బాబుజీ విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు

బాబుజీ విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు
December 27 15:49 2018

నోరు లేని దేవుళ్ళు, శిలా విగ్రహాలు సైతం ఓట్ల పంట పండిస్తాయి. ఆ విషయం రాజకీయ నాయకులకు తెలిసినంతగా వేరెవరికీ తెలియదు. అందుకే ఎన్నికల వేళ కొత్త విగ్రహాలు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఇపుడు విగ్రహాలపై మక్కువ పెంచుకున్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మళ్ళీ ఎన్నికల్లో గెలిచేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్న్నారు. అందులో భాగంగా ఆయన బాబూ జగజ్జీవన్ రాం ని నమ్ముకున్నారు. దేశ ఉప ప్రధానిగా పనిచేసిన జగజ్జీవన్ రాం విగ్రహం గాజువాక సెంటర్లో పెట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే ఇప్పటికి ఎమ్మెల్యేకు ఆ సంగతి గుర్తుకొచ్చిందని అంటున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హడావుడిగా రంగంలోకి దిగిపోయారు.  ఇక ఒక విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేయాలంటే జీవీఎంసీ అనుమతి తీసుకోవాలి. అందుకోసం దరఖాస్తు చేస్తే కమిటీ పరిశీలించి తగిన స్థలంలో పెట్టడానికి ఆమోద ముద్ర వేస్తుంది. అయితే ఈ తతంగం అంతా అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తనకి అవసరమా అనుకున్నారేమో మరి తాను కోరుకున్న ప్రాంతంలో పెట్టేందుకు సన్నాహలు చేసేస్తున్నారు. అక్కడ అనుమతి లేని ఓ విగ్రహం చాలా కాలంగా ఉంది. ఆయన స్థానిక నాయకుడు పులి భూలోకరెడ్డి. ఆయన విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించి ఆ ప్రదేశంలో బాబూజీ విగ్రహం పెట్టడానికి ఎమ్మెల్యే రెడీ అయిపోయారు. దీనివల్ల విగ్రహానికి రెడీమేడ్ గా స్థలం దొరికేసింది. అదే సమయంలో ఆ విగ్రహం తొలగించాలని కోరిన వారి డిమాండ్ తీర్చినట్లవుతుంది. ఇక బాబూజీ విగ్రహం ఏర్పాటు వల్ల కొత్తగా అనుమతి తీసుకోనవసరంలేదని భావిస్తూ వ్యూహం రూపొందించారని అంటున్నారు. నాలుగున్నరేళ్ళుగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని గెలుపు డౌట్లో పడిన ఎమ్మెల్యే ఉన్నట్లుండి విగ్రహాల రాజకీయం తెర మీదకు తీసుకురావడం వెనక ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దళితుల ఓట్లను పెద్ద సంఖ్యలో కొల్లగొట్టడానికే ఈ కధ నడిపిస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేకు ఆ వర్గంపై ప్రేమ ఉంటే ఇంతకాలం వారి అభివృధ్ధి కోసం ఎందుకు పనిచేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు చూసుకునే ఇలా చేస్తున్నారని అంటున్నారు. కాగా ఎవరు ఏమనుకున్నా బాబూజీ విగ్రహం పెట్టడం ద్వారా ఉప ప్రధానిని గౌరవించామని, ఇది కూడా అభివృధ్ధిలో భాగమేనని ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడు గెలవడం తధ్యమని, అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మొత్తానికి విగ్రహాల రాజకీయం విశాఖలో బాగానే జరిగిపోతోంది. ఆ మధ్యన విశాఖ బీచ్ లో హరిక్రిష్ణ, దాసరి, అక్కినేని విగ్రహాలను ఇలా అనుమతి లేకుండా ఏర్పాటు పాటు చేసి జీవీఎంసీకి కొందరు నాయకులు ఝలక్ ఇచ్చారు. ఇపుడు ఎమ్మెల్యే సైతం ఈ విధంగా చేయడంతో అనుమతులు నిబంధనలు సామాన్యునికేనా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22539
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author