71 ఏళ్లలో 296గురుకులాలు…మూడేళ్లలో577 గురుకులాలు

71 ఏళ్లలో 296గురుకులాలు…మూడేళ్లలో577 గురుకులాలు
March 23 18:18 2018

హైదరాబాద్,
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లలోనే 577 గురుకులాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసిఆర్ చరిత్ర సృష్టించారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోలోనే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని చెప్పామని, ఇందులో భాగంగానే అత్యధిక సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నామని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 71 ఏళ్లలో రాష్ట్రంలో 296 గురుకులాలు ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కేవలం మూడేళ్లలోనే 577 గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ శాసన మండలిలో గురుకులాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సమాధానం ఇచ్చారు.
రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పొందుపర్చిన ఆర్టికల్ 3వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, ఆయన స్పూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ట్యాంక్ బండ వద్ద అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని, గ్రంథాలయాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. ఆ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం పెట్టినప్పుడు ఇంకా అంబేద్కర్ స్పూర్తిని భావితరాలకు అందించేందుకు ఏం చేయాలని అడిగినప్పుడు తాను ఎస్సీ, ఎస్టీ, బలహీన, మైనారిటీ వర్గాలకు ఇంకా నాణ్యమైన విద్య అందుబాటులో లేదని చెప్పానని తెలిపారు. వారికి నాణ్యమైన విద్య అందించేందుకు అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 గురుకులాలు ఏర్పాటు చేయాలని సిఎం కేసిఆర్ ను కోరినట్లు చెప్పారు. అయితే మనసున్న మారాజు కేసిఆర్ గారు తాను 125 గురుకులాలు అడిగితే ఈ మూడేళ్లలో 577 గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు.
కొంతమంది రాజకీయ నాయకులు తెలంగాణ వస్తే ఏం వచ్చిందని ఇంకా ప్రశ్నిస్తున్నారని, అయితే తెలంగాణ రావడం వల్లే ఎస్సీ, ఎస్టీ, బలహీన, మైనారిటీ వర్గాల పిల్లలకు ఈ 577 గురుకులాలు వచ్చాయని గుర్తించాలన్నారు. ఎస్సీలకు 134, ఎస్టీలకు 75, బీసీలకు 143, మైనారిటీలకు 192 గురుకులాలు ఈ మూడేళ్లలో ఏర్పాటు కాగా…33 గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. వీటిల్లో 2,60,137 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. ఈ గురుకులాలకు ఈసారి బడ్జెట్ లో ఎస్సీలకు రూ.1221 కోట్లు, ఎస్టీలకు రూ. 401 కోట్లు, బీసీలకు రూ.296 కోట్లు, మైనారిటీలకు రూ.735 కోట్లు, విద్యాశాఖ గురుకులాలకు రూ.170 కోట్లు కలిపి మొత్తంగా రూ.2823 కోట్లు కేటాయించారని చెప్పారు. ఎస్సీ గురుకులాల్లో 2809, ఎస్టీ గురుకులాల్లో 1027, బీసీ గురుకులాల్లో 2003, మైనారిటీ గురుకులాల్లో 327, విద్యాశాఖ గురుకులాల్లో 2268 పోస్టులను మంజూరు చేశామన్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షలు, ఎంపిక పూర్తయిందని, రానున్న విద్యా సంవత్సరం 2018-19లో 8434 మంది అధ్యాపకులు గురుకులాల్లో చేరనున్నారని చెప్పారు.
కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో ఇప్పటికే 240 గురుకులాలకు నూతన భవనాల కోసం స్థలాన్ని కేటాయించామని, ఒక్కో గురుకుల భవనానికి కోటిన్నర రూపాయలు ఖర్చుతో భవన నిర్మాణం చేయనున్నామని చెప్పారు. ఒక సంవత్సరంలోపు ఈ భవనాల నిర్మాణాలన్ని పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా నాలుగు క్రికెట్ అకాడమీలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకులాల్లో పనిచేస్తున్న సీఆర్టీల వేతనాలను కూడా పెంచాలని సిఎం కేసిఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. త్వరలోనే వీరి వేతనాలు పెరగనున్నాయని సభ్యులకు తెలిపారు. ఇతర దేశాల్లో అమలు చేస్తున్న విద్యావిధానాన్ని అధ్యయనం చేయడానికి త్వరలోనే విదేశాలకు ఒక బృందాన్ని పంపుతామని సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ప్రస్తుతం తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక సైనిక్ స్కూల్ ను, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరొక సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేశామని వీటి సక్సెస్ రేటును బట్టి ఉమ్మడి ఆదిలాబాద్ లో కూడా సైనిక్ స్కూల్ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు.
రాష్ట్రంలో వివిధ శాఖలో పరిధిలో నడుస్తున్న స్టడీ సర్కిళ్లన్నింటిని ఒకే స్టడీ సర్కిల్ పరిధిలోకి తీసుకొచ్చి దేశంలోనే అత్యంత అనుభవజ్ణులైన అధ్యాపకులతో కోచింగ్ ఇప్పించే ఆలోచన చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సభకు తెలిపారు. వీటితో పాటు ఐదు సొసైటీల కింద పనిచేస్తున్న గురుకులాలను కూడా ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సిఎం కేసిఆర్ గతంలోనే చెప్పారని తెలిపారు. వీటన్నింటిని విద్యాశాఖ కిందకు తీసుకురావాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. గురుకులాలు వివిధ సొసైటీల కింద పనిచేస్తున్నప్పటికీ ఈ గురుకులాల్లో కామన్ మెను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నెలకు నాలుగు సార్లు చికెన్, రెండుసార్లు మటన్, వారానికి ఐదుసార్లు గుడ్లు, ప్రతి రోజు 50 గ్రాముల నెయ్యి, ఉదయం టిఫిన్, పాలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం పోషక విలువలు అందేలా పెడుతున్నామని చెప్పారు. గురుకులాల్లో విద్యార్థులకు యూనిఫామ్ లు, డ్యుయల్ డెస్క్ లు, కంప్యూటర్లు, డిజిటల్ క్లాసులు, హీట్ వాటర్, చలికాలంలో దుప్పట్లు, ట్రంక్ బాక్స్ లు, గ్లాసులు, ప్లేట్లు, బెడ్స్ అందిస్తున్నామన్నారు. అన్ని గురుకులాల్లో సీసీ కెమెరాలు, బయో మెట్రిక్ మెషీన్లు పెట్టామన్నారు. వీటితో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తున్నామని చెప్పారు. ఈ కిట్స్ లలో బాలికలకు కావల్సిన న్యాప్కిన్లు సరఫరా చేస్తున్నామన్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించే విధంగా గురుకులాలను పటిష్టం చేస్తున్నామని, పోస్టులు భర్తీ చేస్తున్నామని, భవనాలు నిర్మించనున్నామని, విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సభ్యులు కూడా వారి నియోజక వర్గాలకు వెళ్లినప్పుడు గురుకులాలకు వెళ్లి పర్యవేక్షించాలని, వీలైతే అక్కడే భోజనాలు చేసి విద్యార్థులను ఉత్సాహ పర్చాలని కోరారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20737
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author