వామ్మో… సాగర్ లో బోటింగా…

వామ్మో… సాగర్ లో బోటింగా…
March 23 12:21 2018

హైద్రాబాద్,
సవికాలంలో ఎక్కువగా పర్యాటకులు హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్ చేయడానికి ఎంతోమంది ఇష్ట పడతారు. అదే తరహాలో ప్రస్తుతం తాకిడి కూడా పెరిగింది. సాయంత్రం వేళల్లో అయితే ఆ సంఖ్య మరీ ఎక్కువైంది. కానీ బోట్లలో భద్రతా పరమైన చర్యలు తీసుకోవడంలేదు. దీంతో హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు ప్రమాదకరంగా మారింది. బోటు ఎక్కినప్పటి నుంచి బోటు దిగేంత వరకు అడుగడుగునా నిర్లక్ష ధోరణి కనిపిస్తుంది. బోటులో ప్రయాణించే పర్యాటకుల భద్రతను ఎవరూ పట్టించుకోవడంలేదు. అధికారులు సైతం ఈ విషయాన్ని గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారు. వీకెండ్ వచ్చందంటే ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్కుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. అందులోనూ హుస్సేన్‌సాగర్ అలలపై బోటులో షికారు చేయడానికి చాలా మంది ఇష్ట పడతారు. హుస్సేన్ సాగర్‌లో వారాంతంలో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు 5000లకు పైనే ఉంటోంది. మరి వీరి భద్రతకు భరోసానిచ్చే సౌకర్యాలు మాత్రం బోటులో కనిపించడంలేదు. కనీస భద్రతా ప్రమాణాలను గాలికి వదిలి పర్యాటకుల ప్రాణాలు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.హుస్సేన్‌సాగర్‌లో తిరిగే బోట్లు 17 వరకు ఉన్నాయి. వీటిలో మెకనైజ్డ్ బోట్లు 5, డీలక్స్ బోట్లు 3, స్పీడు బోట్లు 5, ఖైరున్నీసా 1, భాగమతి 1, భగీరథీ బోటు 1, ఫాంటన్ 1 ఉన్నాయి. మెకనైజ్డ్ బోట్లలో 30 నుంచి 40 మంది, డీలక్స్ బోట్లలో 100 నుంచి 110 మంది, స్పీడు బోట్లలో 40 భాగమతిలో 80 మంది, భగీరథిలో అత్యధికంగా 130 మంది, వీటితో పాటు మిగతా వాటిల్లో వాటికి సరిపడా పర్యాటకులు ప్రయాణించవచ్చు. కాగా వీటిలో ప్రయాణించే వారందరికీ సేఫ్టీ జాకెట్లు, రింగులు లేవు. బోటులో ఇద్దరు స్విమ్మర్లు (గజ ఈతగాళ్లు) ఉండాలి. కనీసం ఒక్కరన్నా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో బోట్లలో ఒక్కరు కూడా కనబడటం లేదని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. బోటును నడిపే నిర్వాహకులు విధిగా ప్రయాణికులు బోటు ఎక్కగానే లైఫ్ జాకెట్లు వేసుకోవాలని సూచించాల్సి ఉంటుంది. కానీ ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే దాఖలాలు ఏమాత్రం కనిపించడంలేదు. అధికారులు పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది.బోటు ఎక్కే ముందు పర్యాటకులకు భద్రతపై పూర్తిగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ పర్యాటకులు సేఫ్టీ జాకెట్, సేఫ్టీ రింగ్‌లను ధరించడంలేదని సాగర్‌లోని బోటింగ్ సిబ్బంది చెబుతున్నారు. తాము ఎన్నిసార్లు చెబుతున్నా బోటు ఎక్కిన తరువాత సేఫ్టీ జాకెట్ తీసి పక్కన పెడుతున్నారని అంటున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20635
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author