విద్యుత్ శాఖలో తిమింగలాలు ఖజనాకు గండికొడుతున్న అధికారులు

విద్యుత్ శాఖలో తిమింగలాలు ఖజనాకు గండికొడుతున్న అధికారులు
December 27 14:10 2018

కేసీఆర్ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడంలో విద్యుత్ పాత్ర కీలకం. ఉచిత, నిరంతర విద్యుత్ సరఫరాతో కోతలకు కాలం చెల్లి ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విశ్వాసం నెలకొనేందుకు ఇదొక ముఖ్యమైన కారణం. అయతే ఇదంతా పైకి కనిపిస్తున్న వాస్తవం. కానీ తెరవెనుక మాత్రం ఈ శాఖ అధికారుల పనితీరు, వారి వ్యవహార శైలి ఖజానాకు గండికొట్టే విధంగా ఉండటం విమర్శల కు దారితీస్తోంది. బిల్లుల వసూలు, సబ్సిడీల వల్లే విద్యుశాఖకు భారీ నష్టం వాటిల్లుతోందన్న అపోహలు అవాస్తవమనే అనుమానాలు ప్రబలుతున్నాయ. ఖజానాకు గండికొట్టే విధంగా వ్యవహరి స్తున్న అధికారులు సబ్సిడీల వల్లే నష్టం వాటిల్లు తోందనే వాదనను బలపరిచేందుకు యత్నించడం విడ్డూరం. ప్రైవేట్ వ్యక్తుల నుంచి అడ్డగోలు అంచనాలు తయారుచేసి పనులను మంజూరు చేయడంతో పాటు వారి నుండి డబ్బులు కట్టించుకుని పనులు చేస్తున్నారంటూ విద్యుత్ శాఖపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ.  వాటిని నిజం చేసే విధంగా అధికారులు ప్రభుత్వ రంగ సంస్థల నుండి కూడా భారీ సంఖ్యలో కోట్లాది రూపాయలను తమ ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. విద్యుత్ శాఖకు కేవలం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా మేలైన విద్యుత్‌ను అందించేందుకు అవసరమైన పరికరాల కొనుగోలు తదితర అంశాలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. ఎవరైనా తమ అవసరాల కోసం వాణిజ్యపరంగా కావాలంటే అంచనా ప్రతిపాదనలు రూపొందించి దానికి అనుగుణంగా డబ్బులు చెల్లిస్తే తప్ప విద్యుత్ శాఖ పనిచేయదు. లేదా 10 శాతం పర్యవేక్షణ చేసేందుకు నిధులు చెల్లించి మిగిలిన పనులను ప్రైవేటు వ్యక్తులకే ఇతర సంస్థల ద్వారా పనిచేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తారు. కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతిపాదించే పనులకు మాత్రం విద్యుత్ శాఖనే ప్రాజెక్టు ద్వారా పనులను నిర్వహిస్తుంది. ఇందులోనే మతలబు ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయ. దీనిపై ఆరా తీయగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిశ్రమల అభివృద్ధి కోసం భూములను సేకరించి టీఎస్‌ఐఐసీ ద్వారా వివిధ కంపెనీలకు స్థలాలను కేటాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతోపాటు ఆదాయ వనరులు కల్పించడం, కల్పించుకోవడం కోసం చేపట్టిన భారీ కార్యక్రమానికి ఆర్థికంగా విద్యుత్ శాఖే దెబ్బకొడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణ గత ప్రభుత్వంలో టీఎస్‌ఐఐసీ ద్వారా సుల్తాన్‌పూర్ పార్క్‌కి విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ లైన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదేశించింది. నిబంధనల ప్రకారం టీఎస్‌ఐఐసీ ద్వారా దరఖాస్తులు స్వీకరించిన విద్యుత్ శాఖ దానికి సంబంధించి సుమారు 30 కోట్ల మేర అంచనా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. దీనిని గమనించిన అప్పటి మంత్రి కేటీఆరే స్వయంగా అధికారులను మందలించడంతో దానిని సుమారు 17 కోట్లకుకుదిస్తూ ప్రతిపాదనలు చేశారు. అందులో సైతం కొన్ని అవసరం లేని, అవసరానికి మించిన వస్తువులతో అంచనాలు వేసారని, అంత డబ్బు చెల్లించే పరిస్థితి లేదంటూ ప్రతిపాదనలలో కొన్ని మార్పులు చేయాలని టీఎస్‌ఐఐసీ ఎండి సూచించారు.మంత్రి మందలింపుతో సుమారు సగానికి సగం అంచనా ప్రతిపాదనలు మంజూరు చేసి పనులు ప్రారంభించిన అధికారులు ఇటీవల మరో ఘనకార్యం చేశారు. ఇదే శాఖ ద్వారా రెట్టింపు అంచనాల ప్రతిపాదనలతో పనులు మంజూరు చేసి అగ్రిమెంట్ కాకుండానే ప్రభుత్వం మారితే బిల్లుల చెల్లింపులు కావంటూ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఒకే లైనును తీసుకెళ్లాల్సి ఉండగా రెండు లైనుల ప్రతిపాదనలు చేసి సుమారు 18 కోట్లకు టెండరు వేసినట్లు తెలుస్తోంది. చెందన్‌వెల్లిలోని టీఎస్‌ఐఐసీ పార్క్‌కి విద్యుత్ సరఫరా కోసం కనకమామిడి నుండి విద్యుత్ లైనును వేసేందుకు సుమారు 19 కోట్ల అంచనా ప్రతిపాదనలు రూపొందించారు. దీనిపై ఇప్పటికే టీఎస్‌ఐఐసీ సుమారు తొమ్మిది కోట్లు చెల్లించగా మిగిలిన నిధులను వెంటనే చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఈ అంచనాల్లో కూడా సుల్తాన్‌పూర్ తరహాలోనే మార్పులు చేయాలని కోరినప్పటికి విద్యుత్ శాఖ అధికారులు మాత్రం దానిని పట్టించుకోకుండానే ప్రభుత్వం మారితే అంచనాలు మారుతాయంటూ కాంట్రాక్టర్‌కు అగ్రిమెంట్ ఇవ్వకుండానే పనులు ప్రారంభింప చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి మంత్రిఆదేశాలతో మూడుసార్లు మార్చిన అంచనాలను ఉదాహరణగా తీసుకుని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ సంస్థల ద్వారా చేపట్టిన పనులపై సమగ్ర విచారణ జరిపి తక్కువ వ్యయంతో ఎక్కువ నైపుణ్యం గల పనులు చేసుకునే అవకాశం ఉన్నప్పటికి విద్యుత్ శాఖ ఎండీ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా అధికారులు తమ ఇష్టానుసారంగా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22505
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author