడంతో సాగు విస్తీర్ణం కొంత పెరిగే అవకాశం ఉంది. ఒక్కో ప్యాకెట్‌పై రూ.60 ఆదా అవుతుండటంతో సాధారణ రైతులకు రూ.400-500 మేరకు లబ్ధి పొందడానికి వీలుంది. గతంతో పోలిస్తే పత్తి విత్తనాలకు ధర తగ్గడం పట్ల రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నా.. నకిలీ విత్తనాల బెడద వెంటాడుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. సీజన్‌ ప్రారంభం కాకముందే గత రెండు నెలలో నకిలీ పత్తి విత్తనాలను అనేక చోట్ల పట్టుకున్నారు. అనుమతి లేనివి, నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా నియంత్రించడంతో పాటు, పత్తి విత్తనాల ప్యాకెట్లను తగ్గించిన ధరకే అమ్మేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19968
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author