ఈ తిండి తినలేం..

ఈ తిండి తినలేం..
December 24 14:06 2018

 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని నవ ప్రయాస సంస్థకు అప్పగించి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సమయానికి భోజనం రావడం లేదు. విద్యార్థులకు ఆకలి కేకలు తప్పడం లేదు. ఫలితంగా విద్యార్థులు తరగతులకు సకాలంలో హాజరు కాలేకపోతున్నారు. విజయనగరం పట్టణంలోని పలు మున్సిపల్‌ పాఠశాలలకు మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన భోజనం రెండు గంటల వరకు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.మధ్యాహ్న భోజన పథకం అమల్లో నూతన విధానానికి ఆదిలోనే  ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించటంలో   నవ ప్రయాస సంస్థ ప్రతినిధులతో పాటు, విద్యాశాఖ అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ఈ పథకం ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ లోపాలను సవరించుకోలేకపోతున్నారు. సాధారణంగా  మున్సిపల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు 12.30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనాన్ని వడ్డించేవారు. ఈ ప్రక్రియను పాఠశాలల వారీగా నియమించిన నిర్వాహకులే చేపట్టేవారు. వారు ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించేవారు. వారం రోజుల నుంచి  ఈ బాధ్యతలను నవ ప్రయాస సంస్థకు అప్పగించినప్పటి నుంచి విద్యార్థులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం నిర్ణీత సమయానికి రావాల్సిన భోజనం  2.10 గంటలకు  పాఠశాలలకు రావటంతో విద్యార్థులు ఖాళీ కంచాలు పట్టుకుని ఆకలితో అవస్థలు పడ్డారు. మధ్యాహ్న భోజనం ఎప్పుడు వస్తుందా! అంటూ ఎదురు చూశారు. చివరికి 2.10 గంటలకు భోజనం పాఠశాలలకు చేరుకోగా… కేవలం ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు మాత్రమే  తరగతులు మానుకుని భోజనం చేయగా.. ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇంటిముఖం పట్టారు. ఇలా మున్సిపల్‌ కస్పా ఉన్నత పాఠశాలకు చెందిన 1200 మంది విద్యార్థులతో పాటు రాధాస్వామి మున్సిపల్‌ పాఠశాల, కస్పా కాలేజ్, మున్సిపల్‌ ఉర్ధూ స్కూల్, అరిచెట్ల స్కూల్‌కు చెందిన విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. చదువులు సైతం సక్రమంగా సాగని పరిస్థితి నెలకొంది. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయానికి పలు పాఠశాలలకు భోజనం చేరకపోగా… తిరిగి తరగతులు పునఃప్రారంభ సమయానికి చేరుకోవటంతో విద్యార్థులు తరగతులు మానుకుని భోజనం చేయాల్సి వచ్చింది. దీంతో చదువులు సక్రమంగా సాగటం లేదని, మరి కొద్ది రోజుల్లో జరగనున్న పది పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు పరిస్థితి  ఆందోళనకరంగా మారిందని  విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు.మధ్యాహ్న భోజన పథకం అమల్లో  నవ ప్రయాస సంస్థకు చెందిన ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న అపవాదను ఆదిలోనే మూటగట్టుకుంటున్నారు. వాస్తవానికి ఈ సంస్థ విద్యాశాఖతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు  నెల్లిమర్ల  మండల కేంద్రం నుంచి  విజయనగరం పట్టణంలోని విద్యార్థులకు   మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయనున్నారు. ఇందుకు నవ ప్రయాస అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ కేవలం విజయనగరమే కాకుండా  నెల్లిమర్ల, డెంకాడ మండలాల పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయనుంది. నెల్లిమర్ల మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి వాహనాల ద్వారా  ఆహారాన్ని  పాఠశాలల వారీగా సరఫరా చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా   నూతన వి«ధానం అమల్లో నవ ప్రయాస సంస్థ ప్రతినిధులు మొదటి రోజే తడబాటుకు గురయ్యారు.  పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమర్ల నుంచి భోజనాన్ని తరలించే సమయంలో ఎటువంటి ఆటంకాలు  తలెత్తినా  ఆ రోజు విద్యార్థులు పస్తులు తప్పవన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22218
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author