కోస్తా తీరంలో హై అలెర్ట్ విశాఖపట్టణం,

కోస్తా తీరంలో హై అలెర్ట్ విశాఖపట్టణం,
December 15 12:54 2018

రాష్ట్రానికి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా మారి రానున్న 3, 4 రోజుల్లో రాష్ట్రం వైపుగానే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. శుక్రవారం రాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మచిలీపట్నానికి 1250 కి.మీ, చెన్నైకి 1080కి.మీ, ట్రింకోమలీ (శ్రీలంక)కి 780కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తీవ్రంగా మారి శుక్ర, శనివారాల్లో తుపానుగా మారనుందని అంచనా. ఆ తర్వాత 3 రోజుల్లోపు వాయువ్యదిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇప్పుడున్న అంచనాల ప్రకారం గంటకు 100కి.మీ నుంచి 120కి.మీ వరకు గాలులు వీచనున్నాయి. పలు అంతర్జాతీయ వాతావరణ వెబ్‌సైట్లు ఇప్పటిదాకా వేస్తున్న అంచనాల ప్రకారం మచిలీపట్నం, అమలాపురం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉంది. మరో వైపు ఇది ఎక్కడ తీరాన్ని తాకుతుందనేది ఇంకా ఐఎండీ స్పష్టం చేయలేదు. ఈ తీవ్రవాయుగుండం, తుపాను ప్రభావాలతో  కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, 16వ తేదీ ఈ నాలుగు జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లో, 17వ తేదీ కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు పలుచోట్ల నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలను సిద్ధం చేసింది.ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ తెలియజేసింది. తీసుకోవాల్సిన చర్యలపై శాఖల వారీగా సమాచారం అందించినట్లు విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌ తెలిపారు. ఈ నెల 13 నుంచి 16 దాకా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాల్లోని మత్స్యకారులు వెళ్లకూడదు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు సూచనలు చేశారు. తుపాను వచ్చే జిల్లాల్లో ఎం.ఎల్‌.ఎస్‌. కేంద్రాల వద్ద నిత్యావసర సరుకులను సిద్ధం చేసి ఉంచుతున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే రేషన్‌ డీలర్లు వాటిని తక్షణమే పంపిణీ చేయడానికి వీలుగా చర్యలు చేపట్టారు. విద్యుత్తు వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంధనశాఖ మంత్రి కళా వెంకట్రావు ఆదేశించారు. సరఫరాలో అంతరాయం ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21781
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author