సోషల్ ఆడిట్ లో వెలుగులోకి పౌర సేవల అక్రమాలు

సోషల్ ఆడిట్ లో వెలుగులోకి పౌర సేవల అక్రమాలు
December 13 12:34 2018

పల్నాడు ప్రాంతంలో రేషన్‌ మాఫియా రాజ్యమేలుతోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో చౌక దుకాణాలు నడుస్తున్నాయి. డ్వాక్రా గ్రూపు మహిళలను తాత్కాలిక డీలర్లుగా నియమించుకొని, రేషన్‌ దందా సాగిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2802 రేషన్‌ దుకాణా లున్నాయి. తెల్ల రేషన్‌ కార్డులు 14,89,722 ఉన్నాయి. వీటికి సంబంధించి 22,075 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో 30 శాతంకు పైగా  రేషన్‌ బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ప్రధానంగా పల్నాడు ప్రాంతం, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇలాకా అయిన చిలకలూరిపేట నియోజకవర్గం, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో రేషన్‌ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండా పోయింది.  జిల్లా వ్యాప్తంగా 310 రేషన్‌ డీలర్ల ఖాళీలున్నాయి. డ్వాక్రా మహిళలను తాత్కాలికంగా నియమించుకొని, అధికార పార్టీ నేతలే పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇందులో గుంటూరు డివిజన్‌లో 26, తెనాలి డివిజన్‌లో 36, నరసరావుపేట డివిజన్‌లో 238, గురజాల 10 రేషన్‌ షాపులకు సంబంధించి డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  శాశ్వతంగా డీలర్ల పోస్టుల భర్తీని అధికార పార్టీ నేతలు అడ్డుకుంటూ ఉండటంతో, అధికారులు సైతం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రధానంగా రేషన్‌ బియ్యం రోజు జిల్లాలో ఎక్కడోచోట పట్టుబడుతూనే ఉన్నాయి.  చిలకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో రేషన్‌ మాఫియా భారీగా డంప్‌లు ఏర్పాటు  చేసుకొని ఇతర రాష్ట్రాలతో పాటు, కృష్ణపట్నం, కాకినాడ ఓడరేపుల ద్వారా భారీగా తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇందులో భాగస్వాములు కావడంతో, అధికారులు సైతం ఏమీ చేయలేక చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి నెలకొంది. మాచర్ల నిమోజకవర్గంలో సోమవారం 400 అనధికార రేషన్‌ బియ్యం బస్తాలను సీజ్‌ చేయడం గమనార్హం. చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడుకు చెందిన ఓ అధికార పార్టీ నేత మానుకొండువారిపాలెంలో రైస్‌మిల్లును అద్దెకు తీసుకుని దాన్నే గోడౌన్‌గా మార్చి రేషన్‌ బియ్యాన్ని నిలువ చేస్తున్నట్టు ఇటీవల అధికారుల దాడుల్లో కనుగొన్నారు. జనవరిలో  ప్రభుత్వం రొంపిచర్ల, మాచవరం, నకరికల్లు, ముప్పాళ, ఈపూరు మండలాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో 179 రేషన్‌ దుకాణాల్లో  పలు అవకతవలు జరిగినట్టు గుర్తించారు. పౌర సరఫరాల ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ సైతం ఈఏడాది ఫిబ్రవరి నెలలో గుంటూరులో జరిగిన వర్క్‌షాపులో రేషన్‌ వ్యవస్థ గాడి తప్పిందని, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీ డీలర్ల స్థానంలో వెంటనే డీలర్లలను నియమించాలని ఆదేశించారు.  సామాజిక తనిఖీల్లో భాగంగా   ఈపూరు మండలంలో 7, రొంపిచర్ల 22, నకరికల్లు 12, ముప్పాళ్ల 8, మాచవరం మండలంలో 22, షాపుల్లో  ఈ–పాస్‌లో ఉన్న డీలర్‌  పేరుతో కాకుండా బినామీ వ్యక్తులు షాపులను నడుపుతున్నట్టు నిర్ధారించారు. ప్రధానంగా వీరు ప్రజలకు బియ్యం ఇవ్వకుండా  స్వాహా చేస్తున్నట్లు గుర్తించారు.తూకాల్లో తేడాలు, చనిపోయిన వారి బియ్యం, వలసలు వెళ్లిన వారి పేర్లతో  రేషన్‌ బియ్యం కాజేస్తున్నట్లు తేలింది. పల్నాడు మొత్తం ఇదే తీరు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21656
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author