పవన్, జగన్ కు గులాబీ మద్దతు..?

పవన్, జగన్ కు గులాబీ మద్దతు..?
December 17 16:25 2018

తెలంగాణలో పాగావేసిన టీఆర్ఎస్ పార్టీ.. అదే ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ తన ఉనికి చాటాలని ప్రయత్నిస్తోంది. రిటర్న్ గిఫ్ట్‌గా చంద్రబాబును సీఎం పదవి నుంచి దింపాలని చూస్తోంది. అయితే, 
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఆరు నెలలే సమయం ఉన్న నేపథ్యంలో కొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో కలిసి ప్రజాకూటమిగా 
ఏర్పడటాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారంటూ మండిపడుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీని టార్గెట్ చేసుకున్నారు. ఏపీలో 2019 ఎన్నికల్లో 
జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్, జగన్‌లకు మద్దతు ప్రకటించాలని భావిస్తోంది. ఏపీలో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉంటే.. వైఎస్సార్‌సీపీ, జనసేనల పొత్తుకు మధ్యవర్తిత్వం వహించాలనే ఆలోచనలో 
టీఆర్ఎస్ ఉంది. ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీ గెలవాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేరుగా ఏపీలో పోటీ చేయకున్నా.. ఏదైనా ప్రాంతీయ పార్టీకి మద్దతు 
ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో వైరం పెంచుకున్న టీఆర్ఎస్.. ఆ పార్టీకి ప్రధాన శత్రువైన వైఎస్సార్‌సీపీతో జట్టు కట్టాలని భావిస్తోంది. ఈ మేరకు సానుకూల సంకేతాలను 
పంపుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ కూడా టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వీరి స్నేహం దాదాపు ఖారారైనట్లే. వైఎస్సార్‌సీపీతోనే కాకుండా పవన్ కళ్యాణ్ స్థాపించిన 
‘జనసేన’ పార్టీతో కూడా టీఆర్ఎస్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. పైగా, ఈ రెండు పార్టీలు తెలంగాణలో ఒక్కరిని కూడా పోటీకి నిలపకపోవడం కూడా టీఆర్ఎస్‌కు కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో 
టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలని భావిస్తోంది. కేటీఆర్ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. టీఆర్ఎస్ నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఒక వేళ 
చేయాలన్నా.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో నేరుగా ఎన్నికల్లో పోటీ చేయడం రిస్క్‌తో కూడుకున్నదని టీఆర్ఎస్ భావన. దీంతో వైఎస్సార్‌సీపీ, జనసేనలతో దోస్తీనే 
బెటర్ అని భావిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌తో పాటు ఇతర రాష్ట్రాల ప్రాంతీయ 
పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కూడా ఇవే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను కలిసి ప్రత్యేకంగా ఒక కూటమిని ఏర్పాటు 
చేయనున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌తో కలిసి ఏపీలో పర్యటించనున్నట్లు తెలిసింది. కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే జాతీయ పార్టీని బలోపేతం చేయాలంటే.. 
ఏపీలోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా అవసరం. అయితే, టీడీపీ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీతో జట్టు కట్టడం కుదరదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ, జనసేన పార్టీలను గెలిపించడమే టీఆర్ఎస్ 
ముందున్న లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రధాన కారణం కేసీఆర్. ఉద్యమ సమయంలో ఆయన సీమాంధ్రులపై ఎన్నో ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటుతో అతలాకుతలం కావడానికి 
ప్రధాన కారణం కేసీఆర్ అనే భావన సీమాంధ్రుల్లో ఉంది. అలాగే, ఏపీకి ప్రత్యేక హోదాను కూడా టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. నదీ జలాల విషయంలోనూ ఏపీతో వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 
టీఆర్ఎస్‌ మద్దతు ఇచ్చే పార్టీలకు ఓటేసేందుకు ఏపీ ప్రజలు ఒప్పుకుంటారా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఏపీని విభజించిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం పైనా సీమాంధ్రలో 
వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లి.. టీడీపీని పిల్ల కాంగ్రెస్‌గా అభివర్ణిస్తోంది. తెలంగాణలో టీడీపీ-కాంగ్రెస్‌ల పొత్తు బెడిసికొట్టిన నేపథ్యంలో ఏపీలో 
టీడీపీ ఒంటరిగానే పోరాడే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు వహించిన కేటీఆర్ ఏపీ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 
నేపథ్యంలో ఆయన పూర్తిగా పార్టీకే సేవలు అందించే అవకాశాలు ఉన్నాయని, మంత్రి మండలిలో ఆయనకు స్థానం దక్కకపోవచ్చని తెలుస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 
మొత్తం స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ పనిచేయనుంది. అలాగే, ఏపీ నుంచి కూడా తమకు అనుకూలంగా ఉండే పార్టీ నేతలను గెలిపించుకునే ప్రయత్నం చేయనుంది. దీనివల్ల 
కేసీఆర్ జాతీయ పార్టీకి.. తెలుగు రాష్ట్రాల నుంచి బలం లభిస్తుంది. రానున్న ఐదారు నెలలపాటు కేటీఆర్‌ పూర్తిగా పార్టీ కార్యకలాపాలు, ఎన్నికలకే పరిమితం కానున్నారని తెలుస్తోంది. మరి, వీరి 
వ్యూహం ఏపీలో ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21908
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author