ముందుకు సాగని నీటి ఎద్దడి నివారణా చర్యలు

ముందుకు సాగని నీటి ఎద్దడి నివారణా చర్యలు
March 19 10:59 2018

కాకినాడ,
వేసవిలో తాగునీటి ఎద్దడిపై కార్యాచరణ ప్రణాళిక ఒక అడుగు ముందుకు…మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో వేసవి తాగునీటి కష్టాలను అధిగమించేందుకు ఏటా జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందిస్తోంది. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా యంత్రాంగం రూ.71.46 లక్షలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రతిపాదనలు చేసింది. ఇందులో రూ.45.46 లక్షలతో 685 బోర్‌వెల్స్‌లో పూడికతీత పనులు, రూ.26 లక్షలతో ఏడు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నీటితో నింపాలని కార్యాచరణ చేశారు. ఈ పనులు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ ఏడాది వేసవిలో 354 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. గత ఏడాది వరకు తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, పూడికతీత, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు నీటితో నింపేందుకు వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే వారు. ప్రస్తుత సంవత్సరంలో మాత్రం ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాను పంచాయతీలకు అప్పగించారు. దీంతో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి.పంచాయతీలకు పెద్ద ఎత్తున 14వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి. వీటితో పారిశుద్ధ్యం, ఇతర పనులు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా తాగునీటి సమస్య అధికంగా ఎదుర్కొనే గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు నిధులు కేటాయించే వారు. ఈ ఏడాది మాత్రం ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాను ఆయా గ్రామ పంచాయతీలే చూసుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకే నేరుగా వస్తుండడంతో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ఈ నిధులతో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. స్ధానికంగా ఉన్న నిధులను వినియోగించి తాగునీటి ఎద్దడి లేకుండా పంచాయతీ స్థాయిలోనే పాలకవర్గం, అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఇన్నాళ్లు ఆర్థిక సంఘం నిధులు జిల్లా పరిషత్తుకు కూడా కేటాయించే వారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన నిధులు ఇవ్వలేమని జడ్పీ చేతులెత్తేసింది. దీంతో గ్రామ పంచాయతీలే తాగునీటి ట్యాంకర్లను సమకూర్చుకోవాల్సి ఉంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పటి వరకు పంచాయతీల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి కూడా దీనిపై ఉత్తర్వులు అందలేదని పలువురు సర్పంచులు చెబుతున్నారు. మండల పరిషత్తు అధికారుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో వేసవి తీవ్రత అధికమైంది. 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు గ్రామాల్లో తాగునీటి వెతలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ఎలాంటి ముందస్తు కార్యాచరణ రూపొందించ లేదు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణం దృష్టి సారించాల్సిన అవసరముంది.కాట్రేనికోన మండలం, చిర్రయానాం, నీళ్లరేవు, బులసుతిప్ప గ్రామాలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ గ్రామాలకు ఏటా కాట్రేనికోన నుంచి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ గ్రామాల్లో సుమారుగా 10 వేల మంది జనాభా ఉన్నారు. గత ఏడాది వరకూ జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో గుత్తేదార్లతో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేవారు. ప్రస్తుతం పంచాయతీలే ఈ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ కానరావడం లేదు. ఐ.పోలవరం మండలం గోగుల్లంక పంచాయతీలో సుమారు 1000 మంది జనాభా ఉన్నారు. ఏటా వేసవిలో ఇక్కడ తాగునీటి కష్టాలు అధికమవుతున్నాయి. పడవ ద్వారా స్థానికులు తాగునీటిని తెచ్చుకుంటారు.అల్లవరం మండలం ఓడలరేవు, కొమరిగిరిపట్నం, నక్కా రామేశ్వరం, రెల్లిగడ్డ, తుమ్మలపల్లి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. సఖినేటిపల్లి మండలంలోని పల్లిపాలెం, అంతర్వేది దేవస్థానం, సఖినేటిపల్లిలంక గ్రామాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 354 గ్రామాల్లో తాగునీటి ఎద్దటి నెలకొనే అవకాశముందని జిల్లా అధికారులు అంచనా వేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20165
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author