పార్లమెంట్ స్థానాలపై వైసీపీ గురి

పార్లమెంట్ స్థానాలపై వైసీపీ గురి
December 26 13:45 2018

వైసీపీ అధినేత జగన్ పార్లమెంటు సభ్యుల ఎంపికపైనే ప్రత్యేక దృష్టిపెట్టినట్లు కన్పిస్తోంది. మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో అన్ని రకాలుగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను జగన్ ఖరారు చేశారని చెబుతున్నారు. ఎక్కువ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికను ఇప్పటి వరకూ చేయలేదు. దీంతో ముందగా పార్లమెంటు సభ్యుల పేర్లను ఖరారు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్న జగన్ నియోజకవర్గాల వారీగా పేర్లను సిద్ధం చేసేందుకు ఒక ప్రత్యేక టీమ్ పనిచేస్తుందంటున్నారు. పార్లమెంటు అభ్యర్థులు ముందుగా ఖరారు చేస్తే తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుత పార్లమెంటు సభ్యులలో కొందరికి టిక్కెట్ ఇవ్వడం లేదని ఆయన ఇప్పటికే పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. కడప, తిరుపతి, నెల్లూరు, రాజంపేట, ఒంగోలు పార్లమెంటు సభ్యులు ఇటీవలే ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీరిలో ఇద్దరికి ఛాన్స్ ఈసారి ఉండదన్నారు. మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో మూడు చోట్ల తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ ఏడుగురు అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది.రాజంపేట నుంచి మిధున్ రెడ్డి, తిరుపతి నుంచి వరప్రసాద్, నెల్లూరు నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారయినట్లే. వీరితో పాటుగా విశాఖ పార్లమెంటుకు ఎంవీవీ సత్యనారాయణను, ఏలూరు పార్లమెంటుకు కోటగిరి శ్రీధర్ ను, అమలాపురం నియోజకవర్గం నుంచి చింతా చంద్రావతి పేర్లను కూడా కన్ఫర్మ్ చేశారని పార్టీ వర్గాలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నాయి. వీరిని ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవచ్చనికూడా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒంగోలు, కడప పార్లమెంటు స్థానాలను మాత్రం జగన్ హోల్డ్ లో పెట్టారంటున్నారు. ఇక్కడ తన సమీప బంధువులే కావడంతో జగన్ స్వయంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. మిగిలిన పార్లమెంటు స్థానాలకు కొత్త అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా వైద్యులు, ఇంజినీర్లు, ఐపీఎస్, ఐఏఎస్ రిటైర్డ్ అధికారులను ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారు. వీరికి ప్రజల్లో మంచి పేరు ఉండటమే కాకుండా ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు. అంతేకాకుండా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చు. అంతేకాదు పార్లమెంటు అభ్యర్థులు విజయం సాధిస్తే ఆ ప్రభావం అసెంబ్లీ అభ్యర్థులపై కూడా ఉంటుంది. అందుకే ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. అందుకే తన దగ్గర బంధువులైన వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డిలను పక్కనపెట్టడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. కొందరు సీనియర్ నేతలను కూడా పార్లమెంటు అభ్యర్థులుగా బరిలోకి దింపాలని భావిస్తున్నారు. మొత్తం మీద జగన్ టార్గెట్ 25. ఇందుకు అవసరమైన అభ్యర్థుల ఎంపిక వేగంగా జరగుతుందని సమాచారం.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22364
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author