పవన్ పై టీడీపీ టార్గెట్

పవన్ పై టీడీపీ టార్గెట్
March 19 11:49 2018

అనంతపురం,
మొన్న‌టివ‌ర‌కూ మ‌నోడు అని భావించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఒక్క‌సారిగా తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసి, అవినీతిలో కూరుకుపోయింద‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌టం టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఇత‌ర నేత‌ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నపై ఎదురుదాడి తీవ్ర‌త‌రం చేస్తున్నారు. జ‌న‌సేన ఒంట‌రిగా పోటీచేస్తుంద‌నేది తేలిపోవ‌డంతో.. ఇప్పుడు ప‌వ‌న్ పోటీచేస్తానన్న అనంత‌పురంపై చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. కాపులు ఎక్కువ‌మంది ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుత ఎమ్మెల్యే అంత బ‌ల‌మైన అభ్య‌ర్థి కాద‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌పై గ‌ట్టి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని భావిస్తున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. సొంతంగా మ‌రింత బ‌లం పెంచుకోవాల‌ని ఎమ్మెల్యేకి చెబుతూనే.. ప‌వ‌న్‌ను ఢీకొట్టే స‌మ‌ర్థ నాయ‌కుడి కోసం అన్వేషణ ప్రారంభించార‌ట టీడీపీ అధినేత‌.టీడీపీ ప్ర‌భుత్వంపై, టీడీపీ భావి నేత‌గా భావిస్తున్న లోకేష్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇరు వ‌ర్గాల మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రింత తీవ్ర‌మ‌వుతోంది. మొన్న‌టివ‌ర‌కూ ప‌వ‌న్ బంగారం అన్న నేత‌లే ఇప్పుడు ఆయ‌నపై ఎదురు తిరుగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇన్నాళ్లు ప‌వ‌న్ పై ఈగ‌కూడా వాల‌నీయ‌ని టీడీపీ నేత‌లు క‌స్సుమంటున్నారు. ప‌వ‌న్ వెన‌క బీజేపీ ఉందంటూ ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌ధాని మోదీ ఆడిస్తున్న నాట‌కంలో ప‌వ‌న్ ఓ పావు అంటూ వెక్కిరిస్తున్నారు. ఇంత‌కాలం టీడీపీతో స‌ఖ్య‌తగా ఉన్న ప‌వ‌న్ ను ఏనాడు ప‌ల్లెత్తు మాట కూడా అన‌ని టీడీపీ నాయ‌కులు ఒక్క‌సారిగా ప‌వ‌న్ పై మండిప‌డుతున్నారు.
మొత్తానికి ప‌వ‌న్ ఒక విష‌యంపై క్లారిటీ ఇచ్చేశాడు. వామ‌ప‌క్షాల‌తో పొత్తు పెట్టుకుంటాన‌ని ఇప్ప‌టికి చెబుతున్న ఆయ‌న‌.. ప్ర‌ధాన పార్టీల‌తో మిత్ర‌త్వంపై స్ప‌ష్టత ఇవ్వ‌లేదు. ఈ త‌రుణంలో.. ప‌వ‌న్ గ‌తంలో చెప్పిన‌ట్లు అనంత‌పురం నుంచే పోటీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా ప‌వ‌న్‌ను ఓడించాల‌న్న ల‌క్ష్యంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్ర‌భాకర్ చౌద‌రి ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సైతం ప్ర‌భాక‌ర్‌కే టికెట్ ఇవ్వాలా లేక బ‌ల‌మైన అభ్య‌ర్తి కోసం అన్వేషించాలా అన్న‌దానిపై క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.ప్ర‌స్తుతం అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 55 వేల‌కు పైచిలుకు ఓట్లు ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వి ఉన్నాయి. ప‌వ‌న్ రంగంలోకి దిగితే ఈ ఓట్ల‌లో చీలిక రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అలాగే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు కూడా కీల‌కంగా మార‌నుంది. అంతేగాక ప్ర‌స్తుత ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర చౌద‌రిపైనా కొంత వ్య‌తిరేక గాలి వీస్తోంది. ఈ త‌రుణంలో ఆయ‌న‌కు చంద్ర‌బాబు ఆదేశాలు జారీచేశార‌ట‌. క్యాడ‌ర్ చెక్కు చెద‌ర‌కుండా గ్రామ‌స్థాయిలో గ‌ట్టిగా ప‌ట్టు పెంచుకోవాల‌ని సూచించార‌ట‌. అయితే ఆయ‌న స్థానంలో ఈసారి అదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌, ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్‌ను బ‌రిలోకి దించితే ప‌వ‌న్‌కు ధీటైన ప్ర‌త్య‌ర్థిని దించిన‌ట్లు అవుతుంద‌ని కొంద‌రు భావిస్తున్నార‌ట‌. ఇదే అభిప్రాయాన్ని బాబు ముందుంచార‌ట‌. చివ‌రి నిమిషంలో ఆయ‌న్ను కూడా రంగంలోకి తీసుకురావొచ్చ‌ని తెలుస్తోంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20186
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author