వైసీపీకి దూరమవుతున్న సామాజిక వర్గాలు

వైసీపీకి దూరమవుతున్న సామాజిక వర్గాలు
December 12 14:00 2018

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గత ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసం ఎన్నో వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పాదయాత్ర కూడా చివరి అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగానే ఒకవైపు ప్రజలతో మమేకం అవుతూనే, మరోవైపు, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాడు. దీని తర్వాత పూర్తిగా పార్టీ కార్యక్రమాలపైనే దృష్టి సారించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టబోతున్నాడట. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే కొంత మంది అభ్యర్థులను ఎంపిక చేసుకున్న వైసీపీ అధినేత.. ఈ సారి ఎలాగైనా గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడని సమాచారం. అందుకోసం ముందు నుంచీ పార్టీలో ఉన్న వారికి కాకుండా ఆర్థిక బలం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చేసి, కొత్త వారికి అవకాశం ఇస్తున్నాడు. టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో అన్ని విధాల సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీని కలవరపాటుకు గురి చేసే పరిణామాలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపిన ముస్లిం మైనారిటీలు క్రమంగా ఆ పార్టీకి దూరమవుతున్నారు. భవిష్యత్తులో వైసీపీ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తుందన్న సంకేతాలు రావడంతో అప్పటి వరకు మెజారిటీ వైసీపీ వైపు ఉన్న మైనారిటీలు పునరాలోచనలోపడినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు టీడీపీ ప్రభుత్వం మైనారిటీల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ మధ్యనే ఆ సామాజికవర్గానికి చెందిన నేతకు మంత్రి పదవిని కూడా కట్టబెట్టింది. దీంతో వాళ్లంతా టీడీపీ వైపు మళ్లుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే పవన్‌కల్యాణ్‌కి నలుగురు పెళ్లాలంటూ… నైతికత లేదని విమర్శిస్తూ జగన్‌ పలుమార్లు చేసిన ఆరోపణలపై కాపు సామాజికవర్గంలో మెజారిటీ జనం వైసీపీపై వ్యతిరేకత పెంచుకుంటున్నారట. ఇందులో భాగంగానే వైసీపీలో ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన నాయకులపైనా ఆ పార్టీ నుంచి బయటకు రావాలన్న ఒత్తిడి రోజురోజుకీ పెరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సామాజికవర్గాల ఓటర్లు దూరమైతే ఆ పార్టీ మరింత బలహీనపడుతుందన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఇలాంటి సంఘటనల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని గ్రహించిన అధిష్ఠానం నివారణ చర్యలపై దృష్టిసారించిందని టాక్.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21604
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author