ఆంక్షల మధ్యే న్యూ ఇయర్

ఆంక్షల మధ్యే న్యూ ఇయర్
December 25 13:41 2018

పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు నజర్ వేశారు. వేడుకల సందర్భంగా రెచ్చిపోయే యువత వేగానికి బ్రేకులు వేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.నగరంలోని మూడు కమిషనరేట్స్ పరిధిలో వేడుకలు జోష్‌గా జరిగే అవకాశం ఉండటంతో ఉన్నతాధికారులు అన్ని పోలీస్‌స్టేషన్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వేడుకల్లో శృతిమించి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎలా పాటించాలనే దానిపై సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్, సివిల్ పోలీసులతో పాటు ఇతర విభాగాలకు చెందిన పోలీస్ బలగాలను రంగంలోకి దింపారు. పోలీస్‌స్టేషన్ల వారీగా ఏఏ ప్రాంతాల్లో వేడుకలు జరుగుతున్నాయి. వాటికి ఎంత మంది హాజరయ్యే అవకాశం ఉంది.. అక్కడ నిర్వహించే కార్యక్రమాల వివరాలను పూర్తిగా సేకరిస్తున్నారు. వేడుకల సందర్భంగా నిషిదిత మాదకద్రవ్యాలు వాడే అవకాశం ఉండటంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా నిషిదిత మాధకద్రవ్యాలు సప్లై చేయడం, వాడటం వంటివి గుర్తిసే కఠిన చట్టాల క్రింద కేసులు నమోదు చేయనున్నారు. మత్తెక్కించే మద్యం, శరీరం మొత్తం షేక్ చేసే మ్యూజిక్‌ల నడుమ యువత వేడకల్లో శృతిమించితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం వేడుకలు రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. డీజే సౌండ్స్‌తో ఇతరులకు ఇబ్బందులు కలిగించే పనులు చేయరాదు. శబ్దం 45 డెసిబుల్స్ దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడం నిషేదం. వేడుకల ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు వీడియోలు చిత్రీకరించి వాటిని 1, 2తేదీల్లోపు కమిషనరేట్స్‌లో అప్పగించాలి. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా నిర్వాహకులే బాధ్యులు అవుతారని దీనిని దృష్టిలో ఉంచుకొని వేడుకలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.వేడుకలు విషాదాలను మిగల్చకుండా నగరంలోని అన్ని రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. చిత్తుగా తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. అనంతరం వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతారు. వారు సేవించిన మోతాదును బట్టి న్యాయమూర్తి శిక్ష విధిస్తారు.న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలోని పలు ఫ్లై ఓవర్లపై పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. ఫ్లైఓవర్లపై ప్రయాణిస్తూ బాటిల్స్, ఇతర పదార్ధాలు విసరడం వంటివి చోటుచేసుకోకుండా ఈ అంక్షలు విధిస్తున్నారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు 31న రాత్రి నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు కొనసాగుతాయి. వీటితో పాటు ప్రతీ చౌరస్తాలో పోలీస్ పికెటింగ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తారు. కాలనీలు, బస్తీల్లో వేడుకల్లో అపశృతులు జరగకుండా బీట్ కానిస్టేబుల్స్, పెట్రోలింగ్ వాహనాలు గస్తీ నిర్వహించనున్నాయి. బస్తీలు, కాలనీల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పార్టీలు నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొంటున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22276
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author