రాహుల్ కు పెరుగుతున్న మద్దతు

రాహుల్ కు పెరుగుతున్న మద్దతు
December 18 15:27 2018

రాజకీయాల్లో హీరోలు, జీరోలుగా..జీరోలు హీరోలుగా మారిపోతుంటారు. ప్రతి ఎన్నికకూ అదృష్టం తారుమారవుతుంటుంది. మాయలు,మంత్రాలు , టక్కుటమార విద్యలు ఎన్ని చేసినా పరవాలేదు, అంతిమంగా విజయం సాధించేవాడే నాయకునిగా నిలబడతాడు. థర్డ్ ఫ్రంట్, సెక్యులర్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ పేరిట ఎవరెంత హడావిడి చేసినా దేశ రాజకీయ చిత్రం సుస్పష్టం. 2019లో రాహుల్ , మోడీ ల నేత్రుత్వంలోని కూటములే ముఖాముఖి తలపడబోతున్నాయి. మిత్రపక్షాలను చిన్న చూపు చూస్తూ ఆటలో అరటిపండుగా భావిస్తోంది బీజేపీ అని ఇప్పటికే ముద్ర పడిపోయింది. అందులోనూ మోడీ పెద్దగా పట్టించుకోరని మిత్రపక్షనేతలు వాపోతుంటారు. అమిత్ షా రాజకీయ చాణక్యం ప్రదర్శించినప్పటికీ అది అవసరార్థమే అన్న సంగతి అందరికీ తెలుసు.అందుకే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ తాను తీసుకునే ప్రతినిర్ణయమూ రాజకీయమే అని కొన్ని దశాబ్దాల క్రితమే తేల్చి చెప్పేశారు. భారత రాజకీయాల్లో నెహ్రూ గాంధీ కుటుంబాన్ని ప్రథమ కుటుంబంగా చెబుతుంటారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించింది వీరే కాబట్టి ఆ ముద్ర స్థిరపడిపోయింది. కాంగ్రెసు పార్టీకి, ఆ కుటుంబానికి వారసుడైన రాహుల్ గాంధీ సామర్ధ్యంపై తొలి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే వచ్చారు. 2013 నుంచి పార్టీని ఆయనే నడుపుతూ వచ్చారని చెప్పుకోవాలి. సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ రాహుల్ ఉపాధ్యక్షునిగా బాద్యతలు స్వీకరించిన దగ్గర్నుంచి కీలక నిర్ణయాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అందుకే సాఫల్యవైఫల్యాలన్ని ఆయన కాతాలోనే జమ అవుతూ వస్తున్నాయి.ఏడాది క్రితం డిసెంబరు నెలలోనే రాహుల్ పార్టీ అధ్యక్షునిగా పూర్తి బాధ్యతలు అధికారికంగా స్వీకరించారు. అంతకుముందు నాలుగేళ్లు పార్టీ పరంగా ప్రతి నిర్ణయంలోనూ తన పాత్ర ఉన్నప్పటికీ తల్లిచాటు చెలాయింపుగానే చెప్పుకోవాలి. అంతిమంగా సోనియా ఆమోదం అనే లాంఛనం ఉంటుండేది. 2004, 2009 ఎన్నికల్లో విజయాలు పార్టీ అధ్యక్షురాలిగా సోనియా సాధించినవిగా చెప్పుకోవాలి. 2012 నాటికి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రాహుల్ ఆమె తరఫున నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అందుకే 2014 పరాజయం ఆయన కాతాలోనే పడింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మోడీ ప్రచారంతో బీజేపీ సాధిస్తూ వచ్చిన విజయాలతో కాంగ్రెసు పార్టీ కళ తప్పిపోయింది. రాహుల్ సౌమ్యంగా వ్యవహరించే ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన నేత. బీజేపీని నియంత్రిస్తున్న మోడీ, అమిత్ షాలు తాము అనుకున్నది సాధించేందుకు ఎంత కర్కశంగా అయినా వ్యవహరించేందుకు వెనకాడరు. ఈ విరుద్ధ ధోరణులను పోల్చి చెబుతూ మోడీ ముందు రాహుల్ వీగిపోతున్నారనే ముద్ర పడిపోయింది. ప్రధానంగా పార్టీలోనే ఆయన నాయకత్వంపై అనుమానాలు తలెత్తాయి. రాష్ట్రాల్లో అనేక చోట్ల ఓటమి పాలవ్వడంతో రాహుల్ పై ఐరన్ లెగ్ అనే బ్రాండ్ కూడా వేసేశారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం గుజరాత్ ఎన్నికలు మొదలు ఈ ఏడాది కర్ణాటక ఎన్నికల వరకూ అగ్రెసివ్ నెస్ ను పార్టీలో ప్రవేశపెట్టారు. దీంతో ఫైటింగ్ స్పిరిట్ తో పార్టీకి కొత్త దిశ అందించే ప్రయత్నాలు ప్రారంభించారు.గుజరాత్ లో రాహుల్ గాందీ మోడీ, అమిత్ షా లకు చుక్కలు చూపించగలిగారు. సామాజిక సమీకరణలు అన్నీ సరిచేసుకుని చక్కని వ్యూహకర్తగా వ్యవహరించారు. మతపరమైన మద్దతుతోపాటు సంఘ్ పరివార్ బాగా పాతుకుపోయిన గుజరాత్ లో ప్రధాని సొంత ప్రతిష్ఠను పణంగా పెట్టి పోరాడాల్సి వచ్చింది. అక్కడ దీర్ఘకాలంగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెసు శ్రేణులన్నీ నిర్వీర్యం అయిపోయాయి. అయినా రాహుల్ చాకచక్యంగా రాజకీయాలను మలుపుతిప్పగలిగారు. కాంగ్రెసుపై హిందూ వ్యతిరేక ముద్రతో నెట్టుకువస్తున్న బీజేపీకి చెక్ పెట్టగలిగారు. టెంపుల్ రన్ చేస్తున్నాడనే ప్రత్యర్థుల విమర్శలు పక్కనపెడితే తాను హిందూ మతానికి చెందినవాడినే అని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఆలయాల సందర్శనతో మెజార్టీ మతానికి కాంగ్రెసు వ్యతిరేకం కాదనే భావనను ప్రజల్లోకి పంపగలిగారు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయింది బీజేపీ విజయం. తాజాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ విజయాలు కాంగ్రెసు పార్టీకి మంచి ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. కర్ణాటకలో లభించిన పాక్షిక విజయాన్ని ఈ రాష్ట్రాలు స్థిరపరిచాయనే చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టగలగడం కాంగ్రెసుకు శుభపరిణామమే. రానున్న సార్వత్రికంలో ఎవరు మిత్రపక్షాలను గౌరవంగా చూసుకుని పెద్దపీట వేస్తారో వారి వైపు తటస్థ రాజకీయపార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈవిషయంలో రాహుల్ గాంధీకే మార్కులు పడతాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. మోడీ, అమిత్ షా ధోరణితో విసుగెత్తిపోయిన ఎన్డీఏ పార్టీలు కూడా కొన్ని కాంగ్రెసు నాయకత్వానికి జై కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22001
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author