తాజా మాజీ ఎమ్మెల్యేలకు ఈసారి టెన్షన్‌

తాజా మాజీ ఎమ్మెల్యేలకు ఈసారి టెన్షన్‌
December 08 13:00 2018

2014 ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో గెలుపొందిన తాజా మాజీ ఎమ్మెల్యేలకు ఈసారి టెన్షన్‌ పట్టుకుంది. .గత సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీ ఫలితాలను తారుమారు చేసింది. విజయపుటంచుల వరకూ వెళ్లి కొందరు పరాజయం పాలయ్యారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో 5వేల ఓట్ల కంటే తక్కువ మెజార్టీతోనే తాజా మాజీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఎనిమిది స్థానాల్లో అయితే అత్యంత తక్కువ ఓట్లతోనే గెలుపోటములు ప్రభావితమయ్యాయి. అయితే ఈసారి భద్రాచలం, మల్కాజిగిరిలో సిట్టింగు ఎమ్మెల్యే అభ్యర్థులు మారినా మిగతాచోట్ల గత ఎన్నికల్లో గెలుపొందిన వారే బరిలో నిలిచారు. కొందరు జెండాలు మార్చుకున్నా యథావిధిగా అక్కడ్నుంచే పోటీలో ఉన్నారు. ఎలాగైనా ఆధిక్యం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. కొందరు అభ్యర్థులు ఈసారి గట్టెక్కగలమా? అన్న ఆలోచనలో పడ్డారువేర్వేరు పార్టీలకు చెందిన సిట్టింగులు గతంలో వచ్చిన స్వల్ప ఆధిక్యతను ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధిగమించాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఓట్లు తగ్గాయో సమీక్షించి పరిస్థితి చక్కదిద్దుకునే పనులు ఇప్పటికే పూర్తి చేసుకున్నా….అభ్యర్థుల్లో నేటికీ ఆందోళన కొనసాగుతున్నది. 16 నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఉండగా.. భద్రాచలం, మల్కాజిగిరిలోనే సిట్టింగులు మారారు. మరోవైపు బీఎల్‌ఎఫ్‌ బలపర్చిన అభ్యర్థులు కూడా ప్రజాబలం కూడగట్టుకొని ధన, మద్యం ప్రవాహం పారబోదని తేల్చిచెప్పేందుకు సిద్ధమవుతున్నారు.పోయిన ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మానిక్‌రావుపై 842 ఓట్లతో గెలుపొందారు. గీతారెడ్డికి 57,558 ఓట్లురాగా, మానిక్‌రావుకు 56,716 ఓట్లు పోలయ్యాయి. 2018 లోనూ వారిద్దరే ప్రధానంగా తలపడుతున్నారు. ఈసారి బీఎల్‌ఎఫ్‌ బలపర్చిన సీపీఐ(ఎం) అభ్యర్థి రాంచందర్‌ కూడా బరిలో ఉండటంతో ప్రధాన పార్టీలకు ఆందోళన మొదలైంది. అందోల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా బాబూమోహన్‌ 3,291 ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర రాజనర్సింహాపై గెలుపొందారు. ఈసారి టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ రాకపోవడంతో బాబూమోహన్‌ బీజేపీ నుంచి పోటీచేస్తున్నారు. అయితే ప్రత్యక్ష పోరాటాల నేపథ్యం కలిగి, మహిళా శక్తిని చాటేందుకు బీఎల్‌పీ అభ్యర్థిగా జయలక్ష్మి బరిలో ఉండటం గమనార్హం.నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో కాంగ్రెస్‌ నుంచి వంశీచంద్‌రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి ఆచారిపై 78 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వంశీచంద్‌రెడ్డికి 42,782, ఆచారికి 42704 ఓట్లు వచ్చాయి. బీజేపీకి ఇప్పుడు టీడీపీ దూరమైంది. ఇక టీఆర్‌ఎస్‌లో గ్రూపుల పోరు నడుస్తున్నది. బీఎల్‌పీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ కూడా ఆయా తరగతుల ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో టీడీపీ నుంచి పోటీచేసిన ఎస్‌రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శివకుమార్‌రెడ్డిపై 2,270 ఓట్లతో గెలిచారు. రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరగా.. శివకుమార్‌రెడ్డి హస్తం అందుకున్నారు. తదనంతరం బీఎల్‌ఎఫ్‌ విధానాలు నచ్చి, బీఎల్‌పీ తరపున బరిలో నిలిచిన శివకుమార్‌రెడ్డి గెలిచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.మహబూబ్‌నగర్‌ నుంచి గెలుపొందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డిపై 3139 ఓట్ల మెజార్టీనే దక్కించుకున్నారు. ఇప్పుడు శ్రీనివాస్‌రెడ్డి బరిలో లేరు. 2014లో గట్టి పోటీనిచ్చిన ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఇబ్రహీం బీఎస్పీ నుంచి, బీఎల్‌పీ నుంచి గులాంనబ్‌గౌస్‌ కూడా బరిలో నిలిచారు. వనపర్తిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిపై 4291 ఓట్ల మెజార్టీతోనే విజయం సాధించారు. ప్రధానంగా వారిద్దరి మధ్యనే పోటీ నెలకొన్నా బీఎల్‌పీ అభ్యర్థి జింకల కృష్ణయ్య కూడా ప్రభావం చూపనున్నారు.కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ అలయెన్స్‌లో టీడీపీ అభ్యర్థి సాయన్న కాంగ్రెస్‌ అభ్యర్థి గజ్జెల నగేశ్‌పై 3275 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గజ్జెల నగేశ్‌కు టికెట్‌ కేటాయించకపోవడంతో స్వతంత్రంగా బరిలో ఉన్నారు. మల్కాజిగిరిలో టీఆర్‌ఎస్‌ సి.కనకారెడ్డి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై 2768 ఓట్లతో గెలుపొందారు. రాంచందర్‌రావు ఈసారి బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. అయితే అధికార పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు పోటీలో ఉండటం కలిసొస్తుందని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నది.చేవేళ్లలో టీఆర్‌ఎస్‌ నుంచి కెఎస్‌ రత్నం.. కాంగ్రెస్‌ అభ్యర్థి కాలె యాదయ్య చేతిలో కేవలం 999 ఓట్లతో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్యనే పోటీ ఉన్నా జెండాలు మార్చుకున్నారు. టీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉండగా.. కాంగ్రెస్‌లో అనైక్యత కొనసాగుతున్నది. పరిగిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హారీశ్వర్‌రెడ్డిపై 5,837 మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.రామ్మోహన్‌రెడ్డి విజయం సాధించారు. ఈసారి టీఆర్‌ఎస్‌ తరపున హరీశ్వర్‌రెడ్డి తనయుడు మహేష్‌రెడ్డి పోటీలో ఉన్నారు. బీఎల్‌పీ నుంచి వెంకటయ్య కూడా ప్రజాదరణ కలిగి ఉన్నాడు. అశ్వారావుపేటలో టీఆర్‌ఎస్‌ ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే కేవలం 845 ఓట్లతోనే గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి మచ్చా నాగేశ్వరరావుతో పాటు మరో 10 మంది బరిలో ఉన్నారు. భద్రాచలంలో సీపీఐ(ఎం) అభ్యర్థి సున్నం రాజయ్య 1816 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కొమురం ఫణీశ్వరమ్మపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోదెం వీరయ్య, సీపీఐ(ఎం) నుంచి మిడియం బాబురావు పోటీ చేస్తున్నారు. మిడియం గతంలో ఎంపీగా ఉండటం, గిరిజన సమస్యలపై పోరాటడం వల్ల ప్రజాదరణ పొంది ఉన్నాడు.సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 2,379 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్‌ గెలుపొందగా ప్రస్తుతం ఆయనపై వ్యతిరేకత ఉన్నది. అద్దంకి దయాకర్‌కూ వడ్డేపల్లి రవి రెబెల్‌గా ఉండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. సూర్యాపేటలో స్వతంత్య్ర అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుపై 2219 ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ నుంచి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గెలుపొందారు. సంకినేని ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తుండటంతో అతనికి ఓటింగ్‌ శాతం తగ్గే అవకాశమున్నదనే చర్చ నడుస్తోంది. సత్తుపల్లిలో టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య (75490), వైసీపీ మట్టా దయానంద్‌ (73005) మధ్య స్వల్ప తేడా ఉన్నది. దయానంద్‌ టీఆర్‌ఎస్‌లో చేరినా టికెట్‌ దక్కలేదు. పిడమర్తి రవికి కేటాయించడంతో దయానంద్‌ అనుచరగణం అధికార పార్టీకి ఓటు వేసేది అనుమానమే. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రెండోసారి రెబెల్‌గా నిలిచిన కోరుకంటి చందర్‌ అధికార పార్టీకి దడ పుట్టిస్తున్నాడు. సోమారపు సత్యనారాయణపై గత ఎన్నికల్లో కేవలం 2295 ఓట్ల తేడాతో చందర్‌ ఓడిపోవడం ఇప్పుడతనికి సానుభూతి కల్పిస్తోంది. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21408
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author