ఆలస్యమవుతున్న రబీ సాగు

ఆలస్యమవుతున్న రబీ సాగు
December 24 15:17 2018

జగిత్యాల జిల్లాలో రబీ సాగు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు స్థానిక రైతులు అంటున్నారు. సాగునీటి సమస్యల వల్లే ఈ పరిస్థితి ఎదురైనట్లు చెప్తున్నారు. అక్టోబర్ లోనే రబీ సీజన్ మొదలైనా జిల్లాలో పూర్తిస్థాయిలో సాగు పనులు జరగలేదని అంటున్నారు. ప్రస్తుతం డిసెంబర్ వచ్చినా చాలా ప్రాంతాల్లో రైతులు సాగుకు సాహసించడంలేదు. సాగునీటికి తీవ్ర కొరత ఏర్పడితే పెట్టుబడి ఖర్చులు కూడా దక్కవన్న భావనతో కొందరు రైతులు రబీ పంటలకు దూరంగా ఉన్నారు. జిల్లాలో సాగు స్థితిగతులు పరిశీలిస్తే అక్టోబరు నుంచి ఇప్పటివరకు 7.51 శాతం వ్యవసాయ భూముల్లోనే పంటలు వేశారు. అంటే రబీ సాగు ఎంత ఆలస్యమవుతోందో ఈజీగానే అర్ధం చేసుకోవచ్చు. సాగునీటి సమస్యలతో పాటూ ఖరీఫ్‌ కోతలు, పంట విక్రయంలో జాప్యం కూడా రబీ పంటల సాగును ప్రభావితం చేసినట్లు రైతులు చెప్తున్నారు. జిల్లావ్యాప్తంగా సాగునీటికి సమస్యలేదు. కొన్నిప్రాంతాల్లో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఖరీఫ్ పంట చేతికి రావడం ఆలస్యమవడం, సాగు పెట్టుబడికి అవసరమైన సొమ్ము సమకూర్చుకోవడంలో సమస్యలు రబీపై ఎఫెక్ట్ చూపాయి. ఈ ఏడాది వర్షాకాలంలో వర్షపాతం ఆశాజనకంగానే ఉంది. వర్షాలు రెగ్యులర్ గా లేకపోయినా వర్షపాతం సాధారణంగానే నమోదైంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో భూగర్భజలమట్టాలు పెరిగాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో నీటికి సమస్యలేదు. బోర్ల ద్వారా సాగునీరు దక్కించుకునే అవకాశం ఏర్పడింది. దీంతో నీటి సరఫరాకు ఇబ్బందుల్లేని ప్రాంతాల్లో రైతులు పంటలు వేశారు. జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి పంటలను వేసుకుంటున్నారు రైతులు. ఇప్పటికే పలువురు వరి నాట్లు వేస్తున్నారు. జనవరి వరకు నాట్లతో పాటుగా ఇతర పంటలను వేయనున్నారు. కాలువనీటి ఆధారితంగా ప్రస్తుతం ఎలాంటి పంటలను వేయవద్దని, ఆరుతడికి మాత్రమే నాలుగు తడులకు అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అధికారుల సూచనలకు తగ్గట్లుగానే రైతులు పైర్లను విత్తుకుంటున్నారు. ఈ రబీలో అన్నిరకాల పంటలను 69,666 హెక్టార్లలో పండిస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు 5,235 హెక్టార్లలోనే పంటలు వేశారు. వరి, మొక్కజొన్న, నువ్వులు ప్రధాన పంటలుగా పండించనున్నారు. ఇదిలాఉంటే వ్యవసాయశాఖ ద్వారా వేరుసెనగ, మొక్కజొన్న, కంది తదితర పంటలకు రాయితీ ఇస్తున్నారు. జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా వరి విత్తనాలకు పరిమిత స్థాయిలో సబ్సిడీ అందుతోంది. గత పంటకాలాల్లో విత్తన కంపెనీల చేతిలో నష్టపోయి రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో  అధికారులు ముందస్తు రాతపూర్వక ఒప్పందాలతోనే ఆయా పంటలు సాగుచేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అన్నదాతలు సూచిస్తున్నారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22227
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author