ఎట్టకేలకు (ప్రకాశం

ఎట్టకేలకు (ప్రకాశం
December 11 13:52 2018

 వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ‘ముఖ్యమంత్రి బాల సురక్ష’ పథకం ఎట్టకేలకు మళ్లీ మొదలైంది. నాలుగు నెలల ఆలస్యం కావడంతో తొలిదశ స్క్రీనింగ్‌ పరీక్షలు సకాలంలో పూర్తయ్యేలా లేవు. గతంలో రాష్ట్రీయ బాలస్వాస్థ్య పేరుతో నిర్వహించిన ఈ పథకానికి గత ఏడాది పేరు మార్చారు. వాస్తవానికి డిసెంబరుకల్లా మొదటి దశ వైద్యపరీక్షలు పూర్తిచేయాల్సి ఉండగా ఆ లక్ష్యాన్ని జనవరికి పొడిగించారు. గతంలోనే పథకాన్ని ప్రారంభించినా, వైద్యులు లభించకపోవడంతో సంబంధిత ఏజెన్సీ చేతులెత్తేసింది. తాజాగా ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించడంతో పథకం మళ్లీ మొదలైంది.జిల్లాలో 20 రోజులుగా వైద్యపరీక్షలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా సీఎం డ్యాష్‌బోర్డుకు అందిన సమాచారాన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు 1.30 లక్షల మందికి పరీక్షలు పూర్తయ్యాయి. మరో రెండు నెలలే గడువు ఉంది. దీనికి తోడు జిల్లాలో 31 వాహనాలు అవసరం కాగా, 28 వాహనాలే ఏర్పాటు చేశారు. పుల్లలచెరువు, పెదదోర్నాల, యర్రగొండపాలెం ప్రాంతాలకు కేటాయించిన వాహనాలకు ఇంకా వైద్యులు లభ్యం కాలేదు. ఈ కారణంగా గడువులోగా పరీక్షలు పూర్తవుతాయా అనే సందేహాలు నెలకొన్నాయి. కార్యక్రమం సక్రమంగా జరిగి ఉంటే ఇప్పటికే పిల్లల్లో అనారోగ్య సమస్యలు తెలిసేవి. సకాలంలో వారికి అవసరమైన వైద్యం లభించేది. పథకం అమలులో జరిగిన లోపాలు పిల్లల ఆరోగ్యానికి ప్రతిబంధకంగా మారింది. తీవ్ర ఆనారోగ్యంతో ఉన్న పేద పిల్లలకు దీనివల్ల నష్టం జరుగుతుంది.గతంలో వైద్యఆరోగ్య శాఖ ద్వారా పీహెచ్‌సీ వైద్యులతో జరిగిన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. దీని కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో టెండర్లు పిలవగా ధనుష్‌ ఇన్ఫోటెక్‌ అనే సంస్థకు దక్కింది. ఆ సంస్థ ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకుంది. జులై నుంచి అన్ని జిల్లాల్లో పుట్టిన బిడ్డ మొదలు 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వైద్యపరీక్షలు జరపాలి. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి పిల్లల్ని పరీక్షించాలి. హెల్త్‌కార్డులో వివరాలు నమోదు చేయాలి. అవసరమైన వారికి రక్తపరీక్షలు చేయాలి. రిఫరల్‌ కేసులు ఉంటే పీహెచ్‌సీ వైద్యాధికారికి పంపించాలి. ఇంకా ఉన్నతవైద్యం అవసరమైతే అక్కడి నుంచి ఏఎన్‌ఎంల ద్వారా రిమ్స్‌లోని పిల్లల వైద్యవిభాగానికి పంపుతారు. ఆరు నెలలకు ఒకసారి ఏడాదిలో రెండు సార్లు పరీక్షలు చేయాలి.నిబంధనల ప్రకారం గత జులైలోనే వైద్యపరీక్షలు ప్రారంభించాలి. దీని కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక వాహనాల్లో ఒక ఎంబీబీఎస్‌ వైద్యుడు, ఆయుష్‌ వైద్యుడు ఉండాలి. ఇద్దరు ఏఎన్‌ఎంలు వెంట ఉండాలి. ఏజెన్సీ నిర్వాహకులు పరీక్షలు ప్రారంభించడానికి నెల రోజుల ఆలస్యం కాగా తరువాత మరో మరో సమస్య తలెత్తింది. ఒప్పందం ప్రకారం ఒక్కో విద్యార్థికి రెండుసార్లు పరీక్ష చేసినందుకు ఏజెన్సీకి రూ.47.50 పైసల చొప్పున చెల్లిస్తారు. రోజుకు ఒక్కో వాహనం ద్వారా 100 నుంచి 120 మంది పిల్లలనే పరీక్షించాలి. అంతకు మించితే నాణ్యత ఉండదని ఈ నిబంధన పెట్టారు. బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ కొద్ది రోజులకే చేతులెత్తేసింది. ఎంబీబీఎస్‌ వైద్యులకు ఇచ్చే నెలవారీ పారితోషికం రూ.15 వేలకు మించకపోవడంతో వారూ విరమించుకున్నారు. జిల్లాలో మొత్తం 5.50 లక్షల మంది పిల్లల్ని పరీక్షించాల్సి ఉండగా, అయిదు శాతం మంది పిల్లల్ని పరీక్షించాక వైద్యులు తప్పుకోవడంతో పథకం నిలిచిపోయింది. దీనిపై వైద్యశాఖ ఉన్నతాధికారులు ఏజెన్సీ నిర్వాహకునికి నోటీసు జారీ చేయడంతో వైద్యుల విషయంలో ఎదర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి వివరించారు. చివరికి ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. ఎంబీబీఎస్‌ వైద్యులు లభ్యం కాని పక్షంలో ఇద్దరు ఆయుష్‌ వైద్యులను నియమించుకోవచ్చని తెలిపారు. ఈ సడలింపు తరువాత వైద్యులను నియమించారు. కొంత మంది విశ్రాంత ప్రభుత్వ వైద్యులను విధుల్లోకి తీసుకున్నారు. దీంతో ఎట్టకేలకు పథకం మళ్లీ పట్టాలెక్కింది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21506
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author