ఎన్డీఏ నుంచి వైదొలిగిన తెలుగుదేశం పార్టీ

ఎన్డీఏ నుంచి వైదొలిగిన తెలుగుదేశం పార్టీ
March 16 15:34 2018

అమరావతి,
ఎన్డీయే నుంచి వైదొలగాలని తెలుగుదేశం సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు,అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో శుక్రవారం జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈమేరకు అమిత్ షా కు లేఖ రాయాలని నిర్ణయించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కూడా దీనిపై సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు. బిజెపితో ఎందుకు పొత్తు పెట్టుకున్నాం, ఎన్డీఏలో ఎందుకు చేరిందీ, ఈ నాలుగేళ్లలో ఏం జరిగింది, ఎందుకు విడిపోవాల్సివచ్చిందీ సమగ్ర వివరాలతో లేఖ రాయనున్నట్లు చెప్పారు. నేడే కేంద్రంపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్ సభలో అందజేయాలని ఆదేశించారు. దొంగల పార్టీ వైకాపా ఇచ్చిన అవిశ్వాసం నోటీసుకు మద్దతిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు.అందుకే తెలుగుదేశం పార్టీ సొంతంగా, ప్రత్యేకంగా కేంద్రంపై అవిశ్వాస నోటీసు అందజేయాలన్నారు.
వాళ్ల నోటీసుపై 5గురు ఎంపీల సంతకాలు ఉంటాయని,టిడిపి నోటీసుపై 16మంది సంతకాలు ఉంటాయంటూ, 51మంది మద్దతు కూడడట్టడం తెలుగుదేశం పార్టీకే సులభసాధ్యం అవుతుందన్నారు.ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై ఇతరపార్టీలు కూడా సానుభూతిగా ఉన్నాయని,వాటి మద్దతు కూడా అవిశ్వాసానికి తీసుకోవాలని ఎంపీలను ఆదేశించారు. చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు:
ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం.రాష్ట్రానికి న్యాయం చేయాలన్నదే మా డిమాండ్.ఆరోజు టిడిపిని దెబ్బతీయడానికి కాంగ్రెస్ రాష్ట్రాన్నివిభజించింది.ఈరోజు టిడిపిని దెబ్బతీయడానికి బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది.
జగన్ తో ఒక డ్రామా,పవన్ తో ఇంకో డ్రామా, కేంద్రం డ్రామాలమీద డ్రామాలు ఆడుతోంది.ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా ఒక మహాకుట్ర జరుగుతోంది. ఇందులో భాగస్వామును వదిలిపెట్టం,ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం.
అవిశ్వాసం పెట్టు,ఎంపీలతో రాజీనామాలు చేయించు,నీ ద్వారానే హోదా వచ్చేలా చేస్తామని జగన్ తో బిజెపీ డ్రామా ఆడుతోంది.మరోవైపు ఆమరణ దీక్ష చేయి,నీ ద్వారానే హోదా వచ్చేలా చేస్తామని పవన్ తో డ్రామా ఆడుతోంది. ఈ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు.తగిన సమయంలో గుణపాఠం చెబుతారు.
వైకాపాకు సహకరిస్తానని పవన్ తనతో చెప్పినట్లు వైకాపా ఎంపీ వరప్రసాద్ చెప్పారు. ఇంతకన్నా కుట్రకు సాక్ష్యం ఏం కావాలి? అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.పీఎంవో చుట్టూ విజయసాయి రెడ్డి ప్రదక్షిణలు చేస్తున్నారు.మీడియా కనిపిస్తే దాక్కుంటున్నారు.ఫొటోలు కూడా మీడియాలో వచ్చాయి.ఇంతకన్నా కుట్రకు రుజువులు ఏం కావాలి? అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.
ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) పవిత్రమైన కార్యాలయం.అక్కడ ఏ1,ఏ2 నిందితులకు పనేమిటి..?ప్రధాని కార్యాలయం చుట్టూ ప్రధాన నిందితుల ప్రదక్షిణలా..? దీని ద్వారా ఏ సంకేతాలు పంపుతున్నారు..? కేంద్రంలో ఏదైనా విషయాలు ముందుగా మిత్రపక్షాలకు తెలుస్తాయి.అలాంటిది కేంద్రంలో అన్ని అంశాలు వైకాపాకే ముందు ఎలా తెలుస్తున్నాయి..? రాజీనామాలపై సభలో ప్రకటనలు చేయడానికి కేంద్రమంత్రులకు అవకాశం ఇవ్వరా..? ప్రధాన నిందితులను మాత్రం పదేపదే కలుస్తారా..?దీని అర్ధం ఏమిటి..?
నీరవ్ మోడిలాంటి నిందితులు దేశం దాటిపోతున్నారు.విజయసాయి రెడ్డిలాంటి వాళ్లు పీఎంవోలో తిరుగుతున్నారు. వీటిద్వారా ఏ సంకేతాలు ప్రజల్లోకి పంపుతున్నారు..?గాలి జనార్దన రెడ్డిలాంటి వాళ్లను వదిలిపెడుతున్నారు. విజయసాయి రెడ్డిలాంటి వాళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారు.మీడియాను చూసి విజయసాయి రెడ్డి పీఎంవోలో దాక్కోవడం ఎందుకు..? వెనకనుంచి పరారు కావడం ఎందుకు..? విజయసాయి రెడ్డితో కలిసి పీఎంవోకు వచ్చిందెవరు..? ఈ మహా కుట్రలో భాగస్వాములు అందరికి ప్రజలు తగిన బుద్ది చెబుతారు.
14వ ఆర్ధిక సంఘం హోదా ఇవ్వవద్దని చెప్పలేదని నిన్నే కేంద్రమంత్రి ఇంద్రజిత్ ప్రకటించారు. హోదా ఇవ్వవద్దని ఆర్ధిక సంఘం చెప్పినట్లుగా మనకు చెప్పారు..ఎందుకీ నాటకం..?దేనికీ నాటకాలు..?రాష్ట్రంలో ప్రజాదోంళనలు తీవ్రంగా జరుగుతున్నా కేంద్రం ఉదాసీనంగా ఉంటోంది.ఆర్ధిక బిల్లు కూడా ఆమోదించుకుని వాయిదా వేసుకుపోతున్నారు.అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలు మీకు పట్టవా..? 4ఏళ్లలో ఒక్కమాట నన్ను అనని పవన్ ఇప్పుడీ విమర్శలు చేయడం వెనుక కుట్ర ఏమిటి..? ఈ కుట్ర వెనుక ఉన్నదెవరు..?కేంద్రంపై టిడిపి పోరాడుతుంటే ఇప్పుడే పవన్ విమర్శలు ఎవరికి లాభం చేసేందుకు..? తెలుగుదేశం పార్టీని బలహీన పరచడం ద్వారా రాష్ట్రాన్ని బలహీనపరిచేందుకు కేంద్రపెద్దలు చేస్తున్న ఈ మహా కుట్రను ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు.వీరందరికీ తగిన గుణపాఠం చెబుతారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో టిడిపి పార్లమెంటరీ పార్టీ నేతలు వైఎస్ చౌదరి, తోట నరసింహం, పోలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ,రావుల చంద్రశేఖర రెడ్డి, ఎల్.రమణ, ఎంపీలు సీఎం రమేష్, మురళీమోహన్,అవంతి శ్రీనివాసరావు,రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు,శాసనసభ,మండలి చీప్ విప్ లు పల్లె రఘునాధ రెడ్డి,పయ్యావుల కేశవ్,మేడా మల్లికార్జున రెడ్డి, పరకాల ప్రభాకర్,కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20109
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author