కొనసాగుతున్న రాయబేరాలు

కొనసాగుతున్న రాయబేరాలు
December 11 15:10 2018

తెలంగాణ ఎన్నికల్లో గెలుపుపై టిఆర్‌ఎస్‌, మహాకూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు ముందుజాగ్రత్తగా ‘రాయ బేరాల’పైనా దృష్టి సారించారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు, మజ్లిస్‌ పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఈ మంతనాలు సాగుతున్నట్లు సమాచారం. టిఆర్‌ఎస్‌లోని ఒకరిద్దరు ముఖ్యనేతలతో పాటు, కూటమిలో ప్రధాన భాగస్వామియైన కాంగ్రెస్‌లోని కొందరు అగ్రనేతలు ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ఎన్నికల ప్రక్రియలో టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా మజ్లిస్‌ వ్యవహరించింది. అయితే, ఫలితాల తరువాత ఈ వైఖరి మారే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే అవసరమైతే ఆ పార్టీ నేతలతోనూ చర్చిస్తామని చెబుతున్నారు. వైరా, మక్తల్‌, ఇబ్రహీంపట్నం,బోథ్‌, నారాయణ పేట, రామగుండం స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుస్తున్నట్టు సర్వేలు తేల్చడంతో కూటమి నేతలు ఇప్పటికే వారితో సంప్రదింపులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం నుండి గెలుపు బాటలో ఉన్నట్లు భావిస్తున్న మల్‌రెడ్డి రంగారెడ్డి కి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించారు. ఆయన గెలిస్తే కచ్చితంగా కూటమిని బలపరిచే అవకాశం ఉంది. వైరా స్వతంత్ర అభ్యర్ధి రాములు నాయక్‌, రామగుండం అభ్యర్ధి కోరుకంటి చందర్‌, మక్తల్‌ అభ్యర్ధి జలంధర్‌ రెడ్డిలు కూడా కూటమికి అనుకూల వైఖరి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, పోలింగ్‌ తుది ఫలితాల వెల్లడి తరువాత కానీ, వీరి వైఖరి స్పష్టంగా వెల్లడయ్యే అవకాశం లేదు. భారీగా పెరిగిన పోలింగ్‌ శాతం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితి తమకే అనుకూలమని కాంగ్రెస్‌, టిఆరఎస్‌ నేతలు చెప్పుకుంటున్నారు. టిఆర్‌ఎస్‌కు కంచుకోటలుగా భావిస్తున్న ఉమ్మడి కరీంనగర్‌,నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో తమకే అనుకూల పవనాలు వీస్తున్నాయని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ మూడు జిల్లాలో తాము గెలిచే స్థానాలను టిఆర్‌ఎస్‌ స్పష్టంగా చెప్పలేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. టిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ శనివారం మాట్లాడుతూ వంద స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేస్తున్నామని చెప్పారు. ఎవరి సహకారం లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. గోల్కోండ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కూటమి నేతలు పోలింగ్‌ శాతం భారీగా పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21542
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author