చేతులు మారుతున్న చౌకబియ్యం

చేతులు మారుతున్న చౌకబియ్యం
January 04 13:06 2019

 జిల్లాలో 40 లక్షలకుపైగా జనాభా ఉన్నారు. 2,212 రేషన్‌ దుకాణాల పరిధిలో 11,82,426 కార్డుదారులున్నారు. జిల్లాలో 17 ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా ప్రతి నెలా 17 వేల క్వింటాళ్లకు పైగా పౌర సరఫరా శాఖ డీలర్లకు రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. జిల్లాలో పలు గోదాముల నుంచే చేతులు మారుతోంది. అవినీతి అక్రమాలకు డీలర్లు, మిల్లర్లు, అధికారులు పలుమార్గాలు ఎన్నుకున్నారు. చౌక దుకాణాల్లో వేలిముద్రలు వేసి కొందరు రేషన్‌ బియ్యాన్ని డీలర్లకే కిలో రూ.10కి పడే బియ్యం రూ.15కు అమ్మేస్తున్నారు. వీటిని డీలర్లు ఆటోల్లో గోప్యంగా ఓ రహస్య ప్రదేశంలో నిల్వ ఉంచుతున్నారు. కొందరు అధికారులతో చేతులు కలిపి గోదాములోనే నిల్వ ఉంచి అనుమానాల్లేకుండా లారీల్లో తరలిస్తున్నట్లు సమాచారం. ఆత్మకూరులో ముగ్గురు వ్యక్తులు ఈ దందా నడుపుతున్నారు. ఇలాగే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ అక్రమ తంతు కొనసాగుతోంది.బియ్యం సేకరణ ఓ చిన్నపాటి కుటీర పరిశ్రమలా సాగుతోంది. వందలాది మంది పేదలు ఇందులో జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాతో పాటు పొరుగు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కొందరు ఇంటింటికి తిరిగి పడి బియ్యం రూ.15కు కొనుగోలు చేస్తున్నారు. కొందరు బొరుగులు ఇచ్చి కొంటున్నారు. సేకరించిన బియ్యాన్ని మిల్లర్లకు అమ్మేస్తున్నారు. ఇంతవరకు ఓ ఎత్తైతే అసలు తంతు మిల్లులో మొదలవుతోంది. చౌక బియ్యాన్ని దగదగ మెరిసేలా పాలిష్‌ చేస్తున్నారు. రకరకాల బ్రాండ్‌లతో నిర్ణయించిన మోతాదుల్లో కల్తీ చేస్తున్నారు.భూమి చుట్టూ తిరిగొచ్చి చివరకు ఉన్నచోటుకే చేరుకున్నట్లు రేషన్‌బియ్యం అక్రమార్గాల్లో తిరిగి చివరికి వినియోగదారుడిని చేరుకుంటోంది. పౌర సరఫరా శాఖ సరఫరా చేస్తున్న బియ్యం తీసుకునేవారు ఎక్కువ తినేవారు తక్కువ. పాలిష్‌తో దగదగ మెరిసే బియ్యం తిరిగి మన ఇంటికే చేరుతోంది. మభ్యపడిన ప్రజలు వాటిని మంచివని తింటున్నారు.ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల బ్రాండ్‌లతో బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఏది అసలో ఏది నకిలీనో తెలియని దుస్థితి. దగదగల వెనుక దగాకోరు వ్యాపారం కొనసాగుతోంది. ఇందులో ఏ బ్రాండ్‌లో ఎంత కల్తీ ఉందో గుర్తించడం తయారు చేసిన వ్యాపారులకే తెలియాలి. వెలుగోడు రైస్‌మిల్‌లో పట్టుబడిన సంచుల్లో దునియా, యాపిల్‌, రెడ్‌బుల్‌, తాజ్‌మహల్‌, అన్నపూర్ణ, ధనుష్‌, మ్యాంగో, క్యాపిటల్‌, బెస్ట్‌ క్వాలిటి, డబుల్‌హార్స్‌, వంటి పలు కంపెనీ బ్రాండ్‌లతో ఉన్న సంచులను అధికారులు గుర్తించారు. వీటిలో ఏవి అసలో ఏవీ కల్తీవో అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. దునియా రకంలో 80 శాతం చౌక బియ్యం కల్తీ చేస్తున్నట్లు అధికారుల ముందు ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తనిఖీ చేసిన పోలీస్‌ అధికారులు ఏ బియ్యం మంచిదో ఏదీ కల్తీనో నిర్ధరించాల్సిందిగా పౌర సరఫరాల శాఖకు విన్నవించారు. జిల్లాలో పలు బ్రాండ్‌లతో సరఫరా అవుతున్న బియ్యం పేరుకే బ్రాండ్‌లు బియ్యం అంతా ఒక్కటే. ఒక మిల్లర్‌ నుంచి వచ్చే బియ్యం అంతా ఒక్కటే కావడం గమనార్హం.పాలిష్‌ చేసి వివిధ బ్రాండ్‌లతో ఉన్న సంచుల్లో నింపిన బియ్యాన్ని మన జిల్లా, పొరుగున ప్రకాశం జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ముంబాయి ప్రాంతాలకు అడ్డదారుల్లో యథేశ్ఛగా తరలిస్తున్నారు. సోనా, ఇతర బ్రాండ్‌ల పేరుతో జిల్లాలోని పలు దుకాణాలకు విక్రయిస్తున్నారు. ఈ తతంగమంతా రెవెన్యూ, పోలీస్‌, విజిలెన్స్‌ అధికారులకు తెలియకుండా ఉంటుందా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆహార తనిఖీ అధికారుల కొరత జిల్లాలో పెద్ద సమస్యగా మారింది. జిల్లాలో నలుగురు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌లు, గెజిటెట్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ పోస్టులు ఉండాలి. అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ కడప నుంచి బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఇక గెజిట్‌, ఇద్దరు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు నంద్యాల, ఆదోని డివిజన్‌లలో విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు ఆఫీస్‌ సబార్డినేట్‌లకు గాను ఒక్కరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.జిల్లాలో బియ్యం మాఫియా పలు ప్రాంతాల్లోని మిల్లర్ల నుంచి యథేచ్ఛగా కొనసాగుతోంది. బనగానిపల్లెలో ఈ వ్యాపారం అత్యధికంగా జరుగుతున్నట్లు సమాచారం. వెలుగోడుతో పాటు కర్నూలు, డోన్‌, కోవెలకుంట్ల, నంద్యాలలో జోరుగా సాగుతోంది. జిలా ఎస్పీ ఆదేశాలతో వెలుగోడులోని రైస్‌మిల్‌పై దాడి ఘటనతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22845
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author