ఉక్కు స్థలం పై తమ్ముళ్ల విబేధాలు

ఉక్కు స్థలం పై తమ్ముళ్ల విబేధాలు
December 12 14:27 2018

కడప: జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేయనున్న స్థలంపై తెలుగు తమ్ముళ్ల మధ్య పేచీ నెలకొంది. ఈనెల 27న ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడం, ఇప్పుడా ప్రకటనపై తెలుగుతమ్ముళ్లు రచ్చకెక్కడం గమనార్హం.అధికారంలో ఉన్న నాలుగున్నర ఏళ్లలో కడప ఉక్కు ఊసెత్తని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం నేతలు అకస్మాత్తుగా ఎన్నికల సంవత్సరంలో ఉక్కు నినాదాన్ని భుజాలకెత్తుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు, ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాధరెడ్డి నిరవధిక నిరాహారదీక్షకు కూర్చోవడం, ముఖ్యమంత్రి వారితో దీక్ష విరమింపచేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేస్తుందని ప్రకటించడం ప్రహసనంలా జరిగింది.కొప్పర్తి పారిశ్రామికవాడ భూములకు పక్కనే రైల్వేలైన్ ఉందని, విమానాశ్రయం కూడా పక్కనే ఉందని, నీటిని సోమశిల బ్యాక్‌వాటర్ నుండి పైప్‌లైన్ ద్వారా కానీ, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట ఎత్తు పెంచడం ద్వారా తీసుకోవచ్చని వారు మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని చెప్పినట్లు సమాచారం. తెలుగుతమ్ముళ్ల మధ్య తలెత్తిన ఈ వివాదాన్ని ఆసరా చేసుకుని, చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప జిల్లాలో కాకుండా అనంతపురం జిల్లాలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని ఒకవర్గం భావిస్తోంది. అసలు అందుకోసమే తెలుగుతమ్ముళ్లు వివాదాస్పదం చేస్తున్నారా అన్న సందేహాన్ని జనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రచ్చలు, వివాదాలు చూస్తే అసలు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు తొలినుంచి మైలవరం మండలం కంబాలదినె్న గ్రామ పరిధిలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. కేంద్రానికి ఈ భూములనే సమర్పించారు. వీటిని కేంద్ర ఉక్కుపరిశ్రమ తిరస్కరించింది. అయినా వీరు అదే భూముల్లో ముఖ్యమంత్రితో ఈనెల 27న శంకుస్థాపన చేయించబోతున్నారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే ఉక్కు పరిశ్రమ నిర్మించే చిత్తశుద్ది ఎవరికీ లేదని, కేవలం ఎన్నికల సందర్భంలో రాజకీయ అవసరాల కోసం చేస్తున్న తంతేనని స్పష్టమవుతోంది.కడప నగరం సమీపంలో, వైఎస్ హయాంలోనే ఏపీఐఐసీ సేకరించిన దాదాపు 8 వేల ఎకరాలు సిద్ధంగా ఉంది. ఇక్కడ పరిశ్రమ నిర్మించేందుకు మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు ఉన్న అభ్యంతరాలేమిటో కాని, ఇప్పుడు తెలుగుతమ్ముళ్ల మధ్య అదే చిచ్చుపెడుతోంది. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్ వెళ్లిపోయిన తర్వాత రాత్రి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వద్ద తెలుగుదేశం నేతలు ఇదే పంచాయతీ పెట్టారని విశ్వసనీయ సమాచారం. అన్నీ జమ్మలమడుగుకేనా, పరిశ్రమలు, పదవులు అన్నీ వాళ్లకేనా అంటూ జిల్లాలోని తక్కిన నియోజకవర్గం నేతలు వ్యతిరేకించినట్లు సమాచారం. కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయిస్తే జిల్లా కేంద్రమైన కడప అభివృద్ధి చెందితే జిల్లా ప్రజలకు, జిల్లా నాయకులందరికీ ప్రాతినిధ్యం ఉంటుందని, జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒక మూల నిర్మించడానికి తామంతా వ్యతిరేకమని తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కంబాలదిన్నె భూములకు, మైలవరం డ్యామ్ నీళ్ల సదుపాయం ఉందనే ఒకే ఒక్క అనుకూలత తప్ప అన్నీ ప్రతి కూలాలే ఉన్నాయని వివరించినట్లు సమాచారం.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21609
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author