అపార్టుమెంట్లలో మినీ కంపోస్టు యార్డులు

అపార్టుమెంట్లలో మినీ కంపోస్టు యార్డులు
December 12 14:17 2018

స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 కింద మెరుగైన ర్యాంకింగ్ కోసం రాష్ట్రంలోని వివిధ నగర పాలక సంస్థలు పోటీ పడటం గృహ యజమానుల సహనానికి పరీక్షగా మారుతోంది. బిన్ రహిత విధానం పేరుతో చెత్త సేకరణలో జాప్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాజాగా అపార్టుమెంట్లలో మినీ కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయాలంటూ నోటీసులు జారీ చేయడంతో అపార్టుమెంట్‌వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్వచ్ఛ భారత్ కింద నగరాలను బిన్ రహితంగా తీర్చిదిద్దడం ఒక అంశంగా చేర్చారు. బిన్ రహితంగా తీర్చిదిద్దడం వల్ల స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్‌ల్లో మరింత మెరుగైన ర్యాంక్ పొందే వీలు ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నగర పాలక సంస్థ బిన్ రహిత నగరంగా  తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. ఈ విధంగా తీర్చిదిద్దడం నగరవాసులకు అభ్యంతరం లేదు కానీ తగిన ప్రణాళిక, సిబ్బంది లేకుండా ప్రారంభించడంతో ఇది విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా నగరంలోని అపార్టుమెంట్లలో మినీ కంపోస్టు యార్డులను ఏర్పాటు చేయాలని నోటీసులు జారీ చేసింది. అపార్టుమెంట్లలో తడి, పొడి చెత్తను వేరు చేయాల్సి ఉంటుంది. పొడి చెత్తను నగర పాలక సంస్థ సిబ్బంది సేకరించి తీసుకువెళ్తారు. కానీ తడి చెత్తను కంపోస్టుగా మార్చే ప్రక్రియ బాధ్యతను ఆయా అపార్టుమెంట్లే చేపట్టాల్సి ఉంటుంది. అపార్టుమెంట్లలోని రూఫ్‌లపై ప్రత్యేక బ్యాగ్‌లో తడి చెత్తతో మినీ కంపోస్టు యార్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నగరంలోని పలు హోటళ్లతో సహా 1000 అపార్టుమెంట్లకు ఈ మేరకు నగర పాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. దీనిపై నగర ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ర్యాంక్ కోసం అపార్టుమెంట్ వాసులను ఇబ్బందుల పాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తగినంత ప్రణాళిక, సిబ్బంది లేకపోయినా, అపార్టుమెంట్లకు నోటీసులు జారీ చేయడాన్ని తప్పుపడుతున్నారు. నగర పాలక సంస్థ తన బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నంగా ఆరోపిస్తున్నారు. ఇక బిన్ రహిత విధానంలో భాగంగా ఇండ్ల నుంచి చెత్త సేకరించి, నేరుగా కాంపాక్టు వెహికల్‌లోకి నేరుగా తరలించే ప్రక్రియ కూడా కొన్ని వార్డుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇది కూడా ప్రహసనంగా మారింది. ఇళ్ల నుంచి చెత్త సేకరించి ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి, అక్కడి నుంచి కాంపాక్ట్ వెహికల్‌లో తరలిస్తారు. ప్లాస్టిక్ డబ్బా నిండిపోయిన తరువాత, దానిని ఖాళీ చేసే వరకూ పారిశుద్ధ్య సిబ్బంది వేచి ఉండాల్సి వస్తోంది. పని వేళలు మించిపోతే, చెత్త సేకరణను నిలిపివేస్తున్నారు. దీంతో ఇళ్ల వద్దే చెత్త 2, 3 రోజుల ఉండిపోతోంది. దీనిపై కూడా ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం సిబ్బంది, సేకరణ తీరు గమనించకుండా, బిన్ రహిత విధానాన్ని అమలు చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపార్టుమెంట్లలో తయారైన ఎరువును అక్కడి వారు వాడుకోగా, మిగిలిన దానిని కోనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, దీని వల్ల ఆదాయం కూడా వస్తుందని అధికారులు చెబుతున్నారు. దశల వారీగా ఈ విధానాన్ని ఇళ్లకు వర్తింప చేసే యోచన కూడా ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకింగ్ సర్వే త్వరలో ప్రారంభం కానుండంతో అధికారులు ఈ విధానంపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని మిగిలిన నగరాల్లో కూడా ఈ విధానం అమలు చేసే యోచనలో అధికార వర్గాలు ఉన్నాయి

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21606
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author