బ‌యోమెట్రిక్ ద్వారా కార్మికుల హాజ‌రు

బ‌యోమెట్రిక్ ద్వారా కార్మికుల హాజ‌రు
March 14 18:26 2018

హైదరాబాద్
జీహెచ్ఎంసీలోని 22వేల మంది పారిశుధ్య కార్మికుల‌ హాజ‌రుకు ప్ర‌వేశ‌పెట్టిన‌ ఆధార్ ఆధారిత‌ బ‌యో మెట్రిక్ విధానం ద్వారా జీహెచ్ఎంసీకి రూ. 50కోట్లు ఆదా అయ్యాయి. దీంతో కేవ‌లం కార్మికుల‌కే కాకుండా ప‌ర్మినెంట్ అధికారులు, ఉద్యోగుల‌కు కూడా ఫిబ్ర‌వ‌రి మాసం నుండి ఆధార్ ఆధారిత బ‌యోమెట్రిక్ హాజ‌రు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. దేశంలోని మ‌రే మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో పారిశుధ్య కార్మికుల‌కు బ‌యోమెట్రిక్ హాజ‌రు విధానం అమ‌లులో లేదు. దీంతో శానిటేష‌న్ వ‌ర్క‌ర్ల‌కు బ‌యోమెట్రిక్ హాజ‌రు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన మొట్ట‌మొద‌టి కార్పొరేష‌న్‌గా జీహెచ్ఎంసీ నిలిచింది. 2017 ఫిబ్ర‌వ‌రి మాసం నుండి జీహెచ్ఎంసీలోని 22వేల మంది పారిశుధ్య కార్మికులు, ఎంట‌మాల‌జి వ‌ర్క‌ర్ల‌కు మొట్ట‌మొద‌టి సారిగా బ‌యోమెట్రిక్ హాజ‌రు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. శానిటేష‌న్ సిబ్బందికి 939, ఎంట‌మాల‌జి సిబ్బందికి 132 బ‌యోమెట్రిక్ మిషన్ల‌ను కేటాయించి ఆ మిష‌న్ల‌లో కార్మికుల వేలిముద్ర‌లు, ఆధార్ వివ‌రాలు పొందుప‌రిచి ఆయా స‌ర్కిళ్ల‌లోని పారిశుధ్య క్షేత్ర స‌హాయ‌కులు (ఎస్‌.ఎఫ్‌.ఏ)ల‌కు అనుసంధానం చేయ‌డం ద్వారా కార్మికుల హాజ‌రును విజ‌య‌వంతంగా సేక‌రించే ప్ర‌క్రియ అమ‌లవుతుంది. జీహెచ్ఎంసీలో కార్మికుల‌కు అందించే వేత‌నాలు కూడా ఇత‌ర కార్పొరేష‌న్ల క‌న్నా అధికంగానే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల‌కు అంద‌జేసే ఈ వేత‌నాల పంపిణీలో ఏవిధ‌మైన అక్ర‌మాలు జ‌రుగ‌కుండా హాజ‌రు విష‌యంలో క‌చ్చితంగా ఉండేందుకు బ‌యోమెట్రిక్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని మంత్రి కె.టి.రామారావు, మేయ‌ర్ రామ్మోహ‌న్‌లు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేయ‌డంతో ఈ బ‌యోమెట్రిక్ హాజ‌రును సేక‌రించేందుకు 1200మిష‌న్‌మను జీహెచ్ఎంసీ టెండ‌ర్ ద్వారా ప్రొక్యూర్ చేసింది. ఈ బ‌యోమెట్రిక్ మిష‌న్ల ద్వారా సంబంధిత ఎస్‌.ఎఫ్‌.ఎ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌నిచేసే కార్మికుల హాజ‌రును అదేప్రాంతంలో మాత్ర‌మే రోజుకు మూడు సార్లు హాజ‌రు సేక‌రిస్తున్నారు. ఒక ప్రాంతంలోని బ‌యోమెట్రిక్ మిష‌న్ ఇత‌ర ప్రాంతంలో ప‌నిచేయ‌దు. ఎస్‌.ఎఫ్‌.ఏల‌ను కూడా జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేసినందున త‌న ప‌రిధిలోనే ఈ బ‌యోమెట్రిక్ మిష‌న్ ప‌నిచేస్తుంది. ఆధార్ అనుసంధానంతో జీయో బేస్‌డ్ విధానంలో కార్మికుల నుండి హాజ‌రును సేక‌రిస్తారు. దీని ద్వారా గ‌త సంవ‌త్స‌ర కాలంగా జీహెచ్ఎంసీకి 50కోట్ల రూపాయ‌లు ఆదా అయ్యాయ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. బ‌యోమెట్రిక్ హాజ‌రు విధానం ప్ర‌వేశ‌పెట్ట‌డానికంటే ముందు నెల‌కు కార్మికుల వేత‌నాలు రూ. 34.64కోట్లు చెల్లించేవారు. ఆధార్ ఆధారిత బ‌యోమెట్రిక్ హాజ‌రు విధానం ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం ప్ర‌తి నెల‌కు 3కోట్ల నుండి 4.50కోట్ల రూపాయ‌లు సుమారుగా ఆధా అవుతున్నాయ‌ని జీహెచ్ఎంసీ పేర్కొంది. మే 2017లో రూ. 2.85కోట్లు ఆదా కాగా, జూన్ 2017లో రూ. 4.22కోట్లు, జూలై 2017లో రూ. 4.05కోట్లు, ఆగ‌ష్టు 2017లో రూ. 4.56కోట్లు ఆదా అయ్యాయి. గ‌త సంవ‌త్స‌ర కాలంగా మొత్తం రూ. 50కోట్ల రూపాయ‌లు ఆధార్ ఆధారిత బ‌యోమెట్రిక్ విధానం ద్వారా ఆదా అయ్యాయ‌ని పేర్కొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20028
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author