రైతుబంధు కోసం నిరీక్షణ

రైతుబంధు కోసం నిరీక్షణ
December 15 11:44 2018

వ్యవసాయం ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. రైతులు ఆరుగాలం శ్రమిస్తున్నా చివరికి చేతికందే మొత్తం మాత్రం కొద్దిగానే ఉంటోంది. ఈ కష్టాల నుంచి రైతులను కొంతైనా ఆదుకోవాలన్న తపనతో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలుచేస్తోంది. ఈ స్కీమ్ లో భాగంగా ఎకరానికి రూ.4వేలు చొప్పున అందిస్తోంది. ఇప్పటికే ఖరీఫ్ తో పాటూ రబీకి చెందిన ఆర్ధిక చేయూత రైతులకు అదించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. పలువురు అన్నదాతలకు రైతుబంధు సొమ్ము చేతికి రాలేదన్న కామెంట్స్ నల్గొండలో వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఖరీఫ్ సీజన్ లోనే కొందరికి చెక్కులు అందలేదు. రబీనాటికి ఈ సమస్య పరిష్కృతమవుతుందనుకున్నా ఫలితం లేకుండా ఉందని పలువురు అంటున్నారు. రైతులకు పెట్టుబడి సొమ్మును నగదు రూపంలో కాకుండా చెక్కు రూపంలో అందిస్తే అభ్యంతరం లేదని అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ సూచన మేరకు ప్రభుత్వం కూడా చెక్కుల రూపంలో కాకుండా కర్షకుల బ్యాంకు ఖాతాల్లో నిర్దేశిత డబ్బు జమచేసింది. అయితే పలువురు రైతులకు మాత్రం సొమ్ము అందలేదు. కర్షకుల ఖాతాల్లో డబ్బు జమచేసే కార్యక్రమం మొదలై రెండు నెలలు అవుతోంది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఈ పథకం రైతులందరికీ చేరకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.రైతుబంధు పథకంలో భాగంగా అన్నదాతలందరికీ ఖరీఫ్‌ సీజన్‌లో ఎకరాకు రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని సర్కార్ అందించింది. నల్గొండలో 3,64,463 మంది రైతులు రైతుబంధుకు అర్హులు. అయితే ఇప్పటివరకూ 1.77లక్షల మందికిపైగా రైతులకే చెక్కులు అందినట్లు సమాచారం. జిల్లాలో మొదటివిడత దాదాపు రూ.415 కోట్ల నగదును పంపిణీ చేశారు. రెండోవిడతలోనూ ఇంతే మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలి. అయితే ఈ మొత్తంలో ప్రస్తుతం సగభాగమే పంపిణీ అయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.207 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ చేసినట్లుగా సమాచారం. తెలంగాణలో అత్యధిక రైతులు వ్యవసాయ పనుల కోసం రుణాలపైనే ఆధారపడుతున్నారు. బ్యాంకు లోన్స్ లభిస్తే సరేసరి. లేదంటే అధిక వడ్డీలకు అప్పులే చేసి సాగు పనులు చేస్తున్నారు. దీంతో అన్నదాతలకు అండగా ఉండే నిమిత్తం తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం అందించే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతులందరికీ  ఆర్ధిక చేయూతనిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా పలువురు రైతులకు ఇప్పటికీ ఈ పథకం ద్వారా సొమ్ము అందకపోవడంపై రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత విభాగం సత్వరమే స్పందించి రైతులందరికీ రైతుబంధు ద్వారా ఆర్ధిక సహకారం లభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21764
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author